గౌరవ ముఖ్యమంత్రి
కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి,
విషయం: గ్రూప్1 మెయిన్స్ అర్హత జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ జనరల్ అభ్యర్థులకు న్యాయం చేయుట గురించి..
ఆర్యా!
తెలంగాణ నిరుద్యోగుల పక్షాన వినమ్రంగా నమస్కరించి రాయునది ఏమనగా, ఇటీవల టీఎస్పీఎస్సీ ప్రకటించిన గ్రూప్1 పరీక్ష అర్హత జాబితాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ జనరల్ అభ్యర్థులకు నష్టం జరిగింది. కొత్తగా వచ్చిన ఈడబ్ల్యూఎస్ కోటా వల్ల వివిధ సామాజిక వర్గాల వారి అవకాశాలు కొంతమేర తగ్గాయి. ఈ అంశాల వల్ల బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు, ఉద్యోగం చేస్తున్న ఓసీ అభ్యర్థులకు ప్రత్యేకించి జనరల్ అభ్యర్థులకు శాపంగా మారింది. అన్ని సామాజిక వర్గాలతో పాటు ప్రత్యేకించి 50 శాతం పైగా ఉన్న బీసీలకు తీవ్ర స్థాయిలో నష్టం వాటిల్లుతున్నది. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారంగా, మధ్యే మార్గంగా, నష్ట నివారణ చర్యగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన గ్రూప్1 నియామక ప్రక్రియలో భాగంగా చేసిన అర్హత జాబితాలో పోస్టుల సంఖ్యకు అనుపాతంగా అన్ని కేటగిరీలను కలుపుకుని ఓపెన్ గా 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయడానికి సహకరించండి. అప్పటికీ రిజర్వేషన్ అభ్యర్థులు అనుకున్న స్థాయిలో ఎంపిక కాకపోతే ఆయా కేటగిరీల వారీగా అదనంగా ఎంపిక చేయవచ్చు. ఈ సంప్రదాయం గతంలో జరిగిన అన్ని గ్రూప్1 నోటిఫికేషన్లలో అమలు చేశారు. అలా చేయడం వల్ల అన్ని కేటగిరీల్లో ప్రతిభ గల అభ్యర్థులు మెయిన్స్ కు అర్హత పొందే అవకాశం ఉంటుంది. ఇదే విధానాన్ని పాటించాలని 2009లో సుప్రీంకోర్టు సైతం ‘బాలోజీ బధావత్’ కేసులోనూ తీర్పు ఇచ్చింది.
మరో పరిష్కారాన్ని కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాం. పెద్ద మనసుతో పరిశీలిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు 1:50 చొప్పున ఎంపిక చేసిన అభ్యర్థులకు బదులుగా అన్ని పోస్టులకు గాను1:150 చొప్పున ఎంపిక చేయడం వల్ల ఎక్కువ మంది ఆశావహులకు అవకాశం వస్తుంది. ప్రిలిమ్స్ అనేది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఆ ప్రిలిమ్స్ పరీక్ష కూడా కఠినంగా ఉండటం, సివిల్స్ స్థాయి మించి ఉండటం, సివిల్స్ పరీక్షలో ఇచ్చిన సమయం కంటే అర్ధ గంట తక్కువ సమయం ఇవ్వడం వల్ల అందరు అభ్యర్థులు సుమారు 30 నుంచి 35 ప్రశ్నలు చదవకుండానే జవాబులు పెట్టారు. ఇటీవల ‘పోలీస్ నియామక ప్రక్రియలో భాగంగా నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష కూడా కఠినంగా ఉండటం వల్ల సహృదయంతో స్పందించి అర్హత మార్కులను తగ్గించి ఎక్కువ మందికి అవకాశం కల్పించిన విషయాన్ని తెలంగాణ నిరుద్యోగ యువత ఎన్నటికీ మర్చిపోదు. అదే రీతిలో గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష కఠినత్వం,12 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కావడం, సుమారు 3.8 లక్షల మంది అప్లై చేసుకోవడం, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతలో చాలామందికి ఇది చివరి అవకాశం కావడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని 1:50కి బదులుగా సవరణ చేసి 1:150 నిష్పత్తిలో మెయిన్స్ కు ఎంపిక చేసి కొత్తగా జాబితాను తయారుచేస్తే ఎక్కువ సంఖ్యలో అవకాశం కల్పించినట్లవుతుంది.
అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుంది. మళ్లీ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియదు. ఒకవేళ వచ్చినా ఇప్పుడు చివరి అవకాశం కలిగి ఉన్న వారికి అప్పటికి అవకాశం వస్తుందని చెప్పలేం. కాబట్టి సహృదయంతో స్పందిస్తారని ఆశిస్తున్నాం.
ధన్యవాదాలతో..
– గ్రూప్1 ఆశావహులు, తెలంగాణ రాష్ట్రం