ట్రూడో..అక్టోబర్ 28లోపు గద్దెదిగాలి...కెనడా ప్రధానికి సొంత పార్టీ  ఎంపీల అల్టిమేటం

ట్రూడో..అక్టోబర్ 28లోపు గద్దెదిగాలి...కెనడా ప్రధానికి సొంత పార్టీ  ఎంపీల అల్టిమేటం
  • ట్రూడోను వ్యతిరేకిస్తూ  24 మంది సంతకాలు  

ఒట్టావా:  కెనడా ప్రధాని జస్టిన్  ట్రూడో రాజీనామా చేయాలని అధికార లిబరల్ పార్టీ నేతలు డిమాండ్  చేశారు. బుధవారం పార్లమెంట్  హిల్ లో ప్రధానితో ఎంపీలు సమావేశమయ్యారు. ఈ ఏడాది జూన్, సెప్టెంబరులో జరిగిన ఎన్నికల్లో పార్టీ తీవ్రంగా దెబ్బతినడానికి ట్రూడో వైఖరే కారణమని ఎంపీలు ఆరోపించారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీలో అసంతృప్తి రోజురోజుకు పెరుగుతోందని ట్రూడోకు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీలు తమ అసంతృప్తి, ఆందోళనలను ఆయన ముందు వ్యక్తం చేశారు.

పార్టీలో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 28 లోపు రాజీనామా చేయాలని ప్రధానిపై ఒత్తిడి చేశారు. అయితే, గడువులోపు రాజీనామా చేయకపోతే ఏం చేస్తామో ఎంపీలు వెల్లడించలేదు. లిబరల్  లీడర్ గా ట్రూడో  దిగిపోవాలని  డిమాండ్  చేస్తూ 153 మంది ఎంపీల్లో 24 మంది ఎంపీలు సంతకం చేశారు. ట్రూడో రాజీనామాకు అనుకూలంగా బ్రిటిష్  కొలంబియా ఎంపీ పాట్రిక్  వీలర్  ఈ సందర్భంగా ఒక డాక్యుమెంట్ ను ప్రజెంట్  చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీచేయకూడదని ఆ దేశ ప్రెసిడెంట్  జో బైడెన్  నిర్ణయించకున్నట్లే లిబరల్  పార్టీలో కూడా అలాంటి పరిణామాలు ఎదురుకావచ్చని వీలర్  ఆ డాక్యుమెంట్ లో పేర్కొన్నారు.