
- వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి పనిచేద్దాం
- ఎన్డీఏ మీటింగ్లో నేతల తీర్మానం
- ప్రధాని మోదీ అధ్యక్షతన భేటీ
- చంద్రబాబు, ఫడ్నవీస్,పవన్ కల్యాణ్, అమిత్ షా,రాజ్ నాథ్ సహా కీలక నేతలు హాజరు
న్యూఢిల్లీ:బిహార్, వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్(ఎన్డీఏ) నేతలు తీర్మానించారు. గురువారం ఢిల్లీ కొత్త సీఎం రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఎన్డీఏ కూటమి సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు, కీలక నేతలు సమావేశమయ్యారు.
కేంద్రం, రాష్ట్రాల్లోని ఎన్డీఏ ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం, దేశ పురోగతి కోసం గట్టిగా పని చేయాలని ఈ సమావేశంలో ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారని మీటింగ్ తర్వాత బీజేపీ జనరల్ సెక్రటరీ వినోద్ తావ్డే మీడియాకు వెల్లడించారు. ఈ ఏడాది, వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో కూటమి పార్టీలన్నీ కలిసికట్టుగా, గట్టిగా పని చేసి మెరుగైన ఫలితాలను సాధించాలని సమావేశంలో తీర్మానం చేసుకున్నారని తెలిపారు.
మీటింగ్ కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ, ఎన్డీఏ అధికారంలో ఉన్న ఇతర రాష్ట్రాల సీఎంలు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు.