ఒక మనిషి ఒక్క పనిచేయడానికే టైం చాలట్లేదని అంటుంటే ఈ మలయాళీ మాత్రం ఒకటి రెండు కాదు ర్యాపర్, రైటర్, కొరియోగ్రాఫర్, యాక్టర్‌గా ఏకంగా నాలుగు పనులు చేశాడు. ఈ మల్టీటాలెంటెడ్ వ్యక్తి పేరు నీరజ్ మాధవ్. ఇప్పుడు ‘ఆర్డీఎక్స్’(రాబర్ట్, డానీ, జేవియర్) అనే మలయాళ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో జేవియర్గా ఆడియెన్స్ మనసులు గెలుచుకున్నాడు. నీరజ్‌కు ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ నటుడిగా మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆ జర్నీ గురించి నీరజ్ మాటల్లోనే....
‘‘నా గురించి పూర్తిగా చెప్పేముందు కొందరికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నేను ఈ రంగంలోకి వచ్చేముందు నాలో ఉన్న పొటన్షియల్‌ను నమ్మింది ఆ కొద్దిమందే. సినిమా ఫీల్డ్‌లో తెలిసిన వాళ్లెవరూ లేకపోయినా ఇందులోకి అడుగుపెడుతున్నానంటే నన్ను ప్రోత్సహించింది వాళ్లు. అయితే ఇంకోరకం ఉన్నారు. వాళ్లు నన్ను అనుమానించారు. నా కలలను చూసి నవ్వారు. అయితే అలాంటివాళ్ల మాటలు నన్ను మోటివేట్ చేశాయే తప్ప నన్ను నేను తక్కువగా అనుకోలేదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే వల్ల కాదని వదిలేస్తామో... అప్పుడే మన పని అయిపోయినట్టే. అలాకాకుండా మనం చేయాలనుకున్న పని మీద పూర్తి దృష్టి పెట్టి ముందుకు అడుగువేస్తే అనుకున్న లక్ష్యం చేరుకోవడం గ్యారెంటీ. అందుకు నేనే ఉదాహరణ. అలాగే నన్ను అనుమానించిన, అవమానించిన వాళ్లకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్లు నన్ను చాలా తక్కువగా అంచనా వేశారు. అవన్నీ నేను చేరుకోవాలన్న నా లక్ష్యానికి ఇంధనంగా మారాయి. నిజానికి హండ్రెడ్ పర్సంట్ మనం ఏదైనా సాధించాలి అనుకుంటే యూనివర్శ్ అందుకు సాయం చేస్తుంది.
ఒక్కమాటలో చెప్పాలంటే కొన్ని విషయాలు మన కంట్రోల్లో ఉంటే, మరికొన్ని ఉండవు. వాటిని బేరీజు వేసుకుంటూ ఒక్కో అడుగు వేయాలి. ఇప్పుడు ‘ఆర్డీఎక్స్’ సినిమా సక్సెస్ అయింది. అలాగని నేను రిలాక్స్ కాను. నన్ను నేను ఇంప్రూవ్ చేసుకునేందుకు ఇంకా ట్రై చేస్తా. కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తా. ఆర్డిఎక్స్ సినిమాలో స్టంట్స్ చేయడం వల్ల దెబ్బలు బాగా తగిలాయి నాకు. వాటినుంచి కోలుకుని వెంటనే షూటింగ్చేసేలా నన్ను ప్రిపేర్ చేసినందుకు టామ్‌కి రుణపడి ఉంటా.
