ఒక మధ్య తరగతి బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన గగన్ పాతికేండ్లు కూడా నిండకుండానే దేశ విదేశాలు తిరుగుతూ వ్లాగ్స్ చేస్తున్నాడు. అతని మాట తీరుతో కొన్ని లక్షల మందిని ఆకట్టుకున్నాడు. అందుకే అతని యూట్యూబ్ ఛానెల్‌కు రెండు మిలియన్లకు పైగా సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. డ్రైవర్‌గా మొదలైన అతని ప్రయాణం.. ఇప్పుడు విదేశాల్లో వ్లాగ్స్ చేసేవరకు చేరింది.
డాక్టర్ బ్రో... ఈ పేరు కర్నాటకలో చాలా ఫేమస్. అక్కడివాళ్లు ఫేస్‌బుక్, యూట్యూబ్ ఓపెన్ చేసినప్పుడల్లా అతని వ్లాగ్స్ ట్రెండింగ్‌లో కనిపిస్తాయి. అన్ని వయసుల వాళ్లు అతని వ్లాగ్స్ చూడటానికి ఇష్టపడతారు. ఈ డాక్టర్ బ్రో అసలు పేరు గగన్ శ్రీనివాస్. బెంగళూరు శివార్లలో పుట్టి పెరిగాడు. వయసు 23 ఏండ్లు. తండ్రి - శ్రీనివాస్, తల్లి - పద్మావతి. అతనికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. వాళ్లది మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం. గగన్ రెండో తరగతి చదువుతున్నప్పుడే పౌరోహిత్యం నేర్చుకున్నాడు. అర్చకత్వం, హోమాలు చేయడంతో బాల్యం గడిచిపోయింది.
పెద్దగా చదువుకోలేదు
గగన్‌కు చదువు మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో చదివాడు. ఆ తర్వాత నేలమంగళలోని బసవేశ్వర కాలేజీలో ఇంటర్ పూర్తిచేశాడు. కేఆర్‌పూర్‌లోని విశ్వేశ్వర్ పుర కాలేజీలో బీకామ్ చేశాడు. చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడంతో కాలేజీలో ఉన్నప్పుడే డ్రైవర్‌గా పనిచేయడం మొదలుపెట్టాడు. అప్పటికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. దాంతోపాటు ఆలయాల్లో పూజలు కూడా చేసేవాడు. ఛానెల్ పెట్టడానికి ముందే యూట్యూబ్ గురించి తెలుసుకునేందుకు ప్రతిరోజూ సైబర్ కేఫ్‌కు వెళ్లి అరగంటకు10 రూపాయల చొప్పున ఇచ్చి యూట్యూబ్‌లో వీడియోలు చూసేవాడు. యూట్యూబ్‌లో ఏది టైపు చేసినా.. రిలేటెడ్ వీడియోలు కనిపించేవి. అలా కొన్ని నెలలు పాటు యూట్యూబ్ మీద స్టడీ చేశాడు. ఆ టైంలో తన ఫ్రెండ్ యోగేంద్ర దగ్గర స్మార్ట్ ఫోన్ ఉండేది. ఆ ఫోన్‌తో ఒక వీడియో చేశాడు.
2015లోనే ఒక ఛానెల్ పెట్టి అందులో ఆ వీడియో అప్‌లోడ్ చేశాడు. అప్పట్లో మానిటైజేషన్ లేదు. దాంతో మొదటి వీడియోకే 30 డాలర్లు వచ్చాయి. కానీ.. ఆ తర్వాత ఒకరోజు యూట్యూబ్‌లో చూస్తే ఛానెల్ కనిపించలేదు. అప్పటికే ఆ ఛానెల్‌కు 300 మంది సబ్‌స్క్రయిబర్లు ఉన్నారు. 2015లో 300 మంది సబ్‌స్క్రయిబర్లు కావడం పెద్ద విషయమే. కాపీ రైట్ స్ట్రయిక్ రావడంతో ఛానెల్ క్లోజ్ అయ్యింది. దాంతో 2016వ సంవత్సరంలో మరో యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేశాడు. ఈ ఛానెల్‌లో కామెడీ వీడియోలు, నటీనటుల ఇంటర్వ్యూలు పోస్ట్ చేసేవాడు. వాస్తవానికి అతను ఛానెల్ పెట్టినప్పుడు కన్నడలో అంతగా యూట్యూబర్లు లేరు. ఛానెల్ పెట్టిన తర్వాత ఫొటోగ్రఫీ, వీడియోగ్రఫీ నేర్చుకున్నాడు.
