కెనడా ఎన్నికల్లో లిబరల్స్​దే విజయం.. 168 స్థానాల్లో గెలుపు

కెనడా ఎన్నికల్లో లిబరల్స్​దే విజయం.. 168 స్థానాల్లో గెలుపు

టోరంటో: కెనడా ఫెడరల్​ ఎలక్షన్స్​లో అధికార లిబరల్​పార్టీ మళ్లీ విజయం సాధించింది. మిత్రపక్షాలతో కలిసి వరుసగా నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశం కనిపిస్తున్నది. తొలిసారి జాతీయ ఎన్నికల్లో పోటీ చేసిన లిబరల్ పార్టీ నేత మార్క్​ కార్నీ మరోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. సీబీసీ/రేడియో కెనడా అంచనాల ప్రకారం, లిబరల్స్ హౌస్ ఆఫ్ కామన్స్‌‌‌‌‌‌‌‌లో 343 సీట్లు ఉండగా.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి లిబరల్స్​ తగినన్ని సీట్లు (168) గెలుచుకున్నారు. 

అయితే, మిత్రపక్షాలతో కలిసి లిబరల్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే చాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్‌‌‌‌‌‌‌‌లు, కెనడాను 51వ రాష్ట్రంగా చేస్తామన్న బెదిరింపులు ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించాయి. దీనివల్ల కెనడియన్లలో జాతీయవాద భావన పెరిగి  లిబరల్స్‌‌‌‌‌‌‌‌కు ప్లస్​ అయ్యింది. అలాగే, బ్యాంక్ ఆఫ్ కెనడా మాజీ గవర్నర్‌‌‌‌‌‌‌‌గా కార్నీ తన అనుభవాన్ని ఉపయోగించి, ట్రంప్‌‌‌‌‌‌‌‌తో వాణిజ్య యుద్ధాన్ని ఎదుర్కొనే నాయకుడిగా ప్రజలు భావించారు. దీంతో లిబరల్స్ కు అసాధారణ రీతిలో మద్దతు లభించింది.

ప్రతిపక్ష నేత ఓటమి

ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ నేత పియరీ పొయిలివ్రే (45) ఓటమి చెందినట్లు  సీబీసీ వార్తా సంస్థ తెలిపింది. ఒంటారియోలోని కార్లటన్ నుంచి పోటీ చేసిన కన్జర్వేటివ్ నేత అపజయం పాలైనట్టు ఆ సంస్థ పేర్కొన్నది. 41శాతం ఓటు షేర్‌‌‌‌‌‌‌‌తో 144 సీట్లు సాధించినప్పటికీ, గత రెండేళ్లుగా కన్జర్వేటివ్స్‌‌‌‌‌‌‌‌కు ఉన్న ఆధిక్యం ట్రంప్ బెదిరింపులు, జస్టిన్ ట్రూడో రాజీనామా, కార్నీ రాకతో కరిగిపోయింది. పోయిలివ్రే స్వయంగా తన కార్లటన్ సీటును కోల్పోయారు.

అణకువతో నడుచుకుంటా: కార్నీ

రిజల్ట్స్ సానుకూలంగా రావడంతో మార్క్​ కార్నీ తన మద్దతుదారులనుద్దేశించి ప్రసంగించారు. తాను అణకువతో నడుచుకుంటానని,  ప్రభుత్వంలోని అన్ని పార్టీలతో కలిసి, ప్రావిన్స్​లు, స్థానిక ప్రజలతో మమేకమై పనిచేస్తానని తెలిపారు. కార్మికులు, వ్యాపారవర్గాలు, పౌర సమాజాన్ని ఏకతాటిపైకి తీసుకురావాలని అనుకుంటున్నట్లు చెప్పారు. మనందరినీ విడగొట్టి దేశాన్ని హస్తగతం చేసుకోవాలని అమెరికా ప్రెసిడెంట్​ ట్రంప్​ భావిస్తున్నారని, కానీ అది ఎన్నటికీ జరగదని కార్నీ అన్నారు.  

ఎన్​డీపీ నేత పదవికి జగ్మీత్ సింగ్ రాజీనామా

మార్క్ కార్నీ విజయం సాధించడంతో న్యూ డెమోక్రటిక్ పార్టీ (ఎన్​డీపీ) నేతగా జగ్మీత్ సింగ్ రాజీనామా చేశారు. భారత సంతతికి చెందిన సిక్కు నేత, ఖలిస్తానీ మద్దతుదారుడు. 2019లో ఎంపీగా గెలిచారు. 2021 నుంచి ట్రూడో లిబరల్ పార్టీ ప్రభుత్వ మనుగడకు ఎన్‌‌‌‌‌‌‌‌డీపీ సాయపడుతున్నది. కాగా, హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంలో భారత్, కెనడా మధ్య దౌత్య, వాణిజ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

భారత ప్రభుత్వ ఏజెంట్లు నిజ్జర్ హత్యలో పాల్గొన్నారని మాజీ ప్రధాని ట్రూడో ఆరోపించారు.  ఇప్పుడు జగ్మీత్ ఓటమితో ఇరుదేశాల మధ్య స్తంభించిన దౌత్య  సంబంధాలను పునరుద్ధరించడానికి  
ఓ మంచి అవకాశంగా నిపుణులు భావిస్తున్నారు.