పహల్గాం బాధితులకు ఎల్‌‌‌‌ఐసీ భరోసా

పహల్గాం బాధితులకు ఎల్‌‌‌‌ఐసీ భరోసా

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్‌‌‌‌ఐసీ) ఈ నెల  22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో అమాయక పౌరుల మరణంపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. వీరికి మద్దతుగా ఉంటామని పేర్కొంది.  ఆర్థికంగా సాయం చేసేందుకు  క్లెయిమ్ సెటిల్‌‌‌‌మెంట్‌‌‌‌లను వేగంగా పూర్తి చేస్తామని ప్రకటించింది.  సంస్థ  సీఈఓ సిద్ధార్థ మొహంతి మాట్లాడుతూ.. ఎల్‌‌‌‌ఐసీ పాలసీలు ఉన్న  క్లెయిమెంట్ల (క్లెయిమ్స్ చేసేవారి) కష్టాలను తగ్గించడానికి అనేక రాయితీలను కంపెనీ ప్రకటించిందని అన్నారు. 

మరణ ధృవీకరణ పత్రాలకు బదులుగా, ఉగ్రవాద దాడి కారణంగా పాలసీ హోల్డర్ మరణానికి సంబంధించిన ప్రభుత్వ రికార్డులలో ఏదైనా ఆధారం లేదా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం చెల్లించిన ఏదైనా పరిహారం మరణానికి రుజువుగా స్వీకరిస్తామని తెలిపారు.  క్లెయిమెంట్‌‌‌‌లను చేరుకోవడానికి, ప్రభావిత కుటుంబాలకు క్లెయిమ్‌‌‌‌లను త్వరితగతిన సెటిల్ చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని తెలిపారు. మరింత సహాయం కోసం క్లెయిమెంట్‌‌‌‌లు సమీప  బ్రాంచ్/డివిజన్/కస్టమర్ జోన్‌‌‌‌లను సంప్రదించాలని ఎల్‌‌‌‌ఐసీ పేర్కొంది. కాల్ సెంటర్‌‌‌‌ను కూడా 022 68276827 ద్వారా సంప్రదించొచ్చని తెలిపింది.