లెటర్​ టు ఎడిటర్​ : ధరల దరువు..బతుకు బరువు

లెటర్​ టు ఎడిటర్​ :  ధరల దరువు..బతుకు బరువు

ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా పెరిగిన ధరలతో సామాన్య ప్రజల బతుకు అస్తవ్యస్తంగా మారింది. దీనికి  తాజా ఉదాహరణ.. కూరగాయల మార్కెట్​లో టమాట, పచ్చిమిర్చి ధరలే నిదర్శనం. దేశంలో ఉండే పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన సామాన్య ప్రజలు ఏ కూరకు అయినావాడేవి టమాట, పచ్చిమిర్చి అని చెప్పవచ్చు. రోజురోజుకూ పెరుగుతున్న  ధరలతో ప్రజలు అల్లాడుతున్నారు.  ప్రతిరోజు నిత్యావసరాలు కొనాలంటే 150 రూపాయల నుంచి 200 రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక మిర్చి అయితే కొనలేక వెనుకకు తిరుగుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు మంచి నూనె, పాలు, పప్పులు రాకెట్ వేగంతో దూసుకుపోయే పరిస్థితి ఈ దేశంలో ఉన్నది. దేశంలో సుమారు 27% మంది సామాన్య పేద ప్రజలు పప్పు వాడకం మానేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు సవరణ చర్యలు తీసుకోవాలి.  

దేశ ప్రజానీకం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో కనీసం ఆలోచన కూడా చేయకపోవడం శోచనీయం. మొక్కు బడి పర్యటనలు చేయడం ద్వారా అసలు సమస్యలకు పరిష్కారం లభించదని ఇకనైనా గ్రహించాలి. దేశంలో చాలా మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడం పాలకులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచే విధంగా ప్రయత్నాలు ముమ్మరం చేయాలి. దీనికి తోడు దేశ వ్యాప్తంగా ఈ జూన్ నెల ముగిసినా సరైన వర్షపాతం నమోదు కాలేదు. తూతూ మంత్రంగా వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులకు లాభసాటిగా వ్యవసాయ రంగం మార్చేందుకు పాలకులు నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలి. నూతన వంగడాలు పంటల సాంకేతిక పరిజ్ఞానంపై  రైతులకు అవగాహన కల్పించాలి. రాబోయే కాలంలో ఆహార ఉత్పత్తులకు ఆటంకం లేకుండా చూడాలి. తద్వారా దేశ జనాభా  అనుగుణంగా ఆహార ధాన్యాలను అందించవచ్చు.

- లకావత్
చిరంజీవి నాయక్,
కాకతీయ యూనివర్సిటీ