గ్రంథాలయోద్యమం - తెలంగాణ హిస్టరీ స్పెషల్

గ్రంథాలయోద్యమం - తెలంగాణ హిస్టరీ స్పెషల్

తెలంగాణ చరిత్రకు సంబంధించిన పుస్తకాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి జరిగిన ఉద్యమమే గ్రంథాలయోద్యమం. ప్రజల్లో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యం తీసుకొచ్చే క్రమంలో గ్రంథాలయోద్యమం కీలక పాత్ర వహించింది. సురవరం ప్రతాపరెడ్డి గ్రంథాలయ ఉద్యమమే తెలంగాణలో తొలి ఉద్యమంగా పేర్కొన్నాడు. తెలంగాణ గ్రంథాలయ ఉద్యమానికి ఆద్యుడు, పితామహుడిగా కొమర్రాజు లక్ష్మణరావును పేర్కొంటారు. 1901లో కొమర్రాజు లక్ష్మణరావు హైదరాబాద్​లో స్థాపించిన శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయంతో గ్రంథాలయోద్యమం ప్రారంభమైంది. 

1901కి ముందు

1872లో సోమసుందర​ మొదలియార్​ సికింద్రాబాద్​లో గ్రంథాలయం స్థాపించారు. ఈ గ్రంథాలయం హైదరాబాద్​ రాజ్యంలోనే కాకుండా తెలుగు ప్రాంతాల్లోనే మొదటిదిగా పేర్కొంటారు. దీనిని 1884లో మహబూబియా కాలేజీలో విలీనం చేశారు. 1872లోనే ముదిగొండ శంకరాచార్యులు శంకర్​మఠ్​లో శంకరానంద గ్రంథాలయం, సికింద్రాబాద్​లో సార్వజనీన గ్రంథాలయాన్ని స్థాపించాడు. 1879లో అఘోరనాథ చటోపాధ్యాయ యంగ్​మెన్స్ ఇంప్రూవ్​మెంట్స్​ సొసైటీ లైబ్రరీని స్థాపించాడు. 1891లో అసఫియా స్టేట్​ లైబ్రరీ ప్రారంభమైంది. 1895లో భారత​ గుణవర్ధక్ సంస్థ గ్రంథాలయం శాలిబండలో ఏర్పాటు చేశారు. ఈ గ్రంథాలయాన్ని హైదరాబాద్​ రాజ్యంలో మరాఠీ భాషా సంస్కృతుల అభివృద్ధి కోసం కొంత మంది మరాఠీలు కలిసి ఏర్పాటు చేసుకున్నారు. 1896లో బొల్లారంలో ఆల్బర్ట్​ రీడింగ్​ రూం ఏర్పాటైంది. 

శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం

ఈ గ్రంథాలయాన్ని 1901లో హైదరాబాద్​ సుల్తాన్​బజార్​లో కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించారు. దీని ఏర్పాటుకు మునగాల రాజా నాయని వెంకటరంగారావు, రావిచెట్టు రంగారావు సహకరించారు. ఈ గ్రంథాలయాన్ని రావిచెట్టు రంగారావు స్వగృహంలో స్థాపించారు. ఇది తెలంగాణ గ్రంథాలయోద్యమంలో భాగంగా స్థాపించిన తొలి గ్రంథాలయం. ఈ గ్రంథాలయం సాహిత్య ఉత్సవాలు, సమ్మేళనాలు ఏర్పాటు చేసింది. అవి.. పోతన వర్ధంతి సప్తాహం – 1940, రెడ్డియుగ సారస్వత సప్తాహం–1941, భువన విజయ సప్తాహం–1942, రామాయణ కల్పవృక్ష సప్తాహం–1950. కొమ్మర్రాజు లక్ష్మణరావు1904లో హన్మకొండలో రాజరాజ నరేంద్ర ఆంధ్ర భాషా నిలయం,1905లో సికింద్రాబాద్​లో ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయాన్ని స్థాపించారు.

విజ్ఙాన చంద్రికా మండలి 

1906లో హైదరాబాద్​లో విజ్ఞాన చంద్రికా మండలి గ్రంథాలయాన్ని కొమర్రాజు లక్ష్మణరావు స్థాపించారు. ఈ మండలి కార్యదర్శిగా రావిచెట్టు రంగారావు వ్యవహరించారు. ఈ సంస్థ  తెలంగాణలో విద్యార్థులకు నవలల పోటీలు, తెలుగు భాషలో పరీక్షలు నిర్వహించింది. విజ్ఞాన చంద్రికా మండలి తెలుగు భాషలో చరిత్ర, విజ్ఞానశాస్త్రం, ఆంధ్ర సాహిత్యానికి సంబంధించిన అనేక గ్రంథాలను ప్రచురించింది. ఈ మండలి ఆంధ్రుల చరిత్ర (చిలుకూరి వీరభద్రరావు), అబ్రహం లింకన్​ చరిత్ర (గాడిచర్ల సర్వోత్తమరావు), జీవశాస్త్రం (ఆచంట లక్ష్మీపతి), ఆంధ్రుల సాంఘిక చరిత్ర (సురవరం ప్రతాపరెడ్డి), ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి (ఖండవల్లి లక్ష్మీరంజనం), అర్థశాస్త్రం, ముసలమ్మ మరణం(కట్టమంచి రామలింగారెడ్డి), రసాయనశాస్త్రం (విశ్వనాథశర్మ) గ్రంథాలను ప్రచురించింది. 

రెడ్డి హాస్టల్​ గ్రంథాలయం

1918లో రాజా బహదూర్​ వెంకటరామిరెడ్డి హైదరాబాద్​లోని అబిడ్స్​లో విద్యార్థుల వసతి కోసం రెడ్డి హాస్టల్​ను నెలకొల్పాడు. ఈ హాస్టల్​ ప్రాంగణంలోనే రెడ్డి హాస్టల్​ గ్రంథాలయం ప్రారంభించారు. రెడ్డి హాస్టల్​ గ్రంథాలయానికి 1924–32 మధ్యకాలంలో సురవరం ప్రతాపరెడ్డి కార్యదర్శిగా పనిచేశాడు. గ్రంథాలయం నిర్వహణకు, గ్రంథాలయోద్యమకారుల కోసం సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఆంధ్రుల కర్తవ్యం అనే గ్రంథాన్ని రచించాడు. రెడ్డి హాస్టల్​ గ్రంథాలయంలో నిజాం ప్రభుత్వం నిషేధించిన వీర సావార్కర్​ రచించిన గ్రంథం వార్ ఆఫ్​ ఇండిపెండెన్స్​ ఉండటం వల్ల సురవరం ప్రతాపరెడ్డి తన కార్యదర్శి పదవిని కోల్పోయాడు. 

తొలి సంచార గ్రంథాలయం

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్​ తాలుకాధికారి టీకే బాలయ్య తెలంగాణలో తొలి సంచార గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు. ఈయన ఆర్మూర్​ తాలుకాలోని మారుమూల గ్రామాలకు ఎడ్లబండ్లపై పుస్తకాలను పంపిణీ చేసేవారు. 

అర్జున పుస్తక భండాగార్​

సూర్యాపేటలో కొంత మంది మిత్రులతో కలిసి ధర్మభిక్షం, కన్నయ్య అర్జున పుస్తక భండాగార్​ను స్థాపించి రహస్యంగా నిర్వహించాడు. ఈ పుస్తక భండాగార్​లోకి ఆర్యసమాజ్​ గ్రంథాలు, గోల్కొండ, మీజాన్​, రయ్యత్​ మొదలైన పత్రికలు తెప్పించేవారు. ఈ పుస్తక భండాగార్ పట్టణంలో పుస్తక సంస్థగానే కాకుండా రాజకీయ, సాహిత్య చర్చలకు కేంద్రమైంది. 

తెలంగాణ సాహితీ సంస్థలు 

1934లో సురవరం ప్రతాపరెడ్డి 354 మంది కవి, పండితుల రచనలతో రూపొందించిన గోల్కొండ కవుల సంచిక తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచింది. చందాల కేశవదాసు 1911లో రచించిన కనకతార నాటకంతో ఆధునిక నాటక రచనకు పునాదులు పడ్డాయి. కోదాటి నారాయణరావు ప్రగతి, బాల సరస్వతి పత్రికలు నడిపాడు.  రత్నమాంబ దేశాయి స్త్రీలు విద్యలోనూ కవిత్వంలోనూ రాణించడానికి సమాజం సిద్ధంగా ఉండాలని హితబోధిని పత్రికలో అనేక వ్యాసాలు రాశారు. తెలంగాణ సాంస్కృతికోద్యమంలో భాగంగా అనేక సాహిత్య సంస్థలు స్థాపించారు. 

సాహితీ మేఖల

ఇది మొదట ఏర్పడిన సాహిత్య సంస్థ .ఈ సాహితీ మేఖలను 1936లో అంబటిపూడి వెంకటరత్నశాస్త్రి నల్లగొండలో ప్రారంభించారు. 

  • సాహితీ మేఖల ప్రచురించిన గ్రంథాలు 
  • దాశరథి కృష్ణమాచార్యులు – అగ్నిధార 
  • అంబటిపూడి వెంకటతర్నం – తర్కభాష
  • పున్న అంజయ్య –  నీలగిరి కవుల సంచిక
  •  పులిజాల గోపాలరావు – ఖడ్గ తిక్కన 
  • సాధన సమితి (1939) 
  • ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు బూర్గుల రంగనాథరావు, భాస్కరభట్ల కృష్ణారావు, వెల్దుర్తి 
  • మాణిక్యరావు. 
  • ప్రచురించిన గ్రంథాలు 
  • దేవులపల్లి రామానుజరావు – నవ్య కవితా నీరాజనం
  • బూర్గుల రంగనాథరావు – వాహ్యాళి 
  • బోగి నారాయణమూర్తి– పరీక్ష చదువు
  • గాదిరాజు వెంకట రమణయ్య – భోజరాజు 
  • అణా గ్రంథమాల (1939) 
  • 1939లో అణా గ్రంథమాలను కేసీ గుప్తా స్థాపించాడు. తొలి ప్రచురణ హైదరాబాద్​ రాజ్యాంగ సంస్కరణలు.1943లో కాళోజీ నారాయణరావు రచనలైన మనమేనయం(పశుహింస గురించిన కథ), తెలియక ప్రేమ తెలిసి ద్వేషం (కుల వివక్షత గురించి), విభూతి (ఆధునికత వేలంవెర్రి వేయడాన్ని విమర్శించే కథ)లను అణ గ్రంథమాల ప్రచురించింది. 

ఇతర గ్రంథాలయాలు 

    ఆంధ్ర భాషా నిలయం – 1910 (ఖమ్మం)
    ప్రతాపరుద్ర ఆంధ్ర భాషా నిలయం – 1913 (మడికొండ, వరంగల్​)
    సంస్కృత కళావర్ధిని గ్రంథాలయం – 1913 (సికింద్రాబాద్​)
    ఆంధ్ర విజ్ఞాన ప్రకాశి​నీ గ్రంథాలయం 
    – 1918 (సూర్యపేట)
    ఆంధ్ర సరస్వతీ గ్రంథాలయం – 1918 
    (నల్లగొండ)
    భాషా కల్పవల్లి గ్రంథాలయం – 1920 
    (సికింద్రాబాద్​)
    విజ్ఞాన విద్యుత్​ ప్రవాహిన్యాంధ్ర 
    భాషా నిలయం – 1918 (ఖమ్మం)
    విజ్ఞాన ప్రచారిణి గ్రంథాలయం – 1919
    ( ఇనుగుర్తి, మహబూబ్​నగర్) 
    బహిరామియా గ్రంథాలయం – 1921 
    (కొలనుపాక)
    బాలసరస్వతి గ్రంథాలయం – 1923 
    (అఫ్జల్​గంజ్​)
    వేమన ఆంధ్ర భాషా నిలయం – 1923 
    (హైదరాబాద్​)
    విజ్ఞాన ప్రచారిణీ గ్రంథాలయం – 1923 (మంథని) 
    ఆంధ్ర విద్యార్థి సంఘం గ్రంథాలయం 
    – 1923 (ఖమ్మం)
    ఆంధ్ర సోదరి సమాజ గ్రంథాలయం – 1925 (హైదరాబాద్​)
    ఆది హిందూ లైబ్రరీ – 1926 (హైదరాబాద్​) 
    దక్కన్​ వైశ్య సంఘ గ్రంథాలయం – 1926
    జోగిపేట గ్రంథాలయం – 1930 (జోగిపేట)
    విద్యాభివర్ధినీ గ్రంథాలయం – 1939 
    (తోటపల్లి– కరీంనగర్​)
    గాంధీ గ్రంథాలయం – 1940 
    (హనుమకొండ) 
    రైతు గ్రంథాలయం – 1941 (చిలుకూరు) 
    హనుమదాంధ్ర గ్రంథాలయం – 1943 
    (ములకపల్లి, ఖమ్మం) 
    వివేక వికాసి గ్రంథాలయం – 1943 
    (పిల్లలమర్రి, సూర్యాపేట)