LIC News: ఆ కంపెనీలో 49 శాతం వాటాలు కొంటున్న ఎల్ఐసీ.. అతిపెద్ద లాభం ఇదే..!

LIC News: ఆ కంపెనీలో 49 శాతం వాటాలు కొంటున్న ఎల్ఐసీ.. అతిపెద్ద లాభం ఇదే..!

ManipalCigna: ప్రభుత్వ యాజమాన్యంలోని బీమా సంస్థ ఎల్ఐసీ అనేక దశాబ్ధాలుగా దేశంలోని ప్రజలందరికీ సుపరిచితమైన కంపెనీ. ప్రజలు తమ జీవిత బీమా అవసరాల కోసం ఎల్ఐసీ నుంచి అందుబాటులో ఉన్న వివిధ పాలసీలను కొనుగోలు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో ఎల్ఐసీ అనేక లిస్టెడ్ కంపెనీల్లో ఆ సొమ్మును పెట్టుబడిగా పెట్టి దాని నుంచి వచ్చిన లాభాలను పాలసీదారులకు అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఎల్ఐసీ ఒక కంపెనీలో దాదాపు 49 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు వెల్లడైంది.

వివరాల్లోకి వెళితే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్వరలోనే హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు వెల్లడైంది. అయితే దీనికి సంబంధించిన సన్నాహాలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా మణిపాల్ ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ గ్రూప్, సిగ్నా కార్పొరేషన్ జాయింట్ వెంటర్ సంస్థ మణిపాల్ సిగ్నా హెల్త్ ఇన్సూరెన్స్. వాస్తవానికి ఈ కంపెనీ స్టాక్ మార్కెట్లలో లిస్ట్ అవ్వలేదు. అయితే దేశంలోని ప్రభుత్వ బీమా సంస్థ ఎల్ఐసీ ప్రస్తుతం మణిపాల్ సిగ్నా వ్యాపారంలో దాదాపు 40-49 శాతం మధ్య వాటాలను కొనుగోలు చేసేందుకు సంప్రదింపులు జరుగుతున్నట్లు వెల్లడైంది. 

ఇదే జరిగితే ఎల్ఐసీ లైఫ్ ఇన్సూరెన్స్ వ్యాపారంతో పాటు ఇకపై హెల్త్ ఇన్సూరెన్స్ రంగంలోకి కూడా అడుగుపెట్టడం మార్గం సుగమం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ వార్త మార్కెట్లోకి రావటంతో ఇంట్రాడేలో ఎల్ఐసీ షేర్ల ధర కొంత లాభపడి మధ్యాహ్నం 1.20 గంటల సమయంలో రూ.787.85 వద్ద ఎన్ఎస్ఈలో కొనసాగుతోంది. ఎల్ఐసీ ప్రస్తుత చర్యల ద్వారా జాయింట్ వెంటర్ కంపెనీ మణిపాల్ సిగ్నాలో కీలక వాటాదారుగా మారుతుందని తెలుస్తోంది. దేశంలో భారీగా పాలసీదారులను కలిగి ఉన్న ఎల్ఐసీ వ్యాపారానికి ఈ డీల్ భారీగా కలిసిరావటంతో పాటు రానున్న కాలంలో ఆదాయాల పెరుగుదలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

►ALSO READ | Ola-Uberకి పోటీగా కొత్త టాక్సీ సర్వీస్.. రంగంలోకి మోదీ సర్కార్, అమిత్ షా ప్రకటన..

ఇది ఎల్ఐసీకి ఉన్న పెద్ద పంపిణీ నెట్ వర్క్, ఆర్థిక బలం రంగంలోని ఇతర వ్యాపార సంస్థలకు సవాలుగా మారే అవకాశం కూడా ఉంది. తాజా చర్యల ద్వారా దేశంలోని రూ.3 లక్షల కోట్ల విలువైన జనరల్ ఇన్సూరెన్స్ మార్కెట్‌లో 37% వాటా కలిగిన ఈ విభాగాన్ని ఎల్‌ఐసీ సంస్థ ఉపయోగించుకునే అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. వాస్తవానికి ఇదొక పెద్ద బిజినెస్ ఆపర్చునిటీగా నిలుస్తుంది.

ప్రస్తుతం ఈ డీల్ క్లోజ్ చేసేందుకు రెండు సంస్థల మధ్య కీలక చర్చలు కొనసాగుతున్నాయని ఎల్ఐసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సిద్ధార్థ్ మెుహంతి వెల్లడించారు. ప్రస్తుతం చర్చలు చివరి దశలో ఉన్నందున దీనిని మార్చి 31, 2025 నాటికి పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. తద్వారా 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఎల్ఐసీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ వ్యాపారంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉంటుందని తెలుస్తోంది. ఇది ఎల్ఐసీ షేర్ హోల్డర్లకు ఉత్సాహాన్ని నింపే విషయంగా ఉండనుంది. 

NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.