1948 సెప్టెంబర్17 సాయంత్రం బొల్లారంలోని మిలటరీ మైదానంలో భారత సైనిక అధికారులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. నిజాం నిరంకుశ పాలన నుంచి హైదరాబాద్సంస్థానం విముక్తి పొందిందని భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రజాకర్ల రాక్షస కృత్యాలను, దోపిడీ వ్యవస్థను ఎదుర్కొని, తమ మాన, ప్రాణ రక్షణ కోసం అది వరకే గ్రామాల్లో వీరోచిత పోరాటం చేసిన సాధారణ ప్రజలు భారత సైనికులకు ఎదురుపడి స్వాగతం పలికారు. తెలంగాణ, కర్నాటక, మరాట్వాడ ప్రాంతాల్లో ప్రజలు సైనికులుగా పోరాడిన దృశ్యాలు, వారి త్యాగాలు అనన్యసామాన్యం. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా, తెలంగాణలో 13 మాసాల రెండు రోజుల వరకు కూడా నరకయాతన కొనసాగుతూనే వచ్చింది. మరోవైపు భారత ప్రభుత్వం1947 నవంబర్29న నిజాంతో చేసుకున్న యథాతథ ఒప్పందం( స్టాండ్‌స్టిల్ అగ్రిమెంట్) తరువాత మనమే ఈ తరతరాల నిజాం నికృష్ట పాలన బూజును తొలగించాలన్న ఒకే ఒక లక్ష్యాన్ని ప్రజలు ఎంచుకున్నారు. ఈ లక్ష్యమే భారత సైనిక చర్యకు మార్గం సుగమం చేసింది. నిజాం ఆనాడు సాయంత్రమే రేడియోలో ప్రజలను ఉద్దేశించి లొంగిపోతున్నట్లుగా ప్రకటించక తప్పలేదు. అందుకే ఆయన కూడా సందులో సడేమియా అన్నట్లుగా రాజప్రముఖ్పదవిని దక్కించుకున్నాడు. మనకు స్వాతంత్ర్యం వచ్చే సమయంలో పోతూ పోతూ బ్రిటీషర్లు రూపొందించిన ఇండియన్ఇండిపెండెన్స్ యాక్ట్ ఆఫ్1947 మళ్లీ భారతదేశాన్ని అగ్నిగుండంగా మార్చే పరిస్థితి తెచ్చింది. అప్పటికి అధికారికంగా పేర్కొన్న 565 సంస్థానాల్లో సర్ధార్వల్ల భాయి పటేల్ చాకచక్యంతో 562 భారతదేశంలో విలీనం అయ్యాయి. కానీ హైదరాబాద్, జునాగఢ్, జమ్మూ కశ్మీర్.. ఈ మూడు సంస్థానాలు మాత్రం స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నం చేశాయి.
రజాకార్ల అకృత్యాలు
నిజాం1927లో ముస్లింల కోసం ‘అంజుమన్–ఎ–తబ్లిక్–ఎ–ఇస్లాం’ సంస్థను స్థాపించాడు. దానికి బహదూర్యార్జంగ్ నునాయకుడిగా చేశారు. అదే రంగులు మార్చి ‘మజ్లిస్–ఇత్తెహదుల్–ముసల్మీన్’ అయింది. ముస్లిం ఎక్తెదార్ (ముస్లిం ఆధిక్యత) ‘తబ్లిక్’ ఉద్యమం అంటే మతమార్పిడి అన్నవి దీని ప్రధాన నినాదాలు. నిజాం భారతదేశంలో చేరాను అని ప్రకటిస్తూ 1947 జూన్12న ఆజాద్హైదరాబాద్గురించి ప్రకటన చేశాడు. అధికారాన్ని కాపాడుకోవడానికి మతాన్ని ఆయుధంగా వాడుకున్నాడు. ‘ఖాసిం రజ్వి’ని చేరదీసి ఇత్తేహదుల్–ముసల్మీన్ను అప్పగించాడు. లక్షమంది రజాకార్లు హింసను ప్రారంభించారు. హిందువులను సాంస్కృతికంగా నిర్వీర్యం చేయడానికి ఉర్దూను అధికారికం చేసి, తెలుగు బడులను మూసివేశారు. ముస్లింల సంఖ్య పెంచుకోవడానికి భారత దేశ విభజన వల్ల నిర్వాసితులైన ముస్లింలకు ఇక్కడ ఆశ్రయం కల్పించారు. మతమార్పిడి కోసం ప్రతి తహసీల్ ఆఫీసులో ఒక అధికారిని నియమించి విపరీతమైన డబ్బు సమకూర్చాడు. విచ్చలవిడిగా హిందువులపై