భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత దళితులకు విద్య, రాజకీయ, ఆర్థిక విషయాల్లో వారిని ముందుకు తీసుకువెళ్లేందుకు రిజర్వేషన్స్అమలులోకి తెచ్చింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 16.06 శాతం ఎస్సీ జనాభా భారతదేశంలో నివసిస్తున్నారు. వారికి రాజ్యాంగం 15శాతం రిజర్వేషన్స్ను అమలు చేస్తోంది. మన దేశంలో ప్రతి ఐదు ఏండ్లకు జరిగే ఎన్నికల్లో వీరి మద్దతు ఎక్కువ ఏ పార్టీ పొందుతుందో ఆ పార్టీకి విజయావకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది.
ఇటీవల జరిగిన 18వ లోక్సభ ఎన్నికల్లో దళితుల ఓటు అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం ఇండియా కూటమిలో అనూహ్య మార్పు రావడానికి, సీట్ల సంఖ్య పెరగడానికి దళితుల మద్దతు కారణమని చెప్పొచ్చు. భారత్లో 84 ఎస్సీ రిజర్వుడ్ ఎంపీ స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు 34 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ 29 సీట్లు గెలుచుకుంది. దీనిప్రకారం దళిత ఓటు మద్దతు ఇండియా కూటమివైపు ఉన్నట్లు తెలుస్తున్నది.
కాగా, అయోధ్యలో ఇండియా కూటమి అభ్యర్థి అవదేశ్ ప్రసాద్(ఎస్సీ) బీజేపీ అభ్యర్థి లాలుసింగ్ ఠాకూర్ (ఓసీ)ని ఓడించారు. అయోధ్య ఎంపీ నియోజకవర్గం జనరల్ కేటగిరీకి సంబంధించింది. నేషనల్ ఎలక్షన్ స్టడీస్ సర్వే ప్రకారం ఏ రాష్ట్రంలో దళితులు ఏ పార్టీకి మద్దతు ఇస్తారో ఆ పార్టీ విజయం సాధించినట్లుగా సర్వే నివేదిక వెల్లడించింది. యూపీలో ఇండియా కూటమి దళిత ఓట్లను ఆకర్షించి ఆధిక్యాన్ని సాధించింది. దీంతో ఉత్తరప్రదేశ్లో అధికార బీజేపీ గణనీయంగా సీట్లను కోల్పోవడంతోపాటు కేంద్రంలో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది.
కర్నాటక, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ దళిత ఓట్లను ఆకర్షించి అధికారంలో కొనసాగుతున్నది. రాజస్థాన్లో ఇండియా కూటమి దళిత ఓట్లు మద్దతుతో 46శాతం ఓట్లు సాధించింది. అదేవిధంగా అస్సాం,రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం దళితుల ఓట్లు. ప్రస్తుతం దళిత ఓట్లు భారత రాజకీయ స్వరూపం, స్వభావాలను మార్చే స్థాయికి ఎదిగింద నడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
-కలువాల సంతోష్