ఇండియాలో రెండే ఫేమస్. ఒకటి క్రికెట్. రెండోది సినిమా. ఇండియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసింది ఈ రెండే అన్నది చాన్నాళ్ల నుంచి ఉన్న అభిప్రాయం. అది నిజమే. కానీ, ఈ లిస్టులో ఇప్పుడు కబడ్డీ కూడా చేరింది. మట్టి నుంచి మ్యాట్‌కు మారి.. స్కూల్ గ్రౌండ్ల నుంచి కలర్‌ఫుల్ స్టేడియాలకు చేరి.. ఈ ఆట చాలా మంది జీవితాల్లో భాగమైంది. ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) రాకతో ఐదేళ్లలో కబడ్డీ రాత పూర్తిగా మారిపోయింది. విలేజ్ గేమ్ కాస్తా కార్పొరేట్ల కాసుల వనరుగా మారింది. 2014లో సైలెంట్‌గా వచ్చి ఫస్ట్ సీజన్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మెగా లీగ్ ఇంతింతై అన్నట్టుగా ఎదిగింది. పాపులారిటీ పరంగా, బిజినెస్ పరంగా ఊహించని స్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఈ రోజు హైదరాబాద్‌లో ఏడో సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో లీగ్ ప్రయాణం గురించి తెలుసుకుందాం.
2014, జూలై 26.. ముంబైలోని నేషనల్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియా స్టేడియంలో ప్రొ కబడ్డీ లీగ్ మొదలైన రోజు. కొన్ని నేషనల్ పేపర్లలో తప్పితే ఆ రోజు ఈ లీగ్ గురించి వార్తలు లేవు. రాత్రి జరిగిన ఓపెనింగ్ సెర్మొనీకి బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, బాలీవుడ్ బాద్షాలు షారూక్ ఖాన్, ఆమిర్ ఖాన్; సీనియర్ హీరోయిన్ ఐశ్వర్యా రాయ్ హాజరయ్యారు. నెక్ట్స్ డే పేపర్లలో కూడా ఈ లీగ్ గురించి విశేషాల కన్నా సచిన్, అమితాబ్ వేదిక పంచుకోవడం; మాస్టర్ బ్లాస్టర్ కామెంట్లే ప్రధానంగా వార్తలు వచ్చాయి. ఆ లీగ్‌లో తెలుగు టీమ్ పాల్గొంటున్నట్లు కూడా చాలా మందికి అప్పుడే తెలిసింది. అప్పటికే గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ మొదలవడంతో మీడియా ఫోకస్ మొత్తం దానిపైనే నిలిచింది. ఈ లీగ్‌ను ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో లీగ్‌లో పెట్టుబడి పెట్టినవాళ్లల్లో కాస్త నిరాశ.
అదే ఏడాది ఆగస్టు 31.. సేమ్ స్టేడియంలోనే ఫైనల్ మ్యాచ్. ఈసారి కవరేజీకి దేశవ్యాప్తంగా మీడియా మోహరించింది. సెలెబ్రిటీలు ఎవరొచ్చారని కాదు. ఆట కోసం. తర్వాతి రోజు అన్ని పేపర్ల స్పోర్ట్స్ పేజీల్లో లీగ్ ఫైనలే బ్యానర్ స్టోరీ. ఆ తర్వాత ఆటగాళ్ల ఇంటర్వ్యూలూ, లీగ్ సాగిన తీరుపై విశ్లేషణలకైతే లెక్కే లేదు. ఫ్రాంచైజీ ఓనర్లు, బ్రాడ్‌కాస్టర్లు ఫుల్ ఖుషీ. కేవలం 37 రోజుల్లోనే ప్రొ కబడ్డీ లీగ్ సాధించిన విజయమిది.
అలా మొదలైంది..
లీగ్ రాకను, దాని విజయాన్ని మీడియా పసిగట్టలేకపోయింది. కానీ కబడ్డీలో ఉన్న మజాను ప్రముఖ స్పోర్ట్స్ కామెంటేటర్, ప్రొ కబడ్డీ లీగ్ ఫౌండర్ చారు శర్మ 2006లోనే గుర్తించారు. ఆ ఏడాది దోహాలో జరిగిన ఆసియా గేమ్స్ కబడ్డీ పోటీలకు కామెంటరీ చెప్పిన టైమ్‌లో ఒక లీగ్‌కు కావాల్సిన ముడిసరుకు ఈ ఆటలో చాలా ఉందని గ్రహించాడు. లీగ్‌ను పట్టాలెక్కించేందుకు కార్పొరేట్ల భాగస్వామ్యం కోసం చాలా కష్ట పడ్డాడు. చివరకు చారుశర్మ బంధువైన మహీంద్రా సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్ర ముందుకొచ్చారు. అదే సమయంలో ఇండియన్ స్పోర్ట్స్‌ను ఎంకరేజ్ చేయాలని భావిస్తున్న స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యంతో వీళ్లు తమ ఆలోచనను పంచుకున్నారు. కార్పొరేట్‌కు సినీ హంగు కూడా జోడిస్తే బాగుంటుందని అభిషేక్ బచ్చన్‌ను సంప్రదిస్తే అతను ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేశాడు. లాభాలు లేకున్నా ఫర్లేదు అనుకొని కొందరు పెట్టుబడి పెట్టారు. వయా గ్రూప్ ఓనర్ శ్రీరామనేని శ్రీనివాస్, నేదురుమల్లి గౌతమ్ రెడ్డి, మహేశ్ కొల్లి ‘వీరా స్పోర్ట్స్’ పేరుతో ఒక గ్రూపుగా ఏర్పడి తెలుగు టైటాన్స్‌ను కొనుగోలు చేశారు. లాభాపేక్షతో కాకుండా కబడ్డీని, కబడ్డీ ప్లేయర్లను ప్రోత్సహించాలని చారు శర్మ, ఆనంద్ మహీంద్ర పిలుపునివ్వడంతో క్రీడలను ఇష్టపడే పలువురు వ్యాపారవేత్తలు కూడా ముందుకొచ్చారు. అలా ప్రొ కబడ్డీ రూపుదిద్దుకుంది.