యూట్యూబ్ జర్నీ
గగన్ సీరియస్‌గా యూట్యూబర్ కావాలని 2018లో డిసైడ్ అయ్యాడు. అప్పుడే ‘‘డాక్టర్ బ్రో” పేరుతో కొత్త యూట్యూబ్ ఛానెల్ పెట్టాడు. మొదబ ట్లో కర్నాటకలో తిరుగుతూ వ్లాగ్స్ చేసేవాడు. ఆ తర్వాత డబ్బులు వచ్చేకొద్దీ వాటితో ఇండియా మొత్తం తిరుగుతూ వ్లాగ్స్ చేశాడు. ముఖ్యంగా కేరళ, అస్సాం, రాజస్తాన్, హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో వీడియోలు చేశాడు. కన్నడలో అతను మాట్లాడే విధానం అందరికీ నచ్చుతుంది. అందుకే చాలా తక్కువ టైంలోనే సబ్‌స్క్రయిబర్లు పెరిగారు. ఆదాయం కూడా పెరిగింది. దాంతో విదేశాలకు వెళ్లి వ్లాగ్స్ చేయడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు దుబాయ్, థాయిలాండ్, రష్యా, అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, ఆఫ్రికాలోని కొన్ని దేశాలు తిరిగాడు.
ఇంగ్లిష్ పెద్దగా రాకపోయినా ఫారిన్ టూర్లు చేసి చూపించాడు. ఈ మధ్య ఆఫ్రికాలోని ట్రైబ్స్‌తో కూడా వ్లాగ్స్ చేశాడు. ప్రస్తుతం అతని ఛానెల్‌కు 2.05 మిలయన్ల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. ఛానెల్‌లో ఇప్పటివరకు 145 వీడియోలు అప్‌లోడ్ చేశాడు. ఇతను మరో రెండు ఛానెల్స్ కూడా నడుపుతున్నాడు. డాక్టర్ బ్రో షార్ట్స్ అనే ఛానెల్‌కు 6 లక్షల సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు. గగన్ శ్రీనివాస్ అనే ఛానెల్‌ను57 వేల మంది సబ్‌స్క్రయిబ్ చేసుకున్నారు.
ఆదాయం
వ్యూస్ ద్వారా గగన్ నెలకు కనీసం ఎనిమిది లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడనేది అంచనా. కానీ.. ఎంత సంపాదిస్తున్నాడనేది అతనైతే చెప్పలేదు..
బ్యాగ్ పోగొట్టుకుని..
గగన్ వ్లాగ్స్ చేయడానికి రష్యా వెళ్లినప్పుడు అక్కడ ఫ్లయిట్ దిగగానే ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగ్ పోగొట్టుకున్నాడు. అతనితోపాటు దాదాపు పది మంది బ్యాగ్‌లు పోయాయి. దాంతో అక్కడి అధికారులకు కంప్లయింట్ చేశాడు. చివరకు మూడు రోజుల తర్వాత బ్యాగ్ తెచ్చిచ్చారు. ఈ మూడు రోజులు బ్యాగ్ లేకుండానే రష్యాలో తిరిగాడు. రష్యాలో ఏటీఎంలు పనిచేయలేదు. అతని దగ్గర డబ్బులు లేవు. ఒంటి మీద ఉన్న ఒక జత బట్టలతో ఆ మూడు రోజులు తిరిగాడు. అతను ఉంటున్న హాస్టల్‌లోనే ఉన్న ముంబైకి చెందిన వివేక్ జోషి కాస్త సాయం చేయడంతో గండం నుంచి గట్టెక్కాడు. అంతేకాదు.. గగన్ వెజిటేరియన్ కావడం వల్ల బయటి దేశాలకు వెళ్లినప్పుడు ఫుడ్ విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటాడు. ఉదాహరణకు థాయిలాండ్‌లో చేపలు శాఖాహారం. అక్కడి హోటల్‌లో వెజిటేరియన్ ఫుడ్ అడిగితే చేపలతో తయారుచేసిన ఫుడ్ ఇస్తారు. అందుకే గగన్ ఏది తిన్నా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని తింటాడు.