కాళేశ్వరం అక్కరకు రాలే.. ఎల్లంపల్లి నుంచే ఎత్తిపోతలు

  • 35 రోజుల్లో 25 టీఎంసీల నీళ్లు లిఫ్టింగ్​.. కాస్త లేటైనా ఆదుకున్న ఎస్సారెస్పీ
  • నిండుతున్న మిడ్​మానేరు, లోయర్​ మానేరు, మల్లన్న సాగర్

హైదరాబాద్, వెలుగు:కాళేశ్వరం ప్రాజెక్టుతో ఉపయోగం లేదని మరోసారి తేలిపోయింది. ఆ ప్రాజెక్టు అవసరం లేకుండానే ఎల్లంపల్లి నుంచే నేరుగా నీటిని లిఫ్ట్​ చేసుకోవచ్చని ఈ సారి కూడా రుజువైంది. ఈ సీజన్​లో ఇప్పటి వరకు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నేరుగా 25 టీఎంసీల నీళ్లను ఇరిగేషన్ శాఖ అధికారులు లిఫ్ట్​ చేశారు. జులై 28న మొదలైన నీటి లిఫ్టింగ్.. సోమవారం వరకు దఫదఫాలుగా 35 రోజుల పాటు కొనసాగింది. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నందిమేడారం పంప్​హౌస్​కు.. అక్కడి నుంచి గాయత్రి పంప్​హౌస్​కు నీటిని లిఫ్ట్ చేశారు.

గాయత్రి పంప్​హౌస్​లోని బాహుబలి మోటార్ల ద్వారా నీటిని వరద కాల్వలోకి ఎత్తిపోసి మిడ్​మానేరు ప్రాజెక్టుకు తరలించారు. కాస్త లేట్ గా అయినా ఎల్లంపల్లికి ఎస్సