ఉన్నదొక్కటే జీవితం దాన్ని అసంపూర్తిగా వదులుకోవద్దు : వై. సంజీవ కుమార్

సరిగ్గా చదవలేకపోతున్నామని, పరీక్షలో ఫెయిల్ అయ్యామని, ఉద్యోగం పోయిందని, జాబ్​రాలేదని, జీవితంలో ఏదీ సాధించలేకపోతున్నామని, తల్లిదండ్రులు ఏదో అన్నారనే చిన్న చిన్న విషయాలకు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్కూలు పిల్లల నుంచి మధ్య వయసు వారి వరకు అకారణంగా సూసైడ్స్ చేసుకుంటున్నారు. సమస్య నుంచి బయటపడే మార్గం వెతకాలి. కానీ దాని నుంచి పారిపోయే క్రమంలో జీవితాన్ని ముగించవద్దు. ఎన్నో ఆశలతో పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు, జీవితంలో అన్ని రకాలుగా తోడు ఉన్న ఆత్మీయులకు అన్యాయం చేయొద్దు.  ఏ విషయం గురించీ అతిగా ఆలోచించడం చేయకూడదు. మానసికంగా ఇబ్బంది పడితే.. బాధను నలుగురితో పంచుకోవాలి. ఆప్తులకు విషయం చెప్పి సూచనలు తీసుకోవాలి. చిన్న చిన్న తగాదాల వల్ల దంపతుల్లో ఎవరో ఒకరు ఆవేశంగా ఆత్మహత్యకు పాల్పడితే.. వారి పిల్లలు అనాథలుగా, దిక్కులేని వారిగా మారుతున్నారు. ఈ ఘటన వారి వ్యక్తిత్వంతోపాటు జీవితంపైనా ప్రభావం చూపే ప్రమాదం ఉన్నది. తల్లిదండ్రుల అర్ధాంతర ఆత్మహత్యలు పిల్లల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేస్తాయి. కరోనా మహమ్మారి ఎందరో పిల్లలను అనాథలను చేసింది. ఇప్పుడు వారంతా దయనీయ స్థితిలో ఉన్నారు. సమస్య ఏదైనా దానికి పరిష్కారం ఉండి తీరుతుంది. బతికి నలుగురితో ప్రశంసలు పొందాలే గానీ, ప్రాణం తీసుకొని సాధించేది ఏదీ ఉండదు. శ్రమను, స్వశక్తిని నమ్ముకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. ఉన్నదొక్కటే జీవితం దాన్ని అసంపూర్తిగా వదులుకోవద్దు. 

- వై. సంజీవ కుమార్,
ప్రెసిడెంట్, స్కై ఫౌండేషన్