భారతదేశంలో దాదాపు 15 లక్షల పాఠశాలలు ఉండగా దాదాపు 97 లక్షల మందికి పైగా ఉపాధ్యాయులు 26.5 కోట్ల విద్యార్థులకు సేవలందిస్తున్నారు. తెలంగాణ ప్రాంతంలో43,083 పాఠశాలలు ఉండగా వాటిలో ప్రాథమిక పాఠశాలలు20,711, అప్పర్ ప్రైమరీ పాఠశాలలు 7,688, సెకండరీ స్కూల్స్12,045, హయ్యర్ సెకండరీ స్కూల్స్ 2,639 ఉన్నాయి. వీటితోపాటు మోడల్ స్కూల్స్ , కేజీవీబీ పాఠశాలలు, రెసిడెన్షియల్ గురుకులాలు (షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్ క్యాస్ట్, వెనుకబడిన కులాలు, మైనార్టీ వర్గాలు, జనరల్ గురుకులాలు) ఉన్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన కులాలు, షెడ్యూల్ క్యాస్ట్, గిరిజన గురుకులాలు, మైనార్టీ గురుకులాలను ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేసింది. పాఠశాల విద్యా కార్యక్రమాలకు లైబ్రరీ కేంద్రంగా ఉంది. పాఠశాలల్లో చక్కటి సౌకర్యాలతో కూడిన లైబ్రరీ లేకుండా బోధన వల్ల అభ్యాసన ప్రక్రియ అధ్వానంగా ఉంది. డాల్టన్ ప్లాన్, ప్రాజెక్ట్ మెథడ్, సెల్ఫ్ లెర్నింగ్ అలాగే సెమినార్‌ల వంటి విద్యార్థి- కేంద్రీకృత అభ్యాసం, బోధన ప్రక్రియలను సులభతరం చేయడానికి లైబ్రరీ ఎంతో అవసరం.
అంతర్జాతీయ స్థాయి పబ్లిక్ స్కూళ్లు
ప్రతి మండలంలో అంతర్జాతీయ స్థాయి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందేలా చూడాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందే. ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసేందుకు ఈ బడ్జెట్ లో రూ.500 కోట్లు కేటాయించారు. అదేవిధంగా సాంకేతిక విద్యను బలోపేతం చేయడానికి, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలోని 65 ప్రభుత్వ ఐటీఐలను అప్ గ్రేడ్ చేస్తామన్నారు.
దీనికనుగుణంగా పాఠశాలల్లో కూడా ఒకప్పుడు ఐటీఐ మాదిరిగా ఒకేషనల్ కోర్సులను పునర్ ప్రతిపాదించి ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, స్కిల్డ్ లేబర్ కు ఉపయోగపడే బేసిక్ కోర్సులను ప్రవేశపెట్టాలి. విద్యార్థులకు కనీస అవగాహన కల్పించేవిధంగా వృత్తి విద్యా కోర్సులు ఏర్పాటు చేయాలి. అదేవిధంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, బీసీ, మైనార్టీల కోసం 100 రెసిడెన్షియల్ పాఠశాలల భవనాలను నిర్మించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
రూ.2,500 కోట్లతో చేపట్టనున్న ఈ రెసిడెన్షియల్ పాఠశాల భవనానికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఒకే ప్రాంతంలో వేర్వేరు చోట్ల ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ పాఠశాలలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేలా ఇంటిగ్రేటెడ్ భవనాలను నిర్మించాలనేది ప్రణాళిక. దీనివల్ల అన్ని వర్గాల విద్యార్థులు కలిసి విద్యనభ్యసించి మెరుగైన సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది.
విద్యతో ఉన్నతస్థాయి జీవితం
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బిల్డింగ్ పైలట్ ప్రాజెక్టుకు మధిర నియోజవర్గాన్ని ఎంపిక చేశారు. జీవితాన్ని ఉన్నతస్థాయికి తీసుకువెళ్లేది విద్య. పుస్తకాలు పుష్కలంగా ఉన్న లైబ్రరీ విద్యార్థి ప్రగతికి దోహదపడుతుంది. లైబ్రరీలో పుస్తకాలు చదివి తరగతులకు హాజరుకావడం వల్ల అనేక విషయాలపై వారికి అవగాహన కలుగుతుంది. విద్యార్థులు మన దేశ భవిష్యత్తు. విద్యార్థులకు అన్ని విషయాలు మరింత స్పష్టంగా అర్థమయ్యేలా చేయడానికి వారికి మరింత జ్ఞానాన్ని సేకరించేందుకు లైబ్రరీ సహాయం చేస్తుంది.
పాఠశాల విద్యార్థులు క్రమం తప్పకుండా లైబ్రరీలోకి ప్రవేశించే అలవాటును పెంపొందించుకోవాలి. పాఠశాల, కళాశాల పరిధి దాటి విద్యార్థులు ఆలోచించడానికి మరింత జ్ఞానాన్ని సేకరించాలి. దీంతోపాటు ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి నిరుద్యోగ యువతకు ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక నాలెడ్జ్ సెంటర్ ఏర్పాటు చేసి అన్ని వర్గాల యువత వివిధ పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు శిక్షణ పొందే అవకాశం ఉంది.
గ్రామాల్లో గ్రంథాలయాలు
గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేసి సాయంత్రం పూట నిరుద్యోగులు, విద్యార్థులు అందరూ ఉపయోగించుకునే అవకాశం కల్పించాలి. కేంద్ర ప్రభుత్వం సమగ్ర శిక్ష అభియాన్ కింద పాఠశాలలో గ్రంథాలయాలు ఏర్పాటు చేసేందుకు, పుస్తకాలు కొనేందుకు అవకాశం ఉన్నది. 2018 నుంచి ఈ స్కీం కింద ప్రాథమిక పాఠశాలకు 5,000 రూపాయలు, సెకండరీ, సీనియర్ సెకండరీ పాఠశాలల్లో 20 వేల రూపాయలు ఒకటవ తరగతి నుంచి 12వ తరగతి వరకు కావలసిన పుస్తకాలు కొనేందుకు అవకాశం ఉంది.
మన రాష్ట్రం పారిశ్రామిక లేదా ఐటీ హబ్ గా దేశంలోనే ప్రామాణికతగల రాష్ట్రం. అదేవిధంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద గ్రంథాలయాల ఏర్పాటుకు ఇది సదవకాశం. అనేక నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ (ఎన్జీవోలు) ఫుడ్ ఫర్ థాట్, రూరల్ లైబ్రరీ ఫౌండేషన్, బ్రెడ్ సొసైటీ, రూమ్ టు రీడ్, ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ వంటి స్వచ్ఛంద సంస్థలు ఇప్పటికే అనేక చోట్ల వారు గ్రంథాలయాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా పాఠశాలల్లో గ్రంథాలయాలు ఏర్పాటు చేస్తే విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉన్నత జ్ఞానాన్ని ఉచితంగా అందించే అవకాశం ఉంటుంది.
విజ్ఞానవంతమైన సమాజానికి రూపకల్పన
విద్యార్థులకు వారి సంస్కృతిని అర్థం చేసుకోవడంలో లైబ్రరీ సహాయపడుతుంది. ఇతర సంస్కృతులను తెలియజేస్తోంది. సమీప, సుదూర ప్రాంతాల చరిత్ర, భౌగోళిక శాస్త్రంపై వారికి అవగాహన కల్పిస్తుంది. విద్యార్థులకు పదజాలం, గ్రహణశక్తిని పెంచుతుంది. ప్రతి సంవత్సరం గ్రంథాలయాలకు కూడా పాఠశాలలతోపాటు బడ్జెట్ కేటాయించవలసిన అవసరం ఉన్నది. ఈ బడ్జెట్ను విద్యార్థులకు అవసరమయ్యే, ఉపయోగపడే పుస్తకాలపై ఖర్చు చేయాలి.
ప్రభుత్వం ఏర్పాటు చేసే ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్స్ లో గ్రంథాలయాలు నిర్వహించాలి. రాష్ట్ర కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ సెంటర్ లో విద్యార్థులకు ఉపయోగపడే టీచింగ్ మెథడ్స్, ఫిజికల్ రిసోర్సెస్, ఆన్లైన్ రిసోర్సెస్, బుక్ రీడింగ్ మెథడ్స్, టీచింగ్ స్కిల్స్ మొదలైన నిత్య నూతన పరిస్థితులపై పరిశోధన చేయాలి. విజ్ఞానవంతమైన సమాజ రూపకల్పనకు కాంగ్రెస్ ప్రభుత్వం అంకురార్పణ చేయాలి.
- డా. రవికుమార్ చేగొనీ,
ప్రధాన కార్యదర్శి,
తెలంగాణ గ్రంథాలయ సంఘం