- 2020లో వ్యక్తి మర్డర్
- నేరం రుజువు కావడంతో తీర్పు ఇచ్చిన ఆసిఫాబాద్ సెషన్స్ జడ్జి
ఆసిఫాబాద్, వెలుగు : మర్డర కేసులో 16 మందికి జీవిత ఖైదుతో పాటు రూ. 1.49 లక్షల ఫైన్ విధిస్తూ ఆసిఫాబాద్ సెషన్స్ కోర్టు జడ్జి ఎంవీ. రమేశ్ బుధవారం తీర్పు చెప్పారు. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం సింగల్‌గూడకు చెందిన జర్పుల సురేశ్ 2020 ఆగస్ట్ 19 రాజేశ్వరి అనే మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీన్ని గమనించిన ఆమె సోదరుడు అజ్మీర రమేశ్, అతడి కుమారుడు లోకేశ్ అక్కడికి వచ్చి సురేశ్‌ను అడ్డుకోవడంతో అతడు పారిపోయాడు. దీన్ని మనసులో పెట్టుకున్న సురేశ్ మరో 15 మందితో కలిసి గొడ్డలితో రమేశ్‌పై దాడి చేయడంతో అతడు హాస్పిటల్‌కు తరలిస్తుండగా చనిపోయాడు.
ఈ ఘటనపై అప్పటి ఎస్సై డి.రమేశ్ కేసు నమోదు చేసి హత్యకు కారణమైన జర్పుల సురేశ్, సత్యవతి, అజ్మీర వసంత్‌రావు, జర్పుల తిక్యానాయక్, జర్పుల హరీశ్, అజ్మీరా అరవింద్, నవీన్, ప్రవీణ్, సంతోష్, ప్రవీణ్ కుమార్, జర్పుల లక్ష్మి, రజిత, తుకారం, రవి, రాజు, బిక్యానాయక్‌పై కేసు నమోదు చేసి, వారిని రిమాండ్‌కు తరలించారు. కోర్టులో వాదనల అనంతరం నేరం రుజువు కావడంతో 16 మందికి జీవిత ఖైదుతో పాటు, ఫైన్ విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. నిందితులకు శిక్షపడడంలో కీలకంగా వ్యవహరించిన ఆసిఫాబాద్ డీఎస్పీ కరుణాకర్, రెబ్బన సీఐ చిట్టిబాబు, ఎస్సై చంద్రశేఖర్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ రాంసింగ్, కానిస్టేబుల్ ఉమేశ్వర్‌ను ఎస్పీ డి.శ్రీనివాసరావు అభినందించారు.
బాలికపై అత్యాచారం కేసులో 20 ఏండ్ల జైలు
ఆదిలాబాద్, వెలుగు : బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి శివరాం ప్రసాద్ బుధవారం తీర్పు చెప్పారు. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన జమీల్‌ఖాన్ పిల్లలకు అరబిక్ పాఠాలు చెప్పేవాడు. ఈ క్రమంలో 2021 ఫిబ్రవరి 14న తన ఇంట్లో ఫంక్షన్ ఉందంటూ ఓ ఆరేండ్ల బాలికను, ఆమె తమ్ముడిని తల్లిదండ్రుల అనుమతితో బైక్‌పై తీసుకెళ్లాడు. మార్గమధ్యలో బాలిక తమ్ముడికి సెల్‌ఫోన్ ఇచ్చి, బాలికను పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.
ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా అప్పటి సీఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు దర్యాప్తు చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. విచారణ అనంతరం నేరం రుజువు కావడంతో జమీల్‌ఖాన్‌కు 20 ఏండ్ల శిక్షతో పాటు రూ.7 వేల జరిమానా విధిస్తూ జడ్జి శివరాం ప్రసాద్ తీర్పు వెల్లడించారు.