ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలపై పోరాడుతం

ఎల్ఐసీ ఏజెంట్ల సమస్యలపై పోరాడుతం
  • వారి సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తుతాం: కాంగ్రెస్ ఎంపీలు
  • రాం లీలా మైదానంలో ఎల్ఐసీ ఏజెంట్ల ఆందోళన 
  •  మద్దతు తెలిపిన మల్లు రవి, వంశీకృష్ణ, చామల, సురేష్ షెట్కార్, రఘురాం రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ఎల్ఐసీ ఏజెంట్ల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాడుతామని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. వారి సమస్యలను పార్లమెంట్ లో లేవనెత్తి.. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామన్నారు. బుధవారం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ ఎల్ఐసీ ఏజెంట్స్ ఫెడరేషన్స్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. 

కనీస బీమా మొత్తాన్ని లక్ష నుంచి రెండు లక్షలకు పెంచడాన్ని వ్యతిరేకిస్తూ.. ఇన్సూరెన్స్ పరిధిలోని అన్ని జీఎస్టీలను మినహాయించాలని, ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం ఎఫ్డీఐలకు వ్యతిరేకంగా, బోనస్ రేట్ల పెంపు, ఏజెంట్స్ కమిషన్ పాత పద్ధతిలో కొనసాగింపు వంటి 16 డిమాండ్లతో ఆందోళన చేపట్టారు. 

ఈ ధర్నాకు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు మల్లు రవి, గడ్డం వంశీకృష్ణ, చామల కిరణ్​కుమార్​రెడ్డి, రఘురాం రెడ్డి, సురేశ్ షెట్కార్ హాజరై మద్దతు తెలిపారు. ఎంపీ చామల మాట్లాడుతూ.. ఏజెంట్ల శ్రమతోనే ఎల్ఐసీ దేశంలోనే అతిపెద్ద పీఎస్ యూగా అవతరించిందని అన్నారు. 14.4 లక్షల ఏజెంట్లు, మరో 14 లక్షల ప్రైవేట్ ఏజెంట్లు అనునిత్యం సంస్థ అభివృద్ధి, పాలసీదారుల రక్షణ కోసం పాటుపడుతున్నారని చెప్పారు. అయితే సంస్థ కోసం ఇంత చేస్తోన్న ఏజెంట్ల ను మాత్రం పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఏజెంట్ల పోరాటానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని మల్లు రవి భరోసా ఇచ్చారు. పార్టీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ ఆదేశాలతోనే ఆందోళనలో పాల్గొని సంఘీభావం తెలిపామన్నారు.

ఏజెంట్ల న్యాయమైన డిమాండ్ల సాధనకు మద్దతు: పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ

ఎల్ఐసీ ఏజెంట్ల న్యాయమైన డిమాండ్ల సాధనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హామీ ఇచ్చారు. ఏజెంట్ల పక్షాన పార్లమెంట్ లో గొంతు వినిపిస్తామన్నారు. 20 ఏండ్ల కిందట తమ తండ్రి వివేక్ వెంకటస్వామి ఎల్ఐసీ ఏజెంట్ల కోసం పోరాడారని గుర్తుచేశారు. ఇప్పుడు ఎంపీగా ఏజెంట్ల సమస్యలపై పోరాడే అవకాశం తనకు వచ్చిందన్నారు. ఈ పోరాటంలో ఎంతవరకైనా వెళ్తానన్నారు. 

దేశానికి పబ్లిక్ సెక్టార్ యూనిట్లు(పీఎస్ యూ) చాలా అవసరమన్నారు. ఎల్ఐసీ ఏజెంట్ ఉద్యోగం చాలా కఠినమైందని, దేశంలోని 40 కోట్ల మంది పాలసీదారులకు భరోసా ఇచ్చేందుకు అనునిత్యం వారు శ్రమిస్తున్నారన్నారు. ఎల్ఐసీలో క్లాస్ 3, 4 ఉద్యోగాల భర్తీకి పోరాడుతామన్నారు. ఈ డిమాండ్ల పరిష్కారంలో కేంద్రం పై 
ఒత్తిడి తెస్తామని హామీ ఇచ్చారు.