డాన్స్ నుంచి డ్రామా వరకు
నా వ్యక్తిగత వివరాల్లోకి వెళ్తే ... మా నాన్న కే మాధవన్ వెటరనరీ డాక్టర్. అమ్మ లత టీచర్. నాకో తమ్ముడు ఉన్నాడు. వాడి పేరు నవనీత్. తను కూడా డాన్సర్ కమ్ యాక్టర్. కాలికట్కు దగ్గరలోని తిరువన్నూర్లో మార్చి 26, 1990వ సంవత్సరంలో పుట్టాను. కాలికట్‌లోని ‘సెంట్ జోపెఫ్ బాయ్స్ హయ్యర్ సెకండరీ స్కూల్లో చదువుకున్నా. తరువాత చెన్నయ్‌లోని ఎస్ఆర్ఎమ్ యూనివర్సిటీలో విజువల్ కమ్యూనికేషన్స్‌లో గ్రాడ్యుయేషన్ చేశా. ఆ తరువాత త్రిసూర్‌లో ఉన్న ‘స్కూల్ ఆఫ్ డ్రామా అండ్ ఫైన్ ఆర్ట్స్’లో థియేటర్సబ్జెక్ట్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశా. కళామండలం సరస్వతి, ఆమె కూతురు అశ్వతి దగ్గర భరతనాట్యం నేర్చుకున్నా. కళానిలయం ఉదయన్ నంబూద్రి దగ్గర చెండ(కేరళ డ్రమ్స్) వాయించడంలో ట్రైనింగ్ తీసుకున్నా.
అమృత టీవీలో వచ్చిన మొట్టమొదటి డాన్స్ రియాలిటీ షోలో ‘సూపర్ డాన్స్’ అనే ప్రోగ్రామ్ ద్వారా నా టెలివిజన్ కెరీర్ మొదలైంది. ఆ షో ఫైనలిస్ట్ల్లో నేను ఒకడ్ని. ఫిల్మ్ కెరీర్ మాత్రం 2013లో రాజ్ ప్రభావతి మీనన్ డైరెక్ట్ చేసిన ‘బడ్డీ’ అనే సినిమాతో అడుగు పడింది. తరువాత అదే ఏడాది జీతు జోసెఫ్ ‘దృశ్యం’ సినిమాలో చేసే అవకాశం వచ్చింది. ఇక కొరియోగ్రఫీ డెబిట్ ‘ఒరు వడక్కన్ సెల్ఫీ’ అనే సినిమాలో ‘ఎన్నె తల్లెందమ్మవా’ పాటతో జరిగింది.
బాయ్స్ స్కూల్ కావడం వల్ల...
నా చదువంతా బాయ్స్ స్కూల్లో జరిగింది. దానివల్ల అమ్మాయిలతో మాట్లాడాలంటే ఇబ్బందిగా ఉండేది. అయితే అదంతా 12 గ్రేడ్ వరకే. ఆ తరువాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అప్పుడు నా మొదటి క్రష్ ను ఒక కోచింగ్ సెంటర్లో కలిశా. తనది వేరే బ్యాచ్. మంచినీళ్ల కోసం వెళ్తే వాటర్ డిస్పెన్సర్ దగ్గర కనిపించింది. కాటుక దిద్దుకున్న అందరమైన పెద్ద కళ్లు ఆమెవి. ఆ కళ్లలో ఏదో ఆకర్షణ. మొదటిసారి నాలో ఏవో ఫీలింగ్స్ కలిగాయి. అది గమనించిన నా ఫ్రెండ్స్ ఆమెతో మాట్లాడమని నన్ను బాగా ఏడిపించేవారు. ఆమె క్లాసు దగ్గర్లో కనిపించినా పెద్దగా దగ్గేవాళ్లు లేదా నా పేరుపెట్టి పెద్దగా పిలిచేవాళ్లు. ఒకసారి ఆమె ఒక పుస్తకాన్ని ఇచ్చింది. అది చూసి నా ఫ్రెండ్స్ గట్టిగా గోల చేస్తుంటే ‘మత్ కరో యార్’ అని చెప్పా.
