సింగరేణి ఉద్యోగులు రాక్షసి బొగ్గు పెల్ల, పుట్టెడు బండల కింద చావుతో సావాసం చేసి దేశానికి విద్యుత్ శక్తి ఇంధనాన్ని అందజేస్తున్నారు. వీరు ఉద్యోగ విరమణ తర్వాత ఎందుకూ పనికిరాని వస్తువులుగా, మూసివేసిన గనుల మాదిరిగా శేష జీవితాన్ని అత్యంత దుర్భర స్థితిలో గడుపుతున్నారు. ఉచితంగా అపరిమిత వైద్య సౌకర్యాలు కల్పించాలని సింగరేణి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా చెత్తబుట్టలో దాఖలు చేస్తున్నారు. ఒక్కసారి కూడా మా సమస్యలపై స్పందించడం లేదు. కనీసం చర్చలకు కూడా పిలవడం లేదు. సింగరేణిలోని జాతీయ కార్మిక సంఘాలు, గత గుర్తింపు సంఘం ఎన్నడూ కూడా రిటైర్డ్ ఉద్యోగుల వైద్య సౌకర్యాల గురించి యాజమాన్యంతో సంప్రదింపులు జరిపినట్టు కనిపించలేదు. రిటైర్డ్ ఉద్యోగులతో 40 వేల రూపాయలు కట్టించుకుని 8 లక్షల రూపాయల కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికేర్ స్కీం ద్వారా భార్యాభర్తలు ఇరువురికి జీవితాంతం వైద్య సౌకర్యాలు ఎంప్యానెల్డ్ దవాఖానాలలో కల్పిస్తున్నారు.
కానీ, ఈ ఆసుపత్రిలో వైద్య సౌకర్యం పొందడం అంటే భగీరథ ప్రయత్నమే. సింగరేణి బిల్లులు సకాలంలో చెల్లించడం లేదని దవాఖానాల యాజమాన్యాలు తెలుపుతున్నాయి. సంస్థకు లాభాలు చేకూర్చిన రిటైర్డ్ ఉద్యోగుల పట్ల నిర్లక్ష్యం, వివక్ష వైఖరి ప్రదర్శిస్తున్నది. గతంలో సింగరేణి దవాఖానాలలో ఇన్, అవుట్ పేషెంట్ వైద్య సౌకర్యాలు ఉచితంగా కల్పించినారు. ప్రస్తుతం ఇన్ పేషెంట్ సౌకర్యం కోసం సీపీఆర్ఎంఎస్ కార్డు నుంచి మినహాయిస్తున్నారు. ఇది చాలా శోచనీయం. మా దీన పరిస్థితిని అర్థంచేసుకొని ఉచిత అపరిమిత కార్పొరేట్ వైద్య సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాం. ప్రస్తుత చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్, సింగరేణి ప్రాంత ప్రజా ప్రతినిధులను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ మేరకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. కాంగ్రెస్ సర్కార్ సత్వరమే తగు చర్యలు తీసుకోవాలి.
- దండంరాజు రాంచందర్