- ప్రత్యేక టీమ్‌ల ద్వారా తనిఖీలు
- పేరెంట్స్‌కు కౌన్సెలింగ్.. స్కూళ్లకు చిన్నారులు
- ప్రభుత్వ శాఖల సమన్వయంతో సత్ఫలితాలు
ఆసిఫాబాద్, వెలుగు : బాలకార్మికుల నిర్మూలనకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తున్నాయి. గతంలో కార్మిక శాఖ కేవలం ఆడపాదడపా దాడులు నిర్వహించి చిన్నా చితకా కేసులు నమోదు చేసే పరిస్థితి నుంచి.. ఇప్పుడు పలు శాఖల సమన్వయంతో భారీ సంఖ్యలో పిల్లలకు విముక్తి కలిగిస్తు న్నారు. తల్లింద్రులకు కౌన్సెలింగ్ఇచ్చి వారికి అప్ప జెప్పారు. మరికొందరని స్కూళ్లలో చేర్పించారు.
ఆర్థిక ఇబ్బందులతో పసి వయసులోనే..
పుస్తకాలు పట్టుకొని చదువుకోవాల్సిన ఆ చేతులు నానా చాకిరీ చేస్తున్నాయి. వివిధ కారణాలతో చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. కుటుంబ నేపథ్యం, ఆర్థిక పరిస్థితులు, నిరక్షరాస్యతతో చిన్న వయసులోనే పనికి కుదరుతున్నారు. బాల కార్మికులుగా మారి ఇండ్లు, హోటళ్లు, దుకాణాలు, వ్యాపార సముదాయాలు, ఇటుకల బట్టీల వద్ద పనిచేస్తున్నారు.
నెలనెలా ఓనర్లు ఎంతో కొంత జీతం ఇస్తుండడంతో తమకు చేదోడు వాదోడుగా ఉంటారని కొంతమంది తల్లిదండ్రులే తమ పిల్లలను పనిలో పెడుతున్నారు. 15 ఏండ్లలోపు వారిని పనిలో పెట్టుకోవడం నేరం అని తెలిసినా కొందరు ఓనర్లు పిల్లలను పనిలో చేర్చుకుంటున్నారు. వారితో వెట్టి చాకిరి చేయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాల కార్మిక వ్యవస్థను రూపుమాపేం దుకు పోలీసు శాఖ ముందడుగేసింది. విద్య, రెవెన్యూ, కార్మిక శాఖ, బాలల సంరక్షణ శాఖ అధికారులతో ముమ్మర తనిఖీలు చేపట్టింది.
ఉమ్మడి జిల్లాలో మంది చిన్నారులకు విముక్తి
బడి బయట ఉన్న చిన్నారులను గుర్తించి వారికి స్కూళ్లలో చేర్పించేందుకు ప్రతి ఏటా జనవరిలో ఆపరేషన్ స్మైల్, జూలైలో ఆపరేషన్ ముస్కాన్ పేరుతో రెండు సార్లు స్పెషల్ డ్రెవ్ నిర్వహిస్తున్నారు. జనవరిలో ఆపరేషన్ స్మైల్ ద్వారా ఆసిఫాబాద్ జిల్లాలో 63 మందిని, ఆదిలాబాద్‌లో 65 మంది చిన్నారులను రక్షించారు. జూలైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లాలో 83 మందిని, నిర్మల్‌లో 62 ఆసిఫాబాద్‌లో 61, మంచిర్యాల జిల్లాలో30 మంది బాల బాలికలను గుర్తించి వారికి విముక్తి కల్పించారు. ఈ రెండు కార్యక్రమాల ద్వారా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది మంది చిన్నారులను రక్షించారు. వారిని బాలల సంరక్షణ కమిటీ ఎదుట హాజరుపర్చి పేరెంట్స్‌కు అప్పగించి కౌన్సెలింగ్ ఇచ్చారు. మరికొందరిని స్కూళ్లలో చేర్పించారు.
ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం హట్టి గ్రామానికి చెందిన ఓ పన్నెండేండ్ల బాలుడికి తల్లిదం డ్రులు లేరు. చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా చదువుకునే పరిస్థితి, స్థోమత లేక వాంకిడి మండల కేంద్రంలోని ఓ షాపులో పని చేస్తున్నారు. జూలై 25న అధికారులు గుర్తించి బట్టలు, వస్తువులు కొనిచ్చి హట్టి ఆశ్రమ పాఠశాలో 5వ తరగతిలో జాయిన్ చేశారు.
ఆసిఫాబాద్ మండలం జన్కాపూర్‌కు చెందిన ఓ బాలుడికి తండ్రి లేడు. తల్లి లేబర్ పనిచేస్తోంది. దీంతో 4వ తరగతిలో స్కూల్ మానేసి తల్లితో కలిసి పనిచేస్తున్నాడు. జూలై 26న ఈ బాల కార్మికుడిని గుర్తించిన అధికారులు.. అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్లో 6వ తరగతిలో చేర్పించారు.
వాంకిడి మండలం గణేశ్‌పూర్‌కు చెందిన ఓ బాలిక(14) చదువు మధ్యలో ఆపేసి వ్యవసాయ కూలీగా పనిచేస్తోంది. జూలై 24న అధికా రులు ఆమెను గుర్తించి వాంకిడి గిరిజన ఆశ్రమ పాఠశాలో 9వ తరగతిలో జాయిన్ చేశారు.
బాలలను పనిలో పెట్టుకుంటే చర్యలు
18 ఏళ్లలోపు వారిని ఎవరూ పనిలో పెట్టుకోవద్దు. అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు. బాల కార్మిక వ్యవస్థను ప్రోత్సహిస్తున్న వారిపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాల ద్వారా తప్పిపోయిన, బాలకార్మికులుగా పనిచేస్తున్న చిన్నారులు, అక్రమ రవాణాకు గురవుతున్న పిల్లలను రక్షించి పునరావాసం కల్పిస్తాం. సంతోషంగా చదువుకుంటూ ఆటపాటలతో గడపాల్సిన చిన్నారుల బాల్యాన్ని చిదిమేస్తున్న బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించదానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. రిస్క్ చేసిన కాపాడిన బాలలకు పునరావాసం, విద్యనందించేలా వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇస్తున్నాం.
- డీవీ శ్రీనివాస రావు, ఎస్పీ, ఆసిఫాబాద్