ఆ తరువాత నేను డాన్స్ రియాలిటీ షోస్‌కి వెళ్లడంతో క్లాస్‌లకు వెళ్లడం మానేశా. అలా ఆ అమ్మాయితో కాంటాక్ట్ పోయింది. ఇదంతా టీనేజ్ వ్యవహారం. అప్పటినుంచి ఇప్పటివరకు పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు నాకు పెండ్లయి ఒక పాప ఉంది. టీనేజ్‌లో ఉన్న ఫీలింగ్స్ ఇప్పుడు ఉండవు కదా! వాటి బదులు ఎప్పుడెప్పుడు పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లిపోదామా అనిపిస్తుంది. ఒకప్పటి క్రష్, ఇప్పుడు నా జీవిత భాగస్వామి ఇద్దరూ ఒకటే అనుకుంటారు చాలామంది. కానీ ఆమె, ఈమె ఒకటి కాదు. స్కూల్ చదువు తరువాత కొన్నేండ్లకు నా భార్యని కలిశా. మాది చాలా డిఫరెంట్ స్టోరీ. నా భార్య పేరు దీప్తి. తనది కూడా కోజికోడ్. నాకు చాలా ఏండ్ల నుంచి పరిచయం ఉన్న వ్యక్తి.
ఫ్యామిలీ మ్యాన్‌తో...
అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’లో మూసా అనే మలయాళీ టెర్రరిస్ట్ రోల్ చేశా. ఆ క్యారెక్టర్ తరువాత చాలామంది నన్ను మూసా అనే పిలిచేవారు. ‘దృశ్యం’ సినిమాతో నా గురించి ఎక్కువమందికి తెలిసింది. మలయాళంలో చేసిన ఆ సినిమాలో మోహన్లాల్కి అసిస్టెంట్‌గా చేశా. ఆ తరువాత ‘సప్తమశ్రీ తస్కరః’లో కామెడీ రోల్ చేశా. కానీ కామెడీ పాత్రలకే పరిమితం కాకుండా సీరియస్ రోల్స్ చేయడం మొదలుపెట్టా. ‘ఓరు మెక్సికన్ అపరత’లో స్టూడెంట్ లీడర్, ‘ఊజమ్’లో టెకీ పాత్రలో చేశా. ఆ తరువాత ‘లవకుశ’ సినిమాతో స్క్రిప్ట్ రైటర్ అవతారం ఎత్తా. డాన్స్, యాక్టింగ్, ర్యాప్, రైటింగ్ ఆ తరువాత మళ్లీ యాక్టింగ్ వైపు వచ్చా.
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్‌లో అవకాశం ఎలా వచ్చిందంటే... కాస్టింగ్ ఏజెన్సీ నుంచి ఆడిషన్‌కి రమ్మని ఫోన్ కాల్ వచ్చింది. క్యారెక్టర్ బ్రీఫ్ చేయమని అడిగా. ఆ తరువాత నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ చేసింది డైరెక్టర్ డీకే(క్రిష్ణ డీకే). అప్పటికే డీకే, రాజ్ కలిసి ‘షోర్ ఇన్ ది సిటీ, గో గోవా గాన్’ వంటి ఫిల్మ్స్ తీసి ఉన్నారు. కానీ ఆ ఫోన్ కాల్ చేసింది ఆయన అనుకోలేదు నేను. ‘‘మేం తీస్తున్న వెబ్‌సిరీస్‌లో నిన్ను చూడాలనుకుంటున్నాం. నీ లాంగ్వేజి స్కిల్స్ టెస్ట్ చేసేందుకు పిలుస్తున్నాం” అన్నాడు. ఆ ప్లాట్‌లో నా క్యారెక్టర్ ఎక్కడ ఫిట్ అవుతుందో 20 నిమిషాల్లో వివరంగా చెప్పాడు. మూసా అనే ఆ క్యారెక్టర్లో చాలా లేయర్స్ ఉంటాయి. అంతకుముందు వరకు అలాంటి క్యారెక్టర్ నేను చేయలేదు. మనోజ్ బాజ్‌పేయితో కలిసి చేయడం అంటే మాటలు కాదు. అది నా యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకునేందుకు మంచి అవకాశంగా అనిపించింది. షూటింగ్లో ప్రతీ రీ టేక్కు ఆయన భిన్నంగా పర్ఫామ్ చేసేవారు. ఆయన దగ్గర్నించీ నటనలో టెక్నిక్స్‌తో పాటు మనిషిగా కూడా ఎన్నో విషయాలు నేర్చుకున్నా.
