గ్రంథాలయాలలో తరతరాల చరిత్ర గ్రంథాల రూపంలో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. విద్యార్థుల జ్ఞాన శక్తిని, ప్రజలను మేలుకొల్పడంలో గ్రంథాలయాలు సమాజంలో చాలా అవసరం. తెలంగాణ సాయుధ పోరాటంలో గ్రంథాలయాలు ప్రముఖ పాత్రను వహించాయి. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం మెగా డీఎస్సీతో ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను నింపుతాననడం చాలా సంతోషకరమైన విషయం. కానీ, నూతన విద్యా విధానం ప్రకారం ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కచ్చితంగా లైబ్రేరియన్ ఉండాలి. ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి ప్రతి ప్రభుత్వ పాఠశాలలో లైబ్రరీని ఏర్పాటు చేసి లైబ్రేరియన్ని నియమించాలి.
అదేవిధంగా పాఠశాల విద్యార్థులకు లైబ్రరీకి పిరియడ్ కేటాయించడం వలన విద్యార్థులకు ఆలోచన శక్తి, జనరల్ అవేర్నెస్ పెరుగుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఊరిలో ఒక లైబ్రరీ ఏర్పాటు చేసి లైబ్రేరియన్ను నియమించాలి. ప్రతిఊర్లో ఉండే యువకులకు కాంపిటీటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు గ్రంథాలయాలు చాలా ఉపయోగపడతాయి. త్వరలో మెగా డీఎస్సీతో పాటు లైబ్రేరియన్ పోస్టులను కూడా భర్తీ చేయాలి. ఎంతోమంది లైబ్రరీ సైన్స్ పట్టభద్రులు చాలా ఏండ్ల నుంచి రిక్రూట్మెంట్ లేకపోవడంతో నిరుద్యోగులుగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి పబ్లిక్, జిల్లా గ్రంథాలయాలలో, ప్రభుత్వ పాఠశాలలో ఖాళీగా ఉన్న లైబ్రేరియన్ పోస్టులను ఈ మెగా డీఎస్సీతో పాటు భర్తీ చేయాలి.
- హరీష్ యాదవ్, మహబూబాబాద్ జిల్లా