మాధవన్ బర్త్ డే స్పెషల్

మాధవన్ బర్త్ డే స్పెషల్

లవర్‌‌ బోయ్‌గా ఇంప్రెస్ చేశాడు. మెచ్యూర్డ్ యాక్టర్‌‌గా మెస్మరైజ్ చేశాడు. రైటర్‌‌గా టాలెంట్‌ చూపించి, ఇప్పుడు డైరెక్టర్గా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. యాక్టర్ గానే కాదు.. వ్యక్తిత్వంతోనూ అందరి ప్రశంసలు అందుకున్న హీరో మాధవన్. ఆయన పుట్టిన రోజు సందర్భంగా పర్సనల్, కెరీర్ కు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలపై ఓసారి లుక్కేద్దాం.


మాధవన్ పూర్తి పేరు రంగనాథన్ మాధవన్. 1970లో జంషెడ్‌పూర్ లో తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. తండ్రి రంగనాథన్ అయ్యంగార్‌‌ టాటా స్టీల్ కంపెనీలో ఉద్యోగి. తల్లి సరోజ బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో మేనేజర్. స్థానికంగా ఉన్న డీబీఎమ్మెస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో స్కూలింగ్ కంప్లీట్ చేసిన మాధవన్... కొల్హాపూర్‌‌లో బీఎస్పీ, ముంబైలో పోస్ట్ పబ్లిక్ స్పీకింగ్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. ముంబైలో ఉన్నప్పుడే మోడలింగ్‌పై ఆసక్తితో ఆ రంగంలో అడుగు పెట్టాడు. సంతోష్ శివన్ డైరెక్ట్ చేసిన ఓ యాడ్‌లో తొలిసారి కనిపించాడు. సంతోష్ శివన్ రికమెండ్ చేయడంతో ఇద్దరు సినిమా ఆడిషన్ కు పిలిచారు. అయితే మాధవన్ మరీ చిన్నగా కనిపించడంతో మణిరత్నం అవకాశం ఇవ్వలేదు. ఓ టెలివిజన్‌ ఎగ్జిక్యూటివ్ మాధవన్ ను చూసి సీరియల్స్ లో అవకాశమిచ్చాడు. అలా బుల్లితెరపై కనిపించే ఛాన్స్ కొట్టేసిన మాధవన్ బనేగీ అప్నీ బాత్, ఘర్ జమాయి, సాయా, ఆరోహణ్ తదితర సీరియల్స్తో ప్రేక్షకులను అలరించారు. సీరియల్స్ లో నటిస్తుండగానే.. ‘ఇస్‌ రాత్‌ కో సుబాహ్ నహీ’ చిత్రంలో చిన్న రోల్ దొరికింది. ఆ తర్వాత  ‘ఇన్‌ఫెర్నో’ అనే ఇంగ్లిష్ సినిమాలోనూ అవకాశం వచ్చింది. అలా మాధవన్ సినీ కెరీర్ ప్రారంభమైంది.

 

సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ చేసిన మాధవన్‌ పూర్తి స్థాయి పాత్ర పోషించిన తొలి చిత్రం శాంతి శాంతి శాంతి. టీబీ శ్రీనివాస్ తీసిన ఈ కన్నడ సినిమాలో అబ్బాస్, ప్రేమ, ప్రకాష్ రాజ్ లతో కలిసి మాధవన్ స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. అయినా దురదృష్టం కొద్దీ ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత ‘అకేలీ’ అనే హిందీ మూవీలో అవకాశం వచ్చినా ఆ ప్రాజెక్ట్ మధ్యలోనే ఆగిపోయింది. కొన్నాళ్లకు మణిరత్నం రూపంలో అదృష్టం మాధవన్‌ని వెతుక్కుంటూ వచ్చింది. ‘ఇద్దరు’లో ఛాన్స్ ఇవ్వలేకపోయినా ‘సఖి’లో హీరోగా తనని సెలెక్ట్ చేశారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌‌టైనర్‌‌తో లవర్‌‌ బోయ్‌గా చెప్పలేనంత పాపులర్ అయిపోయారు మాధవన్. దీంతో కన్నడలో ఫెయిలైన మాధవన్ మొదటి సినిమా ‘శాంతి శాంతి శాంతి’ని ‘రిలాక్స్’ పేరుతో తమిళంలోకి డబ్ చేసి విడుదల చేశారు. వారి అంచనా నిజమైంది. తమిళంలో మూవీకి సక్సెస్ అయింది. అదంతా మాధవన్‌ క్రేజ్‌ వల్లే అన్న ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత మాధవన్కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తమిళంలో వరుస సినిమాలతో బిజీ అయ్యారు. వాటి డబ్బింగ్ వెర్షన్స్ తో తెలుగు వారికీ దగ్గరయ్యాడు. 

