స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి తప్పుకున్న ఎల్‌జీ కంపెనీ

స్మార్ట్‌ఫోన్ మార్కెట్ నుంచి తప్పుకున్న ఎల్‌జీ కంపెనీ

ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ఎల్‌జీ.. స్మార్ట్‌ఫోన్ల తయారీ నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. మార్కెట్‌లో పోటీ మరియు నష్టాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధి తెలిపారు. దాంతో మార్కెట్ నుంచి పూర్తిగా వైదొలిగిన మొట్టమొదటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా ఎల్‌జీ నిలిచింది.

దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ సోమవారం తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల తమ కంపెనీకి 10 శాతం నష్టం కలుగుతుందని తెలిపారు. ఒకానొక సమయంలో ఎల్‌జీ కంపెనీ.. స్మార్ట్‌ఫోన్ల దిగ్గజాలైన ఆపిల్, శామ్‌సంగ్ కంపెనీల తర్వాత మూడో స్థానాన్ని కూడా దక్కించుకుంది.

స్మార్ట్‌ఫోన్ల తయారీ విభాగం వల్ల కంపెనీకి దాదాపు 4.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 33,010 కోట్లు) నష్టం వాటిల్లింది. స్మార్ట్‌ఫోన్ల తయారీ నుంచి తప్పుకోవడం వల్ల ఎల్‌జీ ఎలక్ట్రిక్ వెహికల్ కాంపోనెంట్స్, కనెక్టింగ్ డివైజస్ మరియు స్మార్ట్ హోమ్స్ వంటి వాటిపై దృష్టి పెట్టడానికి వీలు కలుగుతుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. స్మార్ట్‌ఫోన్ల తయారీలో ప్రస్తుతం ఎల్‌జీ ప్రపంచవాటా కేవలం 2 శాతం మాత్రమే. ఈ కంపెనీ గత సంవత్సరం 23 మిలియన్ల ఫోన్‌లను తయారుచేసింది. అదే శామ్‌సంగ్ కంపెనీ 256 మిలియన్ల ఫోన్లను తయారుచేసింది. ఉత్తర అమెరికాతో పాటు, లాటిన్ అమెరికాలో ఇది మంచి మార్కెట్‌ను కలిగి ఉంది. ఆ దేశాలలో ఈ కంపెనీ 5వ బ్రాండ్‌గా నిలిచింది. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగులను కంపెనీ అనుబంధ వ్యాపారాలకు మార్పిడి చేస్తున్నారు. అయితే స్మార్ట్‌ఫోన్ల తయారీ నిలిచిపోయినా.. కొంతకాలం కంపెనీ సేవలు తమ కస్టమర్ల కోసం అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది.