పొలం బాట గొడవలో వ్యక్తిని హత్య చేసిన ఇద్దరికి యావజ్జీవ శిక్ష.. జగిత్యాల జిల్లా అడిషనల్ జడ్జి తీర్పు

పొలం బాట గొడవలో వ్యక్తిని హత్య చేసిన ఇద్దరికి యావజ్జీవ శిక్ష.. జగిత్యాల జిల్లా అడిషనల్ జడ్జి తీర్పు

మెట్ పల్లి, వెలుగు : పొలం బాట గొడవలో ఓ వ్యక్తిని హత్య చేసిన నిందితుల్లో ఇద్దరికి జీవిత ఖైదు, రూ. 10 వేల జరిమానా, మరొకరికి ఐదేండ్ల కారాగార శిక్ష, రూ. 5 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా అడిషనల్ జడ్జి నారాయణ మంగళవారం తీర్పు ఇచ్చారు. మెట్ పల్లి డీఎస్పీ రాములు తెలిపిన ప్రకారం.. ఇబ్రహీంపట్నం  మండలం యామాపూర్ గ్రామానికి చెందిన చెదల రాజేందర్, కాస సంజీవ్, గోదూరు గ్రామానికి చెందిన తైడపల్లి రజినీకాంత్ మధ్య 2022, జనవరి13న పొలం వద్ద బాట విషయంలో గొడవ జరిగింది.

దీంతో సంజీవ్, రజినీకాంత్ కలిసి రాజేందర్ పై కత్తితో దాడి చేసి హత్య చేశారు. మృతుడి భార్య లత ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఇద్దరు నిందితులతో పాటు సాక్ష్యాలు దాచేందుకు ప్రయత్నించిన రాయికల్ మండలం భూపతిపూర్ కు చెందిన మంగ్లారపు లక్ష్మీనారాయణను అరెస్టు చేశారు. ఎంక్వైరీ రిపోర్ట్ ను కోర్టులో సమర్పించడంతో జగిత్యాల జిల్లా అడిషనల్ జడ్జి పైవిధంగా తీర్పు ఇచ్చారు. సాక్ష్యాలను కోర్టుకు అందజేయడంలో కీలకంగా వ్యవహరించిన పీపీ మల్లేశం, అప్పటి సీఐ ఎల్. శ్రీను, కానిస్టేబుల్ రంజిత్ ను ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.