ట్రాక్​ టెస్టింగులు లేకుండానే వాహనదారులకు లైసెన్స్​లు

పెద్దపల్లి, వెలుగు : పెద్దపల్లి ఆర్టీఏ ఆఫీసులో ఎలాంటి ట్రాక్​ టెస్టింగులు లేకుండానే వాహనదారులకు  లైసెన్స్​లు ఇస్తున్నారు. ట్రాక్ లో​ టెస్ట్​ చేయడానికి సరిపోయే గ్రౌండ్​ ఆర్టీఏ  ఆఫీసు దగ్గర లేదు. ఉన్న స్థలం చిన్నది కావడంతో వాహనదారులు గంటల తరబడి వెయిట్​ చేయాల్సి వస్తోంది.  లైసెన్స్, రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  ప్రస్తుతం కిరాయి బిల్డింగ్​లో ఆర్టీఏ ఆఫీసు ఉంది.  ఇందులో సరిపడా గదులు లేక నిర్వహణ ఇబ్బందిగా మారింది. ఆర్టీఏ అధికారి కోసం  పక్కన మరో షెడ్డు వేసి దాన్ని ఆఫీసుగా కొనసాగిస్తున్నారు.  

ల్యాండ్​ ప్రాబ్లమ్​ తీరేదెప్పుడు...

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాన్స్​పోర్ట్​ ఆఫీసు నిర్మాణం కోసం 15 సంవత్సరాలుగా ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.  2007లో ఎస్సారెస్పీ క్యాంపులో భూమి చూపించినా వివిధ కారణాలతో పక్కనబెట్టారు.  రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల్లో ట్రాన్స్​పోర్ట్​ ఆఫీసుల నిర్మాణం కోసం ప్రతీ జిల్లా కేంద్రంలో 10 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించింది. పర్మినెంట్​ ట్రాక్​, అనువైన బిల్డింగ్​ ఏర్పాటు చేసుకోవడం కోసం 2017లో అందుగులపల్లి శివారు రాజీవ్​ రహదారి పక్కన భూమి కేటాయించింది. రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి ఆర్టీఏ విభాగానికి హ్యండోవర్​ చేశారు. అనంతరం అదే భూమిని తిరిగి జిల్లా కోర్టు నిర్మాణం కోసం కేటాయించారు. ఆర్టీఏ ఆఫీసుకు ల్యాండ్​ కేటాయింపు విషయమై ప్రస్తుత కలెక్టర్​ దృష్టికి ఆర్టీఏ అధికారులు తీసుకెళ్లారు.  స్పందించిన కలెక్టర్​ రాఘవాపూర్​ సమీపంలో ఉన్న సర్కార్​ భూమిని సర్వే  చేయించారు.  కానీ ఒకే చోట 9 ఎకరాలు కేటాయించకుండా,  వేర్వేరు స్పాట్స్​లో 3 ఎకరాల చొప్పున కేటాయిస్తామని కలెక్టర్​ సూచించారు.  ఆ ప్రతిపాదనను ఆర్టీఏ అధికారులు ఒప్పుకోవడం లేదు.  దీంతో మరోసారి స్థలం పంచాయితీ మొదటికొచ్చింది.  అదే ప్లేస్​లో  ప్రభుత్వం జిల్లా సబ్​జైలు కోసం స్థలాన్ని పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది.  దీంతో ఆర్టీఏ ఆఫీసు కోసం మరో స్థలం చూడాల్సి వస్తోందని అధికారులు చెబుతున్నారు. 

ఆర్టీఏ ఆఫీసుకు స్థలం కేటాయించాలి 

ఫోర్​ వీలర్స్​ డ్రైవింగ్​ లైసెన్స్​ కోసం వెళ్లే వారికి ట్రాక్​పై వాహనాలు నడిపించాల్సిన అవసరం లేకుండా పోయింది. 10 మీటర్ల ట్రాక్​పై ట్రయల్​ చూడడం తప్ప రూల్స్​ ప్రకారం వెహికిల్​ నడిపించి చూసే అవకాశం లేదు.  ఆఫీసు ముందున్న చిన్న ప్లేస్​లో వెహికిల్​ను ముందుకు, వెనక్కి నడిపితే సరిపోతుంది.  బైకు లైసెన్స్​ల పరిస్థితి అంతే ఉంది.  గతంలో ఆఫీసు పక్కన ఉన్న ప్రైవేటు స్థలాన్ని చదును చేసుకొని ట్రాక్​ ఏర్పాటు చేసుకున్నారు.  ఇటీవల  ఆ ల్యాండ్​ ఓనర్​ ఇంటి నిర్మాణం చేశారు. ఆర్టీఏ ఆఫీసుకు ట్రాక్​ లేకుండా పోయింది.  లైసెన్స్​లు,  రిజిస్ట్రేషన్​ల  కోసం దాదాపు 12 మండలాలకు చెందిన వాహనదారులు పెద్దపల్లి జిల్లా ఆర్టీఏ కార్యాలయానికి వస్తుంటారు.  లైసెన్స్​ పొందాలనుకునే వారికి  బైకుల వారికి రైడింగ్​, హెవీ వెహికిల్​ వారికి  డ్రైవింగ్​ పరీక్షలు నిర్వహించాలి.  వీటి కోసం టూ వీలర్​ ట్రాక్​, ఫోర్​ వీలర్​ ట్రాక్​ ఉండాలి.  పెద్దపల్లి ఆర్టీఏలో మాత్రం అలాంటివి ఏమీ లేకుండా పోయాయి.  డ్రైవింగ్​ స్కిల్​ను ఆఫీసర్లు టెస్ట్​ చేయకుండానే వదిలివేయాల్సి వస్తోంది.  ఆర్టీఏ ఆఫీసుకు వచ్చే వాహనాలు ప్రైవేటు స్థలాల్లో, రాజీవ్​ రహదారి పక్కన పార్కు చేస్తున్నారు.  వెంటనే ఆర్టీఏ ఆఫీసుకు స్థలం కేటాయించి కొత్త బిల్డింగ్​ నిర్మాణం చేయాలని కోరుతున్నారు.

ఉన్నతాధికారులు చొరవ తీసుకోవాలి

ఆర్టీఏ కొత్త బిల్డింగ్​ కోసం 2007 నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కొత్త జిల్లా అయిన తర్వాత ప్రభుత్వం భూమి కేటాయించినప్పటికీ ఆ భూమిని వివిధ కారణాలతో బదలాయించారు. ఆర్టీఏ ఆఫీసుకు అనుకూలంగా ఉండే ఓపెన్​ గ్రౌండ్​తో కూడిన బిల్డింగ్​ కావాలి.  ప్రస్తుతం ఆర్టీఏ ఆఫీసు ముందు సరిపోయే స్థలం లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందిగా ఉంది. ఉన్నతాధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలి. 
- రంగారావు, డీటీఓ పెద్దపల్లి జిల్లా