అప్పుడు సాధారణ గృహిణి..ఇప్పుడు లేడీ లెజెండ్

అవును.. ఈ మాట ఆమెకు సరిగ్గా సరిపోతుంది. ఒకప్పుడామె సాధారణ గృహిణి. ఆ తర్వాత ఒక్కో మెట్టు ఎక్కింది. ఇప్పుడు అనేక రంగాల్లో రాణిస్తోంది. టీచర్‌‌‌‌గా మొదలైన ఆమె ప్రయాణం డబ్బింగ్ ఆర్టిస్టుగా, లిరిక్ రైటర్‌‌‌‌గా, పెయింటర్‌‌‌‌గా, జువెల్లరీ మేకర్‌‌‌‌గా కొనసాగుతోంది. ప్రస్తుతం సోషల్ వలంటీర్‌‌‌‌గా, ఫ్యామిలీ కౌన్సెలర్‌‌‌‌గా, సైకాలజిస్ట్‌‌గా, మోటివేషనల్ స్పీకర్‌‌‌‌గా తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక గుర్తింపు పొందింది. ఆమే డాక్టర్ రేణికుంట్ల కవితాఅజయ్.

మంచిర్యాల, వెలుగు : బెల్లంపల్లికి చెందిన కవిత చిన్నప్పుడు బ్రైట్ స్టూడెంట్. కాగజ్‌‌నగర్‌‌‌‌లో ఇంటర్ వరకు చదివింది. తర్వాత  డీ–ఫార్మసీ పూర్తి చేసింది. 1998లో  కాగజ్​నగర్​కు చెందిన అజయ్‌‌ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా చదువు కొనసాగించింది. సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలని ఎప్పుడూ ఆరాటపడేది. ఆమె ఆశయాన్ని అర్థం చేసుకున్న భర్త, కుటుంబసభ్యులు ఆమెకు అన్ని విధాలా అండగా నిలిచారు. లక్ష్యాన్ని చేరుకునే వరకు ఆమె వెన్నంటే ఉండి నడిపించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు. ఓ వైపు వాళ్ల పెంపకం, మరోవైపు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూనే ఇంకోవైపు చదువుకుంది. లక్ష్య సాధన కోసం కష్టపడే ఆడవాళ్లకు కుటుంబ సహకారం తోడైతే ఎన్నో విజయాలు సాధిస్తారని చెప్పడానికి కవితాఅజయ్ సక్సెస్ స్టోరీ ఓ మంచి ఉదాహరణ.

టీచర్‌‌‌‌గా

2003లో డీఎస్సీ పరీక్షలో క్వాలిఫై అయ్యి ఇంగ్లీష్​ స్కూల్​ అసిస్టెంట్​గా ఎంపికయ్యింది. నెల రోజుల పాటు సాధారణ పద్ధతుల్లో పాఠాలు చెప్పింది. కానీ.. స్టూడెంట్స్‌‌ పాఠాలపై శ్రద్ధ పెట్టేవాళ్లు కాదు. వాళ్లలో చదువుపై ఆసక్తి కలిగించడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. ఆ పిల్లలకు సినిమా పాటలు, మ్యూజిక్‌‌పై ఎక్కువ ఆసక్తి ఉందని గమనించింది కవిత. పాఠాలకు పాటలు జోడించి బోధించడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల్లోనే విద్యార్థుల్లో ఎంతో మార్పు  వచ్చింది. దాంతో పిల్లల మనస్తత్వం గురించి ఇంకా తెలుసుకోవాలని అక్కడ చదువు చెప్తూనే కాకతీయ యూనివర్సిటీలో ఎమ్మెస్సీ సైకాలజీ చేసింది. తర్వాత శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి సైకాలజీలో పీహెచ్‌‌డీ పట్టా అందుకుంది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ ఇంగ్లీష్ పూర్తి చేశారు. అంతటితో ఆగకుండా ఎన్ఎల్పీ (న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రాం), హిప్నాటిజంలో ఐఏఎన్ఎల్పీ పూర్తి చేశారు. స్టూడెంట్స్‌‌ మనస్తత్వం, ఆసక్తి, అభిరుచులను అంచనా వేస్తూ పాఠాలు చెప్పడం ఇప్పుడామె ప్రత్యేకత.

షీరోస్‌‌తో సామాజిక సేవ..

తనలా విజన్ ఉన్న మరి కొంతమంది ఆడవాళ్లను సామాజిక సేవలో భాగస్వాములను చేసేందుకు షీరోస్ ఫౌండేషన్‌‌ను స్థాపించింది కవిత. 2018 నవంబర్ 11వ తేదీన మంచిర్యాలలో మొదలుపెట్టిన ఈ సంస్థ సేవలు తక్కువ కాలంలోనే పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల ప్రాంతాలకు విస్తరించాయి. ఇవే కాకుండా ఇంకొన్ని ప్రాంతాల్లో కూడా షీరోస్ ఫౌండేషన్ బ్రాంచీలు నడుస్తున్నాయి. ప్రస్తుతం ఈ సంస్థలో టీచర్లు, డాక్టర్లు, బిజినెస్ ఉమెన్స్.. మొత్తం 200 మందికిపైగా సభ్యులు ఉన్నారు. ప్రతి ఆదివారం వాళ్లంతా ఒకచోట కలిసి సమాజంలో ఆడవాళ్లపై జరుగుతున్న దారుణాలపై చర్చిస్తారు. ఆరోగ్య రక్షణకు యోగా, ధ్యానం ప్రాక్టీస్ చేస్తారు. ఆ వారంలో చేయాల్సిన సేవా కార్యక్రమాల ప్లాన్‌‌ రెడీ చేసుకుంటారు. ఆ తర్వాత దాన్ని అమలు చేస్తారు. ఇలా భిన్న రంగాల నుంచి వచ్చిన మహిళలందరినీ ఒకచోట చేర్చి ముందుకు నడిపిస్తున్నారు కవిత. ‘ఆడవాళ్లకు చదువు, ఆరోగ్యంపై కూడా అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఆడవాళ్లలో రక్తహీనత ఎక్కువగా ఉంటుంది. ఆహారంలో   మునగాకు ఎక్కువగా చేర్చుకుంటే ఈ సమస్య కొంత తగ్గుతుంది. దీనిపై ఆమె విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం’ అంటుంది కవిత. ఈ మధ్యే హెచ్ఐవీ, ఎయిడ్స్ బాధితులపై ఆమె కవితా సంపుటిని కూడా రాసింది. దాన్ని సినీనటి అక్కినేని అమల ఆవిష్కరించారు. ప్రేమ పేరుతో మోసపోయిన ఒక అమ్మాయిని చేరదీసి చదివిస్తోంది. ఇప్పుడు ఆ అమ్మాయి డిగ్రీ సెకండియర్. ఆ అమ్మాయి చదువు పూర్తయ్యే వరకు ఖర్చులన్నీ తానే భరిస్తానని చెప్పింది కవిత.

