ఢిల్లీ సీఎం అతిశీపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ప్రశంసల వర్షం కురిపించారు. మాజీ సీఎం కేజ్రీవాల్ పై పరోక్షంగా విమర్శలు చేస్తూనే.. అతిశీని పొగిడారు ఎల్జీ వీకే సక్సేనా. 2024, నవంబర్ 22వ తేదీన ఇందిరా గాంధీ ఢిల్లీ సాంకేతిక విశ్వవిద్యాలయం 7వ కాన్వొకేషన్ ప్రొగ్రామ్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఎల్జీ సక్సేనా, సీఎం అతిశీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎల్జీ సక్సేనా మాట్లాడుతూ.. ఢిల్లీ ముఖ్యమంత్రి ఒక మహిళ కావడం నాకు చాలా సంతోషంగా ఉందన్నారు. అతిశీ ఆమె పూర్వీకుల (మాజీ సీఎం కేజ్రీవాల్) కంటే వెయ్యి రెట్లు మెరుగైన వ్యక్తి అని నేను బలంగా చెప్పగలనని అన్నారు.
గత పాలకుల కంటే ఆమె చాలా బాగా పరిపాలన చేస్తున్నారని పరోక్షంగా కేజ్రీవాల్‌ను విమర్శిస్తూ అతిశీని కొనియాడారు. ఆప్ ప్రభుత్వం నిర్ణయాలను నిత్యం విభేదించే ఎల్జీ సక్సేనా సీఎం అతిశీని పొగడటం హాట్ టాపిక్‌గా మారింది. కేజ్రీవాల్ సీఎంగా ఉన్న సమయంలో ఎల్జీ సక్సేనా వర్సెస్ కేజ్రీవాల్ అన్నట్లు పరిస్థితి ఉండేది. కేజ్రీవాల్ నిర్ణయాలను ఎల్జీ సక్సేనా ఎప్పుడు విభేదించేవారు. దీంతో కేజ్రీవాల్, ఎల్జీ సక్సేనా బహిరంగంగానే విమర్శలు గుప్పించేకునే వారు.
ALSO READ | ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం ఆప్ 11 మంది అభ్యర్థులతో ఫస్ట్ లిస్ట్ రిలీజ్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఈ ఏడాది మార్చిలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గత నెల (అక్టోబర్)లో తీహార్ జైలు నుంచి బయటకు వచ్చారు. జైలు నుండి బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఎవరూ ఊహించని విధంగా ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఆప్‌ను గెలిపించి తనకు క్లీన్ చిట్ ఇచ్చాకే సీఎం పదవి బాధ్యతలు చేపడతానని కేజ్రీవాల్ సవాల్ చేశారు. కేజ్రీవాల్ రాజీనామా చేయడంతో అతిశీ ఢిల్లీ సీఎం పగ్గాలు చేపట్టారు.