మహారాష్ట్ర గవర్నర్, సీఎంల మధ్య లెటర్ల యుద్ధం

సెక్యులర్‌‌గా మారారా? మహారాష్ట్ర సీఎంను అడిగిన గవర్నర్‌

నాకెవ్వరూ హిందుత్వ సర్టిఫికెట్ ఇవ్వక్కర్లేదన్న సీఎం ఉద్ధవ్‌
ప్రార్థనా మందిరాల రీఓపెన్‌పై ఇద్దరి మధ్య లెటర్ల యుద్ధం

‘‘ఆలయాల రీఓపెన్ ను వాయిదా వేయాలని దేవుడి నుంచి మీకేమైనా ఆదేశాలు వచ్చాయా? లేక సెక్యులర్ పదాన్ని ద్వేషించే మీరు.. సడెన్ గా సెక్యులర్ గా మారిపోయారా?”
– భగత్ సింగ్ కొశ్యారీ, గవర్నర్

‘‘ఆలయాలను ఓపెన్ చేయడం లేదా క్లోజ్ లోనే ఉంచడమనేది సెక్యులరిజానికి సంబంధించినది కాదు. మన రాజ్యాంగంలో సెక్యులర్ అనే పదం ఉంది. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మీరు.. అది మరిచిపోయారా? ”
– ఉద్ధవ్ థాక్రే, సీఎం

ముంబై: మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ, సీఎం ఉద్ధవ్ థాక్రేల మధ్య లెటర్ల యుద్ధం నడిచింది. రాష్ట్రంలో ఆలయాలు, ఇతర ప్రార్థనా మందిరాలను ఓపెన్ చేసే విషయమై ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. ఒకరిపై మరొకరు సీరియస్ కామెంట్లు చేసుకున్నారు. మహారాష్ట్రలో ఆలయాలను ఓపెన్ చేసేందుకు ప్రభుత్వం ఇంకా పర్మిషన్ ఇవ్వకపోవడంపై గవర్నర్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ‘‘మీరు సడెన్ గా సెక్యులర్ గా మారారా?” అని సీఎం ఉద్ధవ్ ను ప్రశ్నించారు. ‘‘నాకెవ్వరూ హిందుత్వ సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు” అని గవర్నర్ కామెంట్ కు సీఎం కౌంటర్ ఇచ్చారు. కరోనా కారణంగా కేంద్రం లాక్ డౌన్ విధించడంతో మార్చి నుంచి గుళ్లు, ఇతర ప్రార్థనా మందిరాలను మూసేశారు. అయితే ఆ తర్వాత అన్ లాక్ లో భాగంగా కేంద్రం వాటిని ఓపెన్ చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. కానీ మహారాష్ట్ర ప్రభుత్వం వీటికి అనుమతివ్వలే. గుళ్లను ఓపెన్ చేయాలని బీజేపీ నిరసనలు చేపట్టడం, ఆ తర్వాత గవర్నర్ లెటర్ రాయడంతో.. గవర్నర్ ఆఫీస్ బీజేపీ అజెండాను అమలు చేస్తోందని శివసేన ఆరోపిస్తోంది.

దేవుడి నుంచి ఆదేశాలు వచ్చాయా?: గవర్నర్ 

కరోనా జాగ్రత్తలతో ఆలయాలు, ప్రార్థనా మందిరాలను ఓపెన్ చేసుకునేందుకు అనుమతిచ్చే విషయమై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ భగత్ సింగ్ కొశ్యారీ సోమవారం సీఎం ఉద్ధవ్ థాక్రేకు లెటర్ రాశారు. వీటిని ఓపెన్ చేయాలని తనకు మూడు వినతులు వచ్చాయని అందులో పేర్కొన్నారు. ‘‘మీరు బలమైన హిందుత్వవాది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అయోధ్యను సందర్శించి రాముడిపై మీకున్న భక్తిని చాటుకున్నారు. ఏకాదశి రోజున పందర్ పూర్ లోని విఠల్ రుక్మిణి ఆలయాన్ని కూడా సందర్శించి పూజలు చేశారు” అని కొశ్యారీ లెటర్ లో తెలిపారు. ‘‘నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆలయాల రీఓపెన్ ను వాయిదా వేయమని దేవుడి నుంచి ఆదేశాలు ఏమైనా వచ్చాయా? లేక సెక్యులర్ పదాన్ని ద్వేషించే మీరు.. సడెన్ గా సెక్యులర్ గా మారిపోయారా?” అని కొశ్యారీ సీఎంను ప్రశ్నించారు.

అలాంటివి మీకు వస్తాయేమో!: సీఎం 

గవర్నర్ కామెంట్స్ కు సీఎం ఉద్ధవ్ థాక్రే గట్టిగానే బదులిచ్చారు. ఆయన గవర్నర్ కు రిప్లై లెటర్ పంపించారు. తనకు ఎవరి దగ్గరి నుంచీ హిందుత్వ సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితిని జాగ్రత్తగా అంచనా వేసిన తర్వాతే ఆలయాలు, ప్రార్థనా మందిరాల రీఓపెన్ పై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ‘‘నాకు దేవుడి నుంచి ఏమైనా ఆదేశాలు వచ్చాయా? అని అడిగారు కదా. అలాంటివి మీకు వస్తాయేమో.. నేను మీ అంత గొప్పోడిని కాదు” అని సీఎం కౌంటర్ ఇచ్చారు.  సడెన్ గా లాక్ డౌన్ విధించి, అంతే సడెన్ గా లాక్ డౌన్ ఎత్తేయడం కరెక్టు కాదన్నారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాలను ఓపెన్ చేయాలని వచ్చిన వినతిపత్రాలు బీజేపీ ఆఫీస్ బేరర్లు, ఆ పార్టీ సపోర్టర్లు పంపినవేనని ఉద్ధవ్ ఆరోపించారు. కంగనా రనౌత్ గవర్నర్​ను కలిసిన విషయంపైనా సీఎం పరోక్షంగా కామెంట్ చేశారు. ‘‘ముంబైని పీఓకేతో పోల్చిన వారిని నవ్వుతూ ఆహ్వానించడం.. నా దృష్టిలో హిందుత్వం అనిపించుకోదు” అని సీఎం అన్నారు.

మాకు పాఠాలు చెప్పక్కర్లే: సంజయ్ రౌత్ 

గవర్నర్ చేసిన కామెంట్స్ పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఫైర్ అయ్యారు. హిందుత్వ విషయంలో తమకు పాఠాలు చెప్పక్కర్లేదని అన్నారు. శివసేన బలమైన పునాదులపై ఏర్పడిందని, తమ హిందుత్వ భావజాలం దృఢమైనదని చెప్పారు. రాష్ట్రంలో పాలన రాజ్యాంగం ప్రకారం నడుస్తుందా? లేదా? అనేదే గవర్నర్ చూడాలని.. మిగతాదంతా ప్రభుత్వం చూసుకుంటుందని సంజయ్ రౌత్ అన్నారు.

For More News..

మూడు కంపెనీల నుంచి వ్యాక్సిన్‌‌ కొంటం

14 రోజుల పాపతో డ్యూటీకొచ్చిన ఐఏఎస్

గత 20 ఏండ్లలో డబులైన విపత్తులు