ప్రకృతి ప్రేమికురాలు

ప్రకృతి ప్రేమికురాలైన కవిత బంగారం, వెండి నగలను ఎప్పుడూ వేసుకోదు. ప్రకృతి సిద్ధంగా లభించే రంగురాళ్లతో టెర్రకోట నగలను స్వయంగా తయారు చేసుకుంటుంది. వాటినే వేసుకుంటుంది. అనేక రకాల డిజైన్లలో తయారు చేసి మార్కెట్లో కూడా అమ్ముతోంది. దీనివల్ల మరో ముగ్గురు ఆడవాళ్లు కూడా ఉపాధి పొందుతున్నారు. ఇప్పుడు మధ్యతరగతి ఇళ్లలో కూడా ఒకటి రెండు బైక్‌‌లు ఉంటున్నాయి. ఇక ధనవంతుల ఇళ్లల్లో అయితే ఒకటి రెండు కార్లు తప్పనిసరి అయిపోయాయి. వీటితో వాతావరణ కాలుష్యం బాగా పెరిగిపోతోంది. ఈ కాలుష్యాన్ని నివారించేందుకు సైకిల్ క్లబ్‌‌లను ప్రోత్సహించాలని విస్తృతంగా ప్రచారం చేస్తోంది కవిత. మొక్కల పెంపకంతో పాటు వినాయక ఉత్సవాల సందర్భంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తూ పర్యావరణ పరిరక్షణపై జనాలకు అవగాన కల్పిస్తోంది. ‘లక్ష్యం పెట్టుకుని పట్టుదలతో కష్టపడితే ఆడవాళ్లు ఎంత ఎత్తుకైనా ఎదుగుతారు. ఎంతో మంది అనేక రంగాల్లో రాణిస్తూ మహిళా లోకానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. అటువంటి వాళ్లను స్ఫూర్తిగా తీసుకుని శక్తి సామర్థ్యాలకు, నైపుణ్యాలకు సానబెట్టుకోవాలి. వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, వృత్తిపరంగా ఎటువంటి సమస్యలు ఎదురైనా ఆడవాళ్లు ఆత్మస్థైర్యం కోల్పోవద్దు. అన్నింటినీ  ధైర్యంగా ఎదుర్కోవాలి. భవిష్యత్తులో షీరోస్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవతో పాటు మహిళలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు నిర్వహించేందుకు రూపకల్పన చేస్తున్నాం. సైకాలజీ కౌన్సెలింగ్‌‌కు సంబంధించి కపుల్ మేనేజ్‌‌మెంట్, ఫ్యామిలీ కౌన్సెలింగ్, హ్యాపీ పేరెంటింగ్, స్టూడెంట్ కౌన్సెలింగ్‌‌కు సంబంధించిన వీడియోలను మా యూట్యూబ్ చానెల్‌‌లో అప్​లోడ్​ చేస్తున్నాం’ అంటోంది కవితాఅజయ్‌‌.

సైకాలజిస్ట్‌‌గా.. మోటివేషనల్ స్పీకర్‌‌‌‌గా..

కవిత చదువుకునే రోజుల్లో తన స్నేహితులకు ఏదైనా సమస్య వస్తే నాలుగు మంచి మాటలు చెప్పి బాధను మర్చిపోయేలా చేసేది. టీచర్‌‌‌‌గా స్టూడెంట్స్‌‌కు భవిష్యత్తుపై గైడెన్స్ ఇస్తుంటుంది. టాకింగ్‌‌ పవర్​తో అందరినీ మెప్పిస్తుంటుంది. తనకున్న ఈ ప్రత్యేకతనే కెరీర్‌‌గా‌‌ ఎందుకు మలచుకోకూడదు అనుకుంది. అందుకే 2009లో ‘ఆకాంక్ష’ అనే సంస్థను స్థాపించి, వ్యక్తిత్వ వికాసంపై తరగతులు నిర్వహించడం మొదలుపెట్టింది. ఒత్తిడిని అధిగమించడం, పరీక్షలను ఎదుర్కోవడం, నేర ప్రవృత్తికి దూరంగా ఉండడం, పెళ్లికి ముందు, తర్వాత ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవడం వంటి అనేక అంశాలపై స్టూడెంట్స్‌‌, యూత్‌‌కి అవగాహన కల్సించింది. ప్రస్తుతం ఇంపాక్ట్ అనే ప్రోగ్రామ్‌‌ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వేలమంది స్కూల్‌‌, కాలేజీ స్టూడెంట్స్‌‌కు పర్సనాలిటీ డెవలప్‌‌మెంట్‌‌ ట్రైనింగ్‌‌ ఇస్తోంది. వీలున్నప్పుడు కేజీబీవీలు, మోడల్‌‌ స్కూల్స్ స్టూడెంట్స్‌‌కు కూడా వ్యక్తిత్వ వికాసంపై ట్రైనింగ్‌‌ ఇస్తూ వాళ్లలో ఆత్మస్థైర్యం నింపుతోంది. ఈ మధ్యే ఒక యూట్యూబ్ చానెల్‌‌ను కూడా మొదలుపెట్టింది. కవిత సేవలను గుర్తించిన ట్యూటర్స్ ప్రైడ్, రాజారత్న హెల్త్‌‌కేర్‌‌‌‌ ఫౌండేషన్ వాళ్లు సంయుక్తంగా ‘లేడీ లెజెండ్’ అవార్డుతో సత్కరించారు.