నారాయణపేట, వెలుగు: వరకట్న వేధింపులతో భార్య మరణానికి కారణమైన భర్తకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.15 వేల జరిమానా విధిస్తూ జిల్లా సెషన్స్ జడ్జి ఎండీ రఫీ తీర్పు చెప్పారు. లైజన్ ఆఫీసర్ బాలకృష్ణ చెప్పిన వివరాల ప్రకారం.. 2003లో మక్తల్‌కు చెందిన చంద్రశేఖర్గౌడ్తో తాండూర్‌కు చెందిన రాజేశ్వరి(24)తో వివాహం జరిగింది. 2005 ఫిబ్రవరి 16న రాజేశ్వరి వరకట్న వేధింపులతో చనిపోయిందని, మృతురాలి తండ్రి పండిత్ రాజ్‌గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పెండ్లి అయిన ఆరు నెలల నుంచి అదనపు కట్నం కోసం మానసికంగా, శారీరకంగా వేధించడంతోనే చనిపోయిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అప్పటి ఎస్ఐ శ్రీనివాస్‌రావు కేసు నమోదు చేయగా, సీఐ సుబ్బరాయుడు కేసు దర్యాప్తు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. అడిషనల్ పీపీ ఎస్ మురళీకృష్ణ కోర్టులో 12 మంది సాక్షులను ప్రవేశపెట్టగా, నేరం రుజువు కావడంతో ఈ మేరకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.