హైదరాబాద్ సిటీ, వెలుగు: నిమ్స్హాస్పిటల్ డాక్టర్లు ఏడేండ్ల బాలుడికి అరుదైన శస్ట్రచికిత్స చేశారు. క్రానియోసినోస్టోసిస్ సమస్యతో శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న బాబుకు..సర్జరీ చేసి సాధారణ స్థితికి తెచ్చారు. బుధవారం నిమ్స్ ప్లాస్టిక్ అండ్ రీ కన్స్ట్రక్టీవ్ డిపార్ట్ మెంట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శస్త్ర చికిత్సకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కౌశల్ అనే బాలుడికి క్రానియోసినోస్టోసిస్ కారణంగా తల పెరుగుతున్నది.
కానీ ముక్కు, కళ్లు, మధ్య భాగం పెరగలేదు. దీంతో అతని తల వికృతమైన ఆకారానికి వచ్చింది. చిన్నారికి శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా నాసికా మార్గానికి దారితీసే భాగం తగినంత పెరగకపోవడంతో... రాత్రిళ్లు అస్మాత్తుగా ఆక్సిజన్ లెవల్స్ 50 శాతానికి పడిపోయేవి. దీంతో బాబుకు నిద్ర సంబంధిత సమస్యలు కూడా వచ్చాయి. దీంతో మూడేండ్లుగా పడుకునే సమయంలో సీపీఏపీ మెషిన్ సహాయంతో నిద్రపోయేవాడు. వివిధ హాస్పిటల్స్‌లో చికిత్స అందించినా కౌశల్ ఆరోగ్యం కుదుటపడలేదు. దీంతో కౌశల్‌ను నిమ్స్హాస్పిటల్కు రిఫర్ చేయగా డాక్టర్లు విజయవంతంగా సర్జరీని పూర్తి చేశారు.