ఎన్నికల్లో ఓడిన వెంటనే మర్యాద పూర్వకంగా అధికారం నుంచి తప్పుకోవడం అనేది మన దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో మన నేతలు ఆచరిస్తున్న అతి ముఖ్యమైన అంశం. తెలంగాణ రాష్ట్రాన్ని దాదాపు పది సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేసిన శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్నికల ఫలితాలు ప్రకటించగానే హుందాగా తన ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవడం ప్రజాస్వామ్యం పట్ల మన గౌరవానికి నిదర్శనం.అనేక దేశాల్లో ఎన్నికలు పూర్తయ్యాక పదవిని పట్టుకొని దిగిపోకుండా ప్రజలను గందరగోళపరిచేవి జరుగుతుంటాయి. కానీ, మన దేశంలో అధికార మార్పిడి రాష్ట్రాల స్థాయిల్లో, దేశ స్థాయిలో ఇంత సౌమ్యంగా, బాధ్యతగా జరిగిపోవడం ప్రపంచ దేశాలకే ఆదర్శం. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ అధికార మార్పిడి విషయంలో వందకు వంద మార్కులను సంపాదించుకున్నది. అధికారంలో ఉన్నప్పుడు నేతలు ఎంత కర్కోటకంగా, అమానవీయంగా ప్రవర్తించినా.. ప్రజల మద్దతును పొందలేని పరిస్థితుల్లో గౌరవంగా తప్పుకొని ఇంటికి వెళ్లడం భారత రాజకీయాలు నేర్చుకున్న అద్భుత సంప్రదాయం. మన ప్రజాస్వామ్యంలో ఎన్ని లోపాలు ఉన్నా, మన నేతలు ఎంత లోపభూయిష్ట ప్రవర్తనను కలిగి ఉన్నా అధికార బదిలీని మాత్రం గౌరవంగా అంగీకరించడం ప్రపంచంలో మన దేశ గౌరవాన్ని పెంచింది. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో సైతం డోనాల్డ్ ట్రంప్ అధికారం బదిలీ చేసే సమయంలో చాలా గందరగోళం సృష్టించాడు. ఏదేమైనా మన నేతలు భారతదేశ ప్రజాస్వామ్య స్ఫూర్తిని పాటించడం మనందరికీ గర్వకారణం.
- కె. శ్రీనివాసాచారి
సోషల్ వర్కర్, తూప్రాన్