![యూపీఐతో ఎల్ఐసీ ఐపీఓకు అప్లై చేయండిలా](https://static.v6velugu.com/uploads/2022/02/LIC-IPO-How-to-apply-for-LIC-IPO-using-UPI;-know-step-by-step-process_RyIYhutjAO.jpg)
ముంబై: వచ్చే నెల రాబోతున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) ద్వారా షేర్లు కొనడానికి యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ)తో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎల్ఐసీ ఉద్యోగులు, పాలసీదారులు మాత్రమే యూపీఐని ఉపయోగించి ఐపీఓకు అప్లై చేయాలి. ఈ ఇష్యూ సందర్భంగా కార్పొరేషన్ రూ.60 వేల కోట్ల విలువైన షేర్లను అమ్ముతుందని అంచనా. వీటిలో 10 శాతం షేర్లను పాలసీహోల్డర్లకు రిజర్వ్ చేశారు. ఈ పబ్లిక్ ఆఫర్ మార్చి 11న యాంకర్ ఇన్వెస్టర్ల కోసం ఓపెన్ అవుతుందని చెబుతున్నారు. ఈ 66 ఏళ్ల కంపెనీ 28 కోట్లకుపైగా బీమా పాలసీలతో మనదేశ ఇన్సూరెన్స్ మార్కెట్లో లీడర్‌గా ఎదిగింది. 2020 లెక్కల ప్రకారం బీమా ప్రీమియం సేకరణ పరంగా ఇది ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద బీమా సంస్థ.
ఎలా దరఖాస్తు చేయాలి?
ఐపీఓ కోసం ఇన్వెస్టర్ దరఖాస్తును సమర్పించేటప్పుడే డబ్బు చెల్లింపు కోసం 'పే విత్ యూపీఐ ఐడీ’ ఆప్షన్ ఎంచుకోవాలి. ఇన్వెస్టర్ ఈ విషయం గురించి బ్రోకర్‌కు కూడా తెలియజేయాలి. ఈ ఛానెల్ ద్వారా బిడ్‌ను సమర్పించడానికి రిటైల్ ఇన్వెస్టర్లు యూపీఐ రిక్వెస్ట్‌ను అప్రూవ్ చేయాలి. ఇన్వెస్టర్ ఎంచుకున్న యూపీఐ యాప్ (గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటివి)కు ఈ రిక్వెస్ట్ వస్తుంది.
దశలవారీగా వివరాలు
1. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ bseindia.com అధికారిక వెబ్‌సైట్ నుండి ఎల్ఐసీ ఐపీఓ దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయాలి. ఫారమ్‌లో మీ యూపీఐ ఐడీని రిజిస్టర్ చేసి సబ్మిట్ చేయాలి.
2. యూపీఐ మొబైల్ అప్లికేషన్‌లో, ఐపీఓ అప్లికేషన్‌కు అవసరమైన ఫండ్‌ను బ్లాక్ చేయాలంటూ రిక్వెస్ట్ వస్తుంది.
3. ఇప్పుడు మొబైల్ లోని యూపీఐ యాప్‌ను ఓపెన్ చేసి రిక్వెస్ట్‌ను ఓకే చేయాలి.
4. షేర్ల అలాట్మెంట్ ముగిసే వరకు మీ బ్యాంక్ ఖాతాలో నిధులు బ్లాక్ అవుతాయి. యూపీఐతో వేసే బిడ్లకు అప్పర్ లిమిట్‌ను రూ. 2 లక్షలుగా నిర్ణయించారు.
5. ఎల్ఐసీ మీకు షేర్లను కేటాయించినట్లయితే, డబ్బు ఆటోమేటిక్‌గా ఖాతా నుండి డెబిట్ అవుతుంది. లేకుంటే ఇతర అవసరాల కోసం అది రిలీజ్ అవుతుంది.