బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ ప్రజల ఆరోగ్యం ముఖ్యంగా వయోధికులను దృష్టిలో పెట్టుకొని, ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గించి రక్షణను పెంపొందించడానికి ఆరోగ్య బీమా పాలసీలను తీసుకునే వ్యక్తులకు 65 ఏండ్ల వయస్సు పరిమితిని తొలగించినది. ఇది అత్యంత హర్షించదగ్గ విషయం. ప్రజలు సమగ్ర ఆరోగ్య వైద్య సదుపాయాలు పొందుటకు అది విశేషంగా తోడ్పడుతుంది. ఆరోగ్య బీమా అందరికీ అందుబాటులో ఉండటం మంచిది. ఈ కాలంలో ప్రజలకు ఆరోగ్య బీమా అనివార్యమవుతున్నది.
దానికి వయసుతో సంబంధంలేకుండా అమలు చేయడం ప్రశంసనీయం. ముఖ్యంగా 65 ఏండ్ల వయసు దాటిన వారికి ఇది ఉపయోగకరమైన నిర్ణయం. ప్రీమియం చెల్లింపుల విషయంలో కూడా ఈ సంస్థ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నిర్ణయం తీసుకోవాలి. ప్రజలందరూ ఆరోగ్యవంతంగా జీవించటం అనేది ఒక హక్కు అని ఐక్యరాజ్యసమితి తెలిపింది. తక్కువ ప్రీమియంతో అధిక బీమా సౌకర్యం కల్పిస్తే అధిక సంఖ్యలో ప్రజలు ఆకర్షితులవుతారు. తద్వారా మెరుగైన ఆరోగ్యం పొందుతారు. ఆరోగ్య బీమా తీసుకున్న ప్రతి వ్యక్తి కూడా రోగాల బారిన పడరు. అందువలన బీమా కంపెనీలకు ఎటువంటి నష్టాలు రావు. కేవలం అనారోగ్యంగా ఉన్నవారికి బీమా పథకాలు ఉపయోగపడతాయి.
అలాగే కార్పొరేట్ వైద్యశాల హాస్పిటల్ లలో వారంలో ఒకసారి అందరికీ ఉచిత వైద్య సేవలు అందించాలి. అదేవిధంగా జనరిక్ మందుల దుకాణాలు కూడా ఏర్పాటు చేయాలి. ఇందులో అన్ని రకముల మందులు ఇతర వైద్య పరికరాలు కూడా లభించేటట్లు చూడాలి. ముఖ్యంగా ప్రజల సంక్షేమం ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని కార్పొరేట్ హాస్పిటల్ తరహాలో ప్రభుత్వ దవాఖానాలలో వైద్య సౌకర్యాలు విస్తృత స్థాయిలో కల్పించాలి. దేశ ప్రగతి ప్రజల ఆరోగ్యంపైనే ఆధారపడుతుందనే విషయం మరువరాదు.
- దండంరాజురాంచందర్ రావు