 

స్పెషల్ జర్నీ

మాధవన్ ఎంత సక్సెస్ అయినా తన కెరీర్ కు ప్రాణం పోసిన హిందీ పరిశ్రమని మాత్రం వదిలిపెట్టలేదు. ఫిల్మ్ మేకర్స్ కూడా ఆయన్ని మర్చిపోలేదు. అడపాదడపా హిందీ చిత్రాల్లో నటిస్తూనే నటించాడు. ‘చెలి’ మూవీ హిందీ రీమేక్ లో ఆయనే నటించారు. దిల్‌ విల్ ప్యార్ వ్యార్, రామ్‌జీ లండన్‌వాలే, రంగ్‌ దే బసంతీ, గురు, ముంబై మేరీ జాన్, సికిందర్‌‌, త్రీ ఇడియట్స్, తీన్ పత్తీ, తను వెడ్స్ మను, సాలా ఖడూస్ తదితర చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు. కేవలం హీరో పాత్రలకే పరిమితం కాకుండా ఎన్నో సినిమాల్లో గెస్ట్ రోల్స్ చేశారు.  అయితే మాధవన్‌ తెలుగులో మూడే మూడు సినిమాల్లో నటించారు. 2010లో వచ్చిన ‘ఓం శాంతి’ అనే చిత్రంలో గెస్ట్ రోల్‌ చేశారు. మళ్లీ ఎనిమిదేళ్లకి నాగచైతన్య హీరోగా నటించిన ‘సవ్యసాచి’లో విలన్‌ పాత్ర పోషించారు. ఆపైన అనుష్కతో కలిసి ‘నిశ్శబ్దం’ మూవీలో కనిపించాడు. 

మల్టీ టాలెంటెడ్...

మాధవన్ చిన్నప్పటి నుంచి చాలా యాక్టివ్‌. ఇటు చదువు, అటు ఎన్‌సీసీ అంటూ బిజీబిజీగా ఉండేవాడు. టెలివిజన్ ఇండస్ట్రీలో యాక్టర్‌‌గా, హోస్ట్ గా మెప్పించారు. సినీ ఇండస్ట్రీలో కూడా మల్టీ టాలెంటెడ్‌గా పేరు తెచ్చుకున్నాడు. రామ్‌జీ లండన్‌వాలే, ఇవానో ఒరువన్ తదితర చిత్రాలకు స్క్రీన్ రైటర్‌‌గా చేసిన అనుభవం మాధవన్ సొంతం. కొన్ని సినిమాల్ని ఆయన ప్రొడ్యూసర్ గానూ వ్యవహరించారు. ప్రస్తుతం ‘రాకెట్రీ’ చిత్రానికి స్క్రిప్ట్ తో పాటు డైరెక్ట్ చేస్తూ నిర్మిస్తున్నారు. మల్టీ టాస్కింగ్ చేయడంలో దిట్ట మాధవన్. ఆయన యాక్టింగ్ తో పాటు వాయిస్ ఓవర్ ఇస్తుంటారు. డాక్యుమెంటరీస్‌కి పని చేస్తుంటారు. కేవలం సినిమాల్లో యాక్టింగ్ కే పరిమితం కాకుండా వెబ్ సిరీసుల్లోనూ నటిస్తున్నారు. ఏం చేసినా అందులో తన ముద్ర వేయాలని తపన పడతారు. అదే తన ప్లస్ పాయింట్ అని చెబుతారు. 

గుడ్ సన్.. బెస్ట్ ఫాదర్

మాధవన్ సినిమాలు చూసినవారంతా తనను మంచి యాక్టర్ అంటే.. దగ్గరగా చూసినవాళ్లంతా మంచి వ్యక్తి అని కితాబిస్తారు. తల్లిదండ్రులకు మంచి కొడుకుగానే కాదు.. తన కొడుక్కి బెస్ట్ ఫాదర్ అని నిరూపించుకున్నాడు. మాధవన్ భార్య పేరు సరిత. మహారాష్ట్రలో జరిగిన ఓ వర్క్ షాప్‌లో సరితని తొలిసారి కలిసిన మాధవన్.. ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడ్డారు. వివాహబంధంతో ఒక్కటయ్యారు. సరిత తనకు జీవితంలో దొరికిన గొప్ప వరం అని చాలా సందర్భాల్లో మాధవన్ చెప్పాడు. ఆయన చాలా మంచి భర్త అని సరిత కూడా కాంప్లిమెంట్ ఇస్తుంటారు. మ్యాడీ నటించిన కొన్ని సినిమాలకి సరిత కాస్ట్యూమ్ డిజైనర్‌‌గా పని చేశారు. వీరి కొడుకు వేదాంత్‌. తండ్రికి తగ్గ కొడుకు అనిపించుకుంటున్నాడు. స్విమ్మింగ్ ఛాంపియన్ అయిన వేదాంత్.. ఇటీవల జరిగిన డ్యానిష్ ఓపెన్ స్విమ్మింగ్‌ మీట్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. తనకి ఇన్‌స్పిరేషన్ తన ఫాదర్ అంటాడు వేదాంత్. తన ఫ్యామిలీయే తనకి బలం అంటారు మాధవన్. మొత్తమ్మీద మాధవన్‌ తన జీవితంలోని ప్రతి దశలో, చేపట్టిన ప్రతి పనిలో బెస్ట్ అనిపించుకుంటూనే వచ్చాడు. ఎప్పటికీ అలా అనిపించుకుంటూనే ఉంటానని చెబుతుంటాడు. అది నిజమవ్వాలని కోరుకుంటూ.. వీ6 వెలుగు తరఫున హ్యాపీ బర్త్ డే మాధవన్‌.