
ఖమ్మం టౌన్, వెలుగు: బాలికను కిడ్నాప్ చేసి లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ. 2.10 లక్షల వేల చొప్పున జరిమానా విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా జడ్జి కె.ఉమాదేవి గురువారం తీర్పు చెప్పారు. ఖానాపురం హావేలి సీఐ భాను ప్రకాశ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
2021 ఫిబ్రవరి 7న ఇంటి బయట పన్నెండేండ్ల బాలిక ఆడుకుంటుండగా.. ఆమె వద్దకు రమణగుట్టకు చెందిన ఆటోడ్రైవర్ కాలేపల్లి సంపత్, మంచికంటినగర్కు చెందిన పెయింటర్ పసువుల నవీన్ వెళ్లి మాయమాటలు చెప్పి.. బలవంతంగా బైక్పై ఎక్కించుకుని ఖమ్మం శివారులోని ఖాళీ ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదుతో ఖానాపురం హావేలి పోలీసులు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.
అప్పటి సీఐ వెంకన్న బాబు సాక్ష్యాధారాలను సేకరించి కోర్ట్ లో చార్జిషీట్ ఫైల్ చేశారు. కేసు విచారణలో భాగంగా ఇద్దరు నిందితులకు జీవితఖైదు, జరిమానా విధిస్తూ జడ్జీ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరుఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ. శంకర్ వాదించగా.. నిందితులకు శిక్షపడేలా వ్యవహరించిన పోలీసు సిబ్బందిని ఖమ్మం సీపీ సునీల్ దత్ అభినందించారు.