యాదగిరిగుట్ట, వెలుగు: బీఆర్ఎస్ అసంబద్ధ నిర్ణయాలతో ఆగమైన యాదగిరిగుట్ట పట్టణానికి పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య చెప్పారు. మంగళవారం యాదగిరిగుట్ట మున్సిపల్ ఆఫీస్‌లో ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టెంపుల్‌కు వచ్చే ఆదాయం నుంచి 30 శాతం గ్రాంట్ యాదగిరిగుట్ట గ్రామపంచాయతీకి వచ్చేదని, బీఆర్ఎస్ నిర్లక్ష్యం కారణంగా నయా పైసా కూడా రాలేదని ఆరోపించారు. అంతేకాదు వైటీడీఏ ఏర్పాటుతో మున్సిపాలిటీకి వచ్చే ఆదాయం కూడా అటే వెళ్తోందన్నారు. దీంతో మున్సిపాలిటీ నిర్వహణ భారంగా మారిందని, సిబ్బందికి జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితికి చేరిందని వాపోయారు.
గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు యాదగిరిగుట్ట మున్సిపాలిటీకి రూ.25 కోట్లు, ఆలేరుకు రూ.15 కోట్లను రిలీజ్ చేసినట్లు ప్రకటించినా.. రూపాయి కూడా రిలీజ్ కాలేదన్నారు. కనీసం భవనాలు కూడా నిర్మించలేదని మండిపడ్డారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకలసుధా హేమేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ అజయ్ కుమార్, కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేశ్ యాదవ్, యాదగిరిగుట్ట మాజీ ఉప సర్పంచ్ గుండ్లపల్లి భరత్ గౌడ్, ఏఈలు శ్రీరాం, నవీన్ తదితరులు ఉన్నారు.