అందరికీ చేరువైంది..
కథ ఎంత బాగున్నా కథనం బాగ లేకపోతే ప్రేక్షకులకు సినిమా ఎక్కదు. అలాగే, కబడ్డీలో కావాల్సిన వినోదం ఉందని తెలిసినా.. దాన్ని సరైన రీతిలో నడిపించకపోతే ఫ్యాన్స్‌కు కిక్ ఇవ్వదని గుర్తించిన చారు శర్మ, స్టార్ స్పోర్ట్స్.. ఈ ఆటకు అనేక హంగులు జోడించారు. 40 నిమిషాల మ్యాచ్.. 20 నిమిషాల తర్వాత విరామం.. 30 సెకన్ల రైడ్ టైం.. సూపర్ రైడ్.. సూపర్ టాకిల్.. బోనస్ పాయింట్.. డూ ఆర్ డై రైడ్.. సబ్‌స్టిట్యూషన్.. రివ్యూ సిస్టం.. ఇలా రూల్స్‌తో ఆట రక్తికట్టించేందుకు కావాల్సిన పర్‌ఫెక్ట్ స్క్రీన్‌ప్లే జోడించారు. అయినా సరే.. ‘ఐపీఎల్ మోడల్‌లో ముందుకెళ్తున్నాం. లీగ్ హిట్టవడం కష్టమే’ అని పలు ఫ్రాంచైజీలు అనుకున్నాయి. కానీ, అనూహ్యమైన రిజల్ట్స్ వచ్చాయి. ఫ్యాన్స్ తొలి రోజు నుంచి చివరి రోజు వరకు లీగ్‌కు బ్రహ్మరథం పట్టారు. స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ మ్యాచ్‌లు కళ్లప్పగించి చూశారు. అప్పటికే ఆరేళ్ల నుంచి ఐపీఎల్ క్రికెట్ చూస్తున్నా ‘కబడ్డీ కబడ్డీనే’ అనుకున్నారు. ఫస్ట్ సీజన్‌లోనే 43.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆ సీజన్‌లో ఫైనల్ మ్యాచ్‌నే 8.64 కోట్ల మంది చూశారు. దీంతో ఈ గ్రామీణ క్రీడ ముఖ చిత్రం దెబ్బకు మారిపోయింది. అప్పటిదాకా ఎవరూ పట్టించుకోని కబడ్డీ క్రీడాకారులు క్రికెటర్ల స్థాయిలో స్టార్ డమ్ సాధించారు. రాహుల్ చౌదరి, అనూప్ కుమార్, అజయ్ ఠాకూర్, కాశీలింగ్ హడ్కే, దీపక్ నివాస్ హుడా, మన్‌జీత్ చిల్లార్, సురేందర్ నడా.. అంతా సెలెబ్రిటీలయ్యారు.
సెకండ్ సీజన్ కూడా సూపర్ హిట్ కావడంతో 2016లో రెండుసార్లు లీగ్ నిర్వహించారు. అయినా అభిమానుల నుంచి అదే స్పందన వచ్చింది. 2017లో చైనాకు చెందిన ప్రముఖ ఫోన్ల సంస్థ వివో టైటిల్ స్పాన్సర్‌గా ముందుకు రావడం బిజినెస్ పరంగా లీగ్‌ను ఎక్కడికో తీసుకెళ్లింది. ఐదేళ్ల కాలానికి టైటిల్ స్పాన్సర్‌గా వివో ఏకంగా రూ.300 కోట్ల డీల్ కుదుర్చుకోవడం ఎవరూ ఊహించనిది.
– ఆర్.కృష్ణారెడ్డి
కూలీలు కోటీశ్వరులయ్యారు..
లీగ్ బ్రాండ్ వాల్యూ పెరగడంతో ప్లేయర్ల లైఫ్ స్టయిల్ కూడా మలుపులు తిరిగింది. ఫస్ట్ సీజన్‌లో ఆటగాళ్ల కొనుగోలుకు ఒక్కో జట్టు రూ.కోటి వెచ్చిస్తే.. ఏడో సీజన్‌కు అది నాలుగు కోట్లకు పెరిగింది. ఫస్ట్ సీజన్‌లో ప్లేయర్ అత్యధిక ధర రూ.12.50 లక్షలైతే ఆరో సీజన్‌లో కోటిన్నర దాటింది. ఒక కబడ్డీ ప్లేయర్ మూడు నెలల ఆటతో కోటిన్నర సంపాదిస్తాడనేది కలలో కూడా అనుకోని విషయం. కూలి పనులు చేసుకునే కాశీలింగ్ హడ్కేను సూపర్ స్టార్‌ను చేసినా.. పేరెంట్స్ చనిపోయి అనాథగా మారిన దీపక్ నివాస్ హుడా.. హోటల్లో వెయిటర్‌గా పనిచేసిన రిషాంక్ దేవడిగ.. ఒక్క రోజులో కోటీశ్వరులు కావడం అంతా ప్రొ కబడ్డీ మహిమే.