హైదరాబాద్, వెలుగు: గుడిమల్కాపూర్ పూల మార్కెట్లోని 43 షాపుల లైసెన్సులను ఆఫీసర్లు నాలుగేండ్లుగా రెన్యువల్ చేయట్లేదు. 2010లో మొజంజాహీ మార్కెట్ నుంచి గుడిమల్కా పూర్‌కు పూల మార్కెట్‌ను తరలించారు. అప్పట్లో 115 మంది వ్యాపారులకు ఓనర్ షిప్ ప్రాతిపదికన షాపులు అప్పగించారు. 2012లో మరో 44 మందికి షాపులను అద్దెకు ఇచ్చారు. తర్వాత మరో 34 మందికి అవకాశం కల్పించారు. వీటిలో 43 షాపుల లైసెన్సులు రెన్యువల్ చేయడంలో మార్కెట్ఆఫీసర్లు కొన్నేండ్లుగా నిర్లక్ష్యం చేస్తున్నారు. షాపులను అద్దెకు ఇచ్చే టైంలో ఐదేళ్ల కోసం లైసెన్స్ జారీ చేశారు. తర్వాత మూడేళ్లకోసారి రెన్యూవల్ చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాని ప్రకారం 2018లో రెన్యువల్ చేయాల్సి ఉన్నప్పటికీ కొందరు ఆఫీసర్ల నిర్లక్ష్యంతో కాలేదు. ఈ విషయమై పూల వ్యాపారులు ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం ఇవ్వట్లేదు.
రూ.90 వేలు కట్టినప్పటికీ..
కరోనాకు ముందు అద్దెకు షాపులు నిర్వహిస్తున్న వ్యాపారులతో మార్కెట్‌కు చెందిన ఓ వ్యాపారి అబిడ్స్‌లోని తాజ్‌మహల్ హోటల్లో సమావేశమై 43 షాపుల లైసెన్సులు రెన్యువల్ చేస్తానని హామీ ఇచ్చారు. ఆ ఆఫీసర్ చెప్పిన ప్రకారం పూల వ్యాపారులు రూ.90వేలు చొప్పున డీడీలు తీసి మార్కెట్ఆఫీసులో సబ్మిట్చేశారు. తర్వాత ఆ ఆఫీసర్ ట్రాన్స్ఫర్అవ్వడంతో రెన్యువల్ప్రాసెస్ఆగిపోయింది. నేటికీ ఆ డీడీలు మార్కెట్ ఆఫీసులోనే ఉన్నాయి. ఇప్పుడున్న ఆఫీసర్లు రెన్యువల్ చేయకుండా వ్యాపారులను సతాయిస్తున్నారు. ‘ఎక్కువగా మాట్లాడితే మీ డీడీలు మీరు తీసుకెళ్లండని’ బెదిరిస్తున్నారని కొందరు పారులు వాపోతున్నారు. ఈ విషయంపై స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ అపర్ణని వివరణ కోరగా తాను ఇక్కడికి వచ్చేసరికి డీడీలు ఉన్నాయని, వాటి గురించి పై ఆఫీసర్లతో చర్చిస్తున్నామని చెప్పారు. వారి ఆదేశాలను ఫాలో అవుతామని సమాధానం ఇచ్చారు.
రద్దు చేయాలి.. కానీ
జీవో నం.56 ప్రకారం లైసెన్స్ రెన్యువల్ చేయకపోతే 3 నెలలలోపు డైలీ రూ.500 పెనాల్టీతో రెన్యువల్ చేయొచ్చు. ఆ తర్వాత లైసెన్స్ రద్దు చేయాల్సి ఉంటుంది. కానీ గుడిమల్కాపూర్ మార్కెట్లో మాత్రం సర్కారు ఉత్తర్వులను పట్టించుకోవట్లేదు. రెన్యువల్ చేయకుండానే వ్యాపారుల నుంచి రెండేళ్ల క్రితం వరకు అద్దెలు, తక్పట్టి కింద వచ్చే ఫీజులు వసూలు చేశారు. తర్వాత పాలకమండలి రద్దు కావడం, ఆఫీసర్ల బదిలీలు జరిగిపోయాయి. వారి స్థానంలో కొత్తవారు వచ్చారు. వ్యాపారులకు ఇచ్చిన తక్పట్టి బుక్‌లను కరోనాకి ముందు ఆఫీసర్లు వెనక్కి తీసుకున్నారు. తర్వాత వ్యాపారుల నుంచి మార్కెట్‌కి రావాల్సిన ఫీజు రావట్లేదు. కొన్ని నెలలుగా షాపుల అద్దెలు కూడా వసూలు చేయట్లేదు.
నెలకు రూ.2 లక్షలకుపైగా నష్టం
లైసెన్స్ రెన్యువల్ కోసం వ్యాపారులు మూడేండ్లకోసారి రూ.10 వేలు కట్టాలి. దీంతోపాటు మార్కెట్ ఫీజు, అద్దెలు చెల్లించాలి. కానీ 43 షాపులకు సంబంధించి కొన్ని నెలలుగా అద్దెలు, ఫీజులు రావట్లేదు. దీంతో ప్రభుత్వం నెలకు 2 లక్షల నుంచి 3లక్షల ఆదాయం కోల్పోతుంది. రెన్యువల్ చేస్తామని చెబుతుండడంతో వ్యాపారులు షాపులు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా గుడిమల్కాపూర్ నుంచి మార్కెట్ షిఫ్ట్ అవుతుందన్న ప్రచారం మొదలవ్వడంతో డీడీలు కట్టిన వ్యాపారులలో ఆందోళన మొదలైంది.