- లెటర్ టు ఎడిటర్: ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి
పైడిమర్రి వెంకట సుబ్బారావు పేరు చెప్పగానే మనకి ‘భారత దేశం నా మాతృ భూమి’ ప్రతిజ్ఞ గుర్తకువస్తుంది. ఆయన ప్రతిజ్ఞతో పాటు పలు రచనలు చేశారు. ఆయనకు పలు భాషలపై పట్టు ఉంది. నవలలు, వ్యాసాలు, కథలు,నాటికలు ఆయన కలం నుంచి జాలువారాయి. పైడిమర్రి చిన్నవయసులోనే "కాల భైరవుడు"అనే నవలని రాశారు. మనిషికెంత భూమి కావాలి? అనే రచన చాలా గొప్పది. యోగాకి సంబంధించి ధౌతి-నౌలి,గీతా భాష్యం, అదృష్ట కవచం, అశ్వరత్నం, జీవితమహాపథం వంటి రచనలు చేశారు. రాజులు, పిల్లిపోడు, నౌకరి వంటి కథలు రాశారు. శ్రీమతి, కొత్తకాతా, తార వంటి నాటికలని రాశారు. పైడిమర్రి 1916 జూన్ 10న నల్గొండ జిల్లాలో అన్నేపర్తి గ్రామంలో జన్మించారు.
విశాఖపట్నంలో ఖజానాధికారిగా పనిచేస్తూ ఉండగా 1962 సెప్టెంబర్ 17న ప్రతిజ్ఞ రాశారు.1964లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాఠ్య పుస్తకాలలో ప్రతిజ్ఞను తొలిసారి ముద్రించారు. అదేవిధంగా ప్రతిజ్ఞ 1965 నుంచి ఇది దేశవ్యాప్తంగా ఆలపించబడుతోంది. నీతి నిజాయితీ గల ప్రభుత్వ ఉద్యోగిగా పేరు పొందారు. ఆయన 1988 ఆగస్ట్ 13 న తుదిశ్వాస విడిచారు. ప్రభుత్వం నుంచి ఏ గౌరవానికి నోచుకోలేదు.
2016లో ఆయన శత జయంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో పైడిమర్రి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అధికారులు, సాహితీవేత్తలు ప్రకటన చేశారు. అది ఇంతవరకు కార్య రూపం దాల్చలేదు. దేశానికి జాతీయ ప్రతిజ్ఞని అందించిన మహనీయుడిని మనందరం నిత్యం స్మరించుకోవాలి. ఆయన జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రతి ఏటా ఘనంగా జరపాలి. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం స్పందించి హైదరాబాద్లో ట్యాంక్ బండ్పై ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.
- యమ్. రామ్ ప్రదీప్