హైదరాబాద్, వెలుగు: లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) 66 ఏళ్లు పూర్తి చేసుకొని 67వ సంవత్సరంలోకి ఎంటర్ అయ్యింది. కేవలం రూ. 5 కోట్ల క్యాపిటల్‌తో 1956 లో స్టార్టయిన ఈ కంపెనీ ప్రస్తుతం రూ. 42,30,616 కోట్ల విలువైన అసెట్స్‌ను మేనేజ్ చేసే స్థాయికి ఎదిగింది. దేశంలో ఇన్సూరెన్స్ సెక్టార్‌లోకి ప్రైవేట్ కంపెనీలను అనుమతిచ్చి 20 ఏళ్లు దాటుతున్నప్పటికీ ఎల్‌ఐసీ ఇంకా మార్కెట్ లీడర్‌గా కొనసాగుతోంది. మొదటి ఏడాది ప్రీమియం ఇన్‌కమ్ సెగ్మెంట్‌లో 63.25 శాతం మార్కెట్ వాటాను, పాలసీల సంఖ్యలో 74.62 శాతం వాటాను దక్కించుకుంది. 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ ఏకంగా 2.17 కోట్ల కొత్త పాలసీలను అమ్మడం విశేషం. ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి గాను మొదటి ఏడాది ప్రీమియం కింద రూ. 1.98 లక్షల కోట్లను సేకరించగలిగింది.
ప్రస్తుతం ఎల్‌ఐసీలో లక్ష మంది ఉద్యోగులు పనిచేస్తుండగా, 13.26 లక్షల మంది ఏజెంట్లు పనిచేస్తున్నారు. కంపెనీకి దేశంలో 8 జోనల్ ఆఫీస్‌లు, 113 డివిజినల్ ఆఫీసులు, 74 కస్టమర్ జోన్లు, 2,048 బ్రాంచ్ ఆఫీస్‌లు, 1,564 శాటిలైట్ ఆఫీసులు, 44,900 ప్రీమియం పాయింట్లు, లైఫ్ ప్లస్ ఆఫీసులు ఉన్నాయి. అంతేకాకుండా కస్టమర్లకు మెరుగైన సర్వీస్‌లను అందించేందుకు ఎల్‌ఐసీ దేశంలోని 74 బ్యాంకులతో పార్టనర్‌షిప్ కుదుర్చుకుంది. ఎండోమెంట్ ఇన్సూరెన్స్, టెర్మ్ ఇన్సూరెన్స్, చైల్డ్ ఇన్సూరెన్స్, యాన్యుటీ, మైక్రో ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ వంటి వివిధ సెగ్మెంట్లలో మొత్తం 33 ప్లాన్లను ఎల్‌ఐసీ అమ్ముతోంది. పాలసీ హోల్డర్లు తమ ప్రీమియంను ఆన్‌లైన్‌లో చెల్లించే అవకాశాన్ని తీసుకొచ్చింది. పెన్షన్ పాలసీ హోల్డర్ల కోసం జీవన్ సాక్ష్యా మొబైల్ యాప్‌ను తెచ్చింది.