ఫ్యామిలీ మ్యాన్‌లో చేయాలనే నిర్ణయం తీసుకోవడం ఒకరకంగా సాహసం అనే చెప్పాలి. ఎందుకంటే అప్పటివరకు నేను చేసిన క్యారెక్టర్లన్నీ పక్కింటి అబ్బాయి క్యారెక్టర్ లాంటివి. మూసా క్యారెక్టర్ అందుకు పూర్తి భిన్నం. మలయాళం ఇండస్ట్రీలో అప్పటివరకు నేను కమెడియన్. కానీ నా మూడో సినిమా ‘దృశ్యం’. ఆ తరువాత నాకు నాలోని నటుడు వెరైటీ ఛాన్స్‌ల కోసం చూస్తున్నాడు అనిపించింది. ఫ్యామిలీ మ్యాన్‌లో చేశాక నా ఆసక్తి గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ అని అర్ధమైంది. మూసా క్యారెక్టర్ పాన్ ఇండియా, ఇంటర్నేషనల్ గుర్తింపు ఇచ్చింది. అమితాబ్ లాంటి లెజెండ్స్ నన్ను గుర్తుపట్టి మాట్లాడటమంటే మాటలు కాదు కదా! అది ప్రౌడ్ మూమెంట్ నాకు.
కథను మించిన హీరో ఎవరు?
కథ పెద్ద హీరో అనేది నేను పక్కాగా నమ్ముతా. ఎందుకంటే కథ బలంగా ఉంటే కొత్త మొఖాలు, సబ్జెక్ట్ యునిక్‌గా ఉంటే తప్పకుండా ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటారు. నా విషయంలోనే తీసుకుంటే ‘గౌతమంటె రాధమ్’ స్టోరీ అంతా ఒక మనిషి, అతని మొదటి కార్ చుట్టూ ఉంటుంది. ఇలాంటి సబ్జెక్ట్స్ సినిమాల్లో కొత్తవే కదా. కానీ చాలామంది దాంతో రిలేట్ అవుతారు. అలా రిలేట్ అయ్యారంటే ఆ సినిమా సక్సెస్ అయినట్టే. ఉదాహరణకు నా విషయంలో తీసుకుంటే... నేను చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నకి ప్రీమియర్ పద్మిని కారు ఉండేది. దాన్ని ఆయన తరువాత అమ్మేశారు. నేను సంపాదించిన డబ్బులతో కారు కొన్నప్పుడు నా ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. నాకు ఎప్పుడూ పెద్ద కారు కొనుక్కోవాలని ఉండేది. ఆ కోరిక బీఎండబ్ల్యు కొన్నప్పుడు తీరింది.
‘వెందు తనిందదు కాడు’ తమిళ సినిమా నాకెన్నో ప్రశంసలు తెచ్చి పెట్టింది. ఎ ఆర్ రెహ్మాన్‌తో కలిసి ఈ సినిమాకి ఒక పాట పాడా. డ్రీమ్స్ డు కమ్ ట్రూ అనే పాట రాసింది నేనే. ఆ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు రెహ్మాన్ గారితో కలిసి పాడిన విషయాన్ని సీక్రెట్‌గా ఉంచేందుకు చాలా కష్టపడ్డా. తమిళ ఇండస్ట్రీలో నటుడిగా, ర్యాపర్‌గా అడుగుపెట్టింది ఈ సినిమాతోనే” అని తన సినిమా జర్నీ గురించి చెప్పాడు.
మొదలైన దగ్గర్నించీ...
ఒరు ఇండియన్ ప్రణయకథ(2013), 1983 (2014), అపోతెకరీ(2014), సప్తమశ్రీ తస్కరః(2015), హోమ్లీ మీల్స్ (2015), చార్లీ(2015), అది కాప్యారె కూటమణి (2015), ఏజమ్(2016), ఓరు మెక్సికన్ అపరాత(2017), లవ కుశ(2017) ... ఇలా వరసగా సినిమాల్లో చేస్తూ వచ్చా. ఇప్పటివరకు దాదాపు పాతికపైగా సినిమాల్లో నటించా. 2015లో ‘న్యూ సెన్సేషన్ యాక్టింగ్ మేల్’ ఏసియావిజన్ అవార్డు అందుకున్నా.