- ఆర్టీఏ ఆఫీస్ కష్టాలు తీరేదెన్నడు?
- అద్దె బిల్డింగ్‌లో నిర్వహణ
- మూడుసార్లు ప్లేస్ అలాట్ చేసి క్యాన్సిల్ చేసిన ప్రభుత్వం
- ట్రాక్‌లు లేకపోవడంతో టెస్ట్ పెట్టకుండానే లైసెన్స్‌లు
- సమస్య పరిష్కరించాలంటున్న ఆఫీసర్లు
పెద్దపల్లి, వెలుగు: పర్మినెంట్ ఆర్టీఏ ఆఫీస్, కావాల్సిన ట్రాక్‌లు లేకపోవడంతో పెద్దపల్లిలో ట్రాక్ టెస్టింగ్ లేకుండానే అధికారులు వాహనదారులకు లైసెన్స్‌లు మంజూరు చేస్తున్నారు. పెద్దపల్లిలో ట్రాన్స్పోర్ట్ ఆఫీస్నిర్మాణం కోసం 15 ఏళ్లుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మూడు సార్లు భూమి కేటాయింపులు జరిగినా, చివరి నిమిషంలో ల్యాండ్ వేరే విభాగాలకు బదలాయింపు జరిగిపోయింది. మరోసారి పెద్దపల్లి మండలం రాఘవాపూర్ పరిసరాల్లో ఆర్టీఏ ఆఫీస్‌కోసం భూ సర్వే చేశారు. కానీ ఇప్పటి వరకు స్థలం మాత్రం నిర్ణయించలేదు. దీంతో ఈసారైనా ఆర్టీఏ ఆఫీసు నిర్మాణం జరుగుతుందా అనే డౌట్ వ్యక్తమవుతుంది.
షెడ్డులో ఆర్టీఏ అధికారి ఆఫీస్..
ప్రస్తుతం కిరాయి బిల్డింగ్ లో ఆర్టీఏ ఆఫీస్నిర్వహిస్తున్నారు. అందులో సరిపోయినన్ని గదులు లేకపోవడంతో ఆర్టీఏ అధికారి కోసం పక్కన మరో షెడ్డు వేసి ఆఫీస్‌గా కొనసాగిస్తున్నారు. ఆఫీస్పక్కన ఉన్న ప్రైవేటు భూమిలో ట్రాక్ టెస్టింగ్ కొనసాగిస్తున్నారు. ఇటీవల ఆ ల్యాండ్ ఓనర్ ట్రాక్ ప్లేస్‌లో బిల్డింగ్ నిర్మించారు. దీంతో ఎలాంటి ట్రాక్ టెస్టింగ్‌లు లేకుండానే లైసెన్స్‌లు ఇస్తున్నారు.
ల్యాండ్ ప్రాబ్లం తీరేదెప్పుడు?
ట్రాన్స్పోర్ట్ ఆఫీస్నిర్మాణం కోసం 2007లో ఎస్సారెస్పీ క్యాంపులో భూమి చూపి, పలు కారణాలతో నిలిపేశారు. టీఆర్ఎస్ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త జిల్లాలలో ట్రాన్స్పోర్ట్ ఆఫీసుల నిర్మాణం కోసం ప్రతీ జిల్లా కేంద్రంలో 10 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించింది. పర్మినెంట్ ట్రాక్, అనువైన బిల్డింగ్ ఏర్పాటు చేసుకోవడం కోసం 2017లో అందుగులపల్లి శివారు రాజీవ్‌రహదారి పక్కన భూమిని కేటాయించింది. రెవెన్యూ అధికారులు సర్వే చేసి ఆర్టీఏ విభాగానికి హ్యాండోవర్ చేసినప్పటికీ, ఆ భూమిని తిరిగి జిల్లా కోర్టు నిర్మాణం కోసం కేటాయించారు. అక్కడ త్వరలో కోర్టు నిర్మాణం చేపట్టనున్నారు. దీంతో ఆర్టీఏ అధికారులు సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన రాఘవాపూర్ సమీపంలోని సర్కార్ భూమిని సర్వే చేయించారు. అయితే పెద్దపల్లి జిల్లాలో సబ్‌జైలు ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంతో రాఘవాపూర్ భూమిని జైలు నిర్మాణానికి కేటాయిస్తారని తెలుస్తోంది.
ట్రాక్ లేకుండా లైసెన్స్ లు..
ఫోర్ వీలర్స్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం వెళ్లే వారికి ట్రాక్‌పై వాహనాలు నడిపించాల్సిన అవసరం లేకుండాపోయింది. 10 మీటర్ల ట్రాక్‌పై ట్రయల్ చూడటం తప్ప రూల్స్ ప్రకారం వెహికల్ నడిపించి చూసే అవకాశం లేదు. బైక్లైసెన్స్ పరిస్థితి కూడా అలాగే ఉంది. లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్ల కోసం దాదాపు 12 మండలాలకు చెందిన వాహనదారులు పెద్దపల్లి ఆర్టీఏ కార్యాలయానికి వస్తుంటారు. లైసెన్స్ పొందాలనుకునేవారికి బైక్‌రైడింగ్, హెవీ వెహికల్ డ్రైవింగ్ పరీక్షలు జరపాలి. వీటి కోసం టూ వీలర్, ఫోర్ వీలర్ ట్రాక్ ఉండాలి. ఇలాంటివేవీ లేకపోవడంతో స్కిల్టెస్ట్లేకుండానే లైసెన్సులు ఇస్తున్నారు.
2007 నుంచి ప్రయత్నిస్తున్నాం
ఆర్టీఏ కొత్త బిల్డింగ్ కోసం 2007 నుంచి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కొత్త జిల్లా అయిన తర్వాత ప్రభుత్వం భూమి కేటాయించినప్పటికీ ఆ భూమిని కోర్టుకు కేటాయించారు. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన రాఘవాపూర్‌లో భూసర్వేకు ఆదేశించారు. అక్కడ ఆర్టీఏ ఆఫీసుకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఇంకా స్థలం నిర్ణయించలేదు.
- రంగారావు, డీటీఓ, పెద్దపల్లి