దాడులు చేయడంతోపాటు అత్యాచారాలకు పాల్పడ్డారు. కొందరిని ప్రలోభాలకు గురిచేసి ముస్లిం మతంలోకి మూకుమ్మడిగా మార్చారు. గ్రామాల్లో ప్రధానంగా దళితులను లక్ష్యంగా చేసుకొని దుశ్చర్యలకు ఒడిగట్టారు. ఈ దౌర్జన్యాలను ఎదుర్కోవడానికి ఆర్యసమాజ్, రాష్ట్రీయ స్వయం సేవక్సంఘ్ఇతర స్వచ్ఛంద సంస్థలు, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నం చేశాయి. గ్రామాల్లో వాడలకు వాడలను ముస్లింలుగా ఎలా మార్చేవారో, ఆ తెల్లవారు ఆర్యసమాజ్ వాళ్లు వచ్చి వారిని మళ్లీ హిందువులుగా ఎలా మార్చిన్రో దాశరథి తన రచనల్లో కండ్లకు కట్టినట్లు పేర్కొన్నారు.1946 జులై 4న కడవెండి గ్రామ ప్రజలపై భూస్వామ్య గూండాలు కాల్పులు జరిపితే దొడ్డి కొమురయ్య వీర మరణం పొందుతూ ‘జై ఆంధ్ర మహాసభ’ అని నినాదం చేశాడు. దొడ్డి కొమురయ్య అన్న దొడ్డి మల్లయ్య బాధలను తట్టుకోలేక ముస్లిం మతాన్ని స్వీకరించి ఖాదర్అలీగా పేరు మార్చుకున్నాడంటే మత మార్పిడి ఉధృతి ఎలా ఉండిందో అర్థం చేసుకోవచ్చు.
నిజాం కాలేజీలో స్వర్ణోత్సవాలు
సంస్థాన విమోచన పోరాటానికి దారితీసిన సామాజిక, చారిత్రక, ఆర్థిక, రాజకీయ, దోపిడీ, వివక్ష, పలు సాంస్కృతిక కారణాల విశ్లేషణకు పూనుకోవడం సాహసోపేతమే అవుతుంది. భాషా ప్రాతిపదికన హైదరాబాద్ సంస్థానం మూడు భాగాలుగా విడిపోయింది. తెలంగాణ విశాలాంధ్రలో విలీనం అయింది. సెప్టెంబర్17 దినం మరుగున పడింది. ఎంఐఎం పార్టీ ఏదో శుభకార్యాలు చేసినట్టు ఆల్ఇండియా పార్టీ(ఏఐఎంఐఎం)గా విస్తరించింది. విముక్తి కోసం గ్రామగ్రామాన గగుర్పాటు కలిగించే సాహసిక ఘట్టాలెన్నో ఈ ఉద్యమ చరిత్రలో కనబడతాయి. ఏది దొరికితే దాన్ని ఆయుధంగా మలిచి ప్రాణాలకు తెగించి పోరులో నిలిచిన సమరయోధులు చిరస్మరణీయులు, మన మనసులో వీరందరూ సుప్రతిష్టులు. ఒకవేళ ఆనాడు తెలంగాణ పోరాటమే జరగకపోతే, హైదరాబాద్ సంస్థానం ప్రత్యేక దేశంగా అవతరించి ఉంటే భారతదేశ పటమే ఛిద్రమై ఉండేది. పోరాట గాథలకు భారతదేశ చరిత్రలో చోటు లభించకపోవడం క్షమించరానిది. భారతీయ జనతా పార్టీ1998 సెప్టెంబర్17న హైదరాబాద్‌లో నిజాం కాలేజీ గ్రౌండ్లో విమోచన స్వర్ణోత్సవాలు నిర్వహించింది. పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసింది. నిజాంపై బాంబు వేసిన నారాయణ పవార్, వందేమాతరం రామచంద్రరావు లాంటి స్వాతంత్ర్య సమరయోధులెందరినో సభకు ఆహ్వానించి ఎల్కే అద్వానీ చేతుల మీదుగా సన్మానం చేసింది. అందుకు సమరయోధుల కళ్లు ఆనందంతో చెమ్మగిల్లాయి. విమోచన దినాన్ని అధికారికంగా ప్రభుత్వమే నిర్వహించాలని, కొమురంభీం, షోయబుల్లాఖాన్ లాంటి యోధుల విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ప్రతిష్టించాలని డిమాండ్‌చేశారు. అప్పటి నుంచి ఏటా సెప్టెంబర్17న విమోచన దినం నిర్వహించాలని ఉద్యమిస్తూ వచ్చారు. ఈ పోరాటాలకు తలొగ్గిన అప్పటి ప్రభుత్వం కొమురం భీం విగ్రహాన్ని ట్యాంక్‌బండ్ పై ప్రతిష్టించింది.
షోయబుల్లాఖాన్ హత్య
ఇమ్రోజ్ పత్రిక సంపాదకుడు షోయబుల్లాఖాన్1948 ఆగస్టు 22న దారుణంగా హత్యకు గురయ్యారు. ఖాసీంరజ్వీ ప్రసంగాన్ని అప్పటి జమ్రూద్మహల్సినిమా థియేటర్లో విన్న రజాకార్లు రెచ్చిపోయారు. షోయబుల్లాఖాన్‌ను అతి కిరాతకంగా తుపాకీతో కాల్చి, అతని చేతులు నరికారు. దానికి కారణం ఆ చేతులతో ఆయన రాసిన చరిత్రాత్మక సంపాదకీయం. ఆయన బావమరిది ఇస్మాయిల్ఖాన్ఎడమచేతిని కూడా నరికేశారు. భారతదేశం మొత్తం శరీరమైతే హైదరాబాద్ గుండెకాయ లాంటిదని, గుండె శరీరానికి దూరంగా ఉంటే అది జీవచ్చవం అవుతుందని, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలవడం అనివార్యం అని షోయబుల్లాఖాన్ తన సంపాదకీయంలో రాశాడు. అందరూ చుట్టుముట్టి రోదిస్తుంటే షోయబ్తన భార్యకు ధైర్యం చెప్పాడు. హిందూ బంధువులు మన కుటుంబాన్ని ఆదుకుంటారని, శ్రీరామకృష్ణదూత్ను, శ్రీరామాచారి అనే లాయరును సంప్రదించాలని చెప్పి తుది శ్వాస విడిచాడు. దేశమంతా గుర్తించిన ఇద్దరు పాత్రికేయులలో గణేశ్శంకర్ఉత్తర ప్రదేశ్‌లో 1931 మార్చి 25న దేశ స్వాతంత్ర్యం కోసం, మత సామరస్యం కోసం ప్రాణాలర్పిస్తే, హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావాలని ఉద్యమిస్తున్నందుకు, మత సామరస్యాన్ని కాపాడుతున్నందుకు మన షోయబుల్లాఖాన్ హత్యకు గురికావాల్సి వచ్చింది. యూపీలో ఎక్కడ చూసినా గణేశ్‌శంకర్ పేరు ప్రధానంగా కనపడుతుంది. మన దగ్గర మాత్రం సంతుష్టీకర రాజకీయాల ఉచ్చులో షోయబుల్లా ఖాన్వర్ధంతిని అధికారికంగా నిర్వహించుకోలేక పోతున్నాం. కనీసం పాఠ్యాంశాల్లో ఆయన చరిత్రను చేర్చితే ఇటు, హిందూ ముస్లింల పిల్లలకు తెలిసి మతసామరస్యం పెరుగుతుంది. షోయబుల్లాఖాన్ హత్య సంఘటన, ఆగస్టు 25న జరిగిన భైరాన్‌పల్లి దారుణ మారణకాండ దేశవ్యాప్తంగా ప్రకంపనలను పుట్టించాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి పోలీస్ యాక్షన్‌కు పురిగొల్పాయి.
అధికారిక ఉత్సవాలు
దేశంలో ఎక్కడా జరగని విధంగా ఈ ఏడాది సెప్టెంబర్17న విమోచన దినం సికింద్రాబాద్పరేడ్ గ్రౌండ్లో జరగబోతోంది. గతంలో ఉక్కు మనిషి సర్దార్ పటేల్ నేతృత్వంలో సైన్యం త్రివర్ణ పతాకాన్ని విమోచనకు సంకేతంగా బొల్లారంలో ఎగురవేసింది. ఇప్పుడు కేంద్ర హోమంత్రి అమిత్‌షా సెప్టెంబర్17ను అధికారికంగా విమోచన దినంగా ప్రకటించి ఉత్సవంలో పాల్గొనబోతున్నారు. ఏది ఏమైనా ఇంతెజార్ కా ఫల్మీఠా హోతాహై అన్నట్లు, మన షోయబుల్లాఖాన్ విగ్రహం ట్యాంక్‌బండ్‌పై వెలుస్తుందని, ఆయన పేరిట ఉన్న గ్రంథాలయం పునరుద్ధరణకు నోచుకుంటుందని ఆశిద్దాం. తెలంగాణ ఏర్పాటు తర్వాత సెప్టెంబర్17 ఉత్సవాలు అధికారికంగా జరగనుండటం గర్వకారణం.
- చెన్నమనేని విద్యాసాగర్ రావు
మాజీ గవర్నర్