- అదానీ షేర్లతో లాభాల పంట
- రూ.45 వేల కోట్లకు పెరిగిన ఎల్‌ఐసీ ప్రాఫిట్
- 3 నెలల్లోనే రూ.10 వేల కోట్ల లాభం ఆర్జించిన జీక్యూజీ
- హిండెన్ బర్గ్ నష్టాల నుంచి 60% మేర రికవరీ అయిన షేర్లు
బిజినెస్ డెస్క్, వెలుగు: అదానీ గ్రూప్ షేర్లు పెరుగుతుండడంతో వీటిలో ఇన్వెస్ట్ చేసినవారు మంచి లాభాలు చూస్తున్నారు. ఎల్‌ఐసీ ఏకంగా రూ.45,481 వేల కోట్ల ప్రాఫిట్ సంపాదించింది. హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడిన తర్వాత ఒకానొక టైమ్‌లో ఈ షేర్లలోని ఎల్‌ఐసీ పెట్టుబడులు నెగెటెవ్‌లోకి జారుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నాటికి అదానీ గ్రూప్‌లలో ఎల్‌ఐసీ వాటాల ఆధారంగా, మంగళవారం షేర్ల క్లోజింగ్ ధర బట్టి ఈ లెక్కలను ఏస్ ఈక్విటీ వేసింది. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్‌లో ఈ ఏడాది మార్చి నాటికి ఎల్‌ఐసీ ఇన్వెస్ట్‌మెంట్ల విలువ రూ.12,448 కోట్లుగా ఉండగా, మంగళవారం నాటికి ఇది రూ.14,463 కోట్లకు ఎగిసింది. అదే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ల విలువ రూ.8,493 కోట్ల నుంచి రూ.12,782 కోట్లకు, అంబుజా సిమెంట్స్‌లో రూ. 4,564 కోట్ల నుంచి రూ.5,337 కోట్లకు, ఏసీసీలో రూ. 2,006 కోట్ల నుంచి రూ.2,189 కోట్లకు, అదానీ గ్రీన్ ఎనర్జీలో రూ. 1,893 కోట్ల నుంచి రూ.2,123 కోట్లకు ఎగిసింది. గత రెండు నెలల్లో ఎల్ఐసీ వాటాల విలువ భారీగా పెరిగింది.
వాటాలు పెంచుకొని..
హిండెన్‌బర్గ్ రిపోర్ట్ వెలువడిన తర్వాత అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ 100 బిలియన్ డాలర్ల మేర పడింది. ఈ కంపెనీల్లో ఎల్‌ఐసీకి ప్రాఫిట్స్ మొత్తం పోయాయి. అదానీ షేర్లతో కూడిన పోర్టుఫోలియో నెగెటెవ్‌లోకి జారుకుంది. ఇలాంటి టైమ్‌లో కూడా ఎల్‌ఐసీ నాలుగు అదానీ కంపెనీల్లో తన వాటాలను పెంచుకుంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్, టోటల్ గ్యాస్ కంపెనీల్లో ఈ ఏడాది మార్చి క్వార్టర్‌లో వాటాలను పెంచుకుంది. షేర్లు రికవరీ అవ్వడంతో ఎల్‌ఐసీ తనకొచ్చిన నష్టాలన్నింటినీ తగ్గించుకొని ప్రాఫిట్‌లోకి మారింది. కాగా, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు హిండెన్‌బర్గ్ రిపోర్ట్ తర్వాత ఏడాది కనిష్టానికి పడిపోగా, ఈ లెవెల్ నుంచి159 శాతం పెరిగాయి. అదానీ పోర్ట్స్ షేర్లు హిండెన్‌బర్గ్ రిపోర్ట్ ముందు లెవెల్‌ను టచ్ చేశాయి కూడా. సుప్రీం కోర్ట్ ఎక్స్‌పర్ట్ కమిటీ నుంచి ఊరట లభించడంతో అదానీ గ్రూప్ షేర్లు గత కొన్ని సెషన్లుగా ర్యాలీ చేస్తున్నాయి.
అదానీ గ్రీన్ ఫండ్స్ రైజ్..
అదానీ గ్రీన్ ఎనర్జీ రూ.6,150 కోట్ల నుంచి రూ.8,200 కోట్లు (బిలియన్ డాలర్ల) వరకు సేకరించేందుకు రెడీ అవుతోంది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (క్యూఐపీ) ద్వారా ఈ ఫండ్స్ సేకరించనుందని సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. బిజినెస్ విస్తరణలో భాగంగా ఈ ఫండ్స్ సేకరిస్తున్నారు.
షార్ట్ సెల్లర్లపై రిస్ట్రిక్షన్లు!
అదానీ– -హిండెన్‌బర్గ్ కేసును దర్యాప్తు చేస్తున్న సెబీ, కొన్ని షార్ట్ సెల్లింగ్ బ్యాంకులపై రిస్ట్రిక్షన్లు పెట్టొచ్చని జీక్యూజీ రాజీవ్ జైన్ పేర్కొన్నారు. షార్ట్ సెల్లింగ్ చేయడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ, వీటి ప్రభావం బిజినెస్‌లపై పడుతుందని అన్నారు. షార్ట్ సెల్లర్లు మార్కెట్‌లో అవకాశాలను క్రియేట్ చేస్తారని, మార్కెట్ ఉండాలంటే రెండు ఒపీనియన్లు ఉండాలని వివరించారు. అదానీ గ్రూప్‌లోని ఇన్వెస్ట్‌మెంట్లపై మాట్లాడుతూ మంచి వాల్యుయేషన్ దగ్గర, అదిరిపోయే అసెట్స్‌ను పొందామన్నారు.
జీక్యూజీకి భారీ లాభాలు..
అదానీ గ్రూప్ షేర్లలో ఇన్వెస్ట్ చేసి భారీ లాభాలు సాధించిన కంపెనీల్లో యూఎస్ బేస్డ్ కంపెనీ జీక్యూజీ పార్టనర్స్ కూడా ముందుంది. రాజీవ్ జైన్ నాయకత్వంలోని ఈ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్, పోర్ట్స్, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్ కంపెనీల్లో రూ.15,446 కోట్లు (2–2.5 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పోర్టుఫోలియో వాల్యూ తాజాగా రూ.25 వేల కోట్లను దాటింది. కేవలం మూడు నెలల్లోనే ఈ కంపెనీ రూ.10 వేల కోట్ల లాభాన్ని సంపాదించింది. జీక్యూజీ ఇప్పటికే అదానీ గ్రూప్‌లో తన వాటాను 10 శాతానికి పెంచుకుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ చేసింది. ఓపెన్ మార్కెట్‌లో ఈ వాటాలు కొన్నదని వివరించింది. అదనంగా మరో బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని జీక్యూజీ పార్టనర్స్ చూస్తోంది. అదానీ ఎంటర్‌ప్రైజెస్, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్‌మిషన్ కంపెనీలు వాటాలను అమ్మాలని ప్లాన్ చేస్తుండగా, ఇందులో ఇన్వెస్ట్ చేయాలని ఈ ఇన్వెస్ట్‌మెంట్ కంపెనీ చూస్తోంది. అదానీ గ్రూప్ షేర్లు రికవరీ అవ్వడంతో తమ ఇన్వెస్ట్‌మెంట్ల వాల్యూ 3.5 బిలియన్ డాలర్లకు చేరుకుందని బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజీవ్ జైన్ పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌లో మరింతగా ఇన్వెస్ట్ చేస్తామని, ఇంకో ఐదేళ్లలో ప్రమోటర్ల తర్వాత అతిపెద్ద ఇన్వెస్టర్లుగా మారతామని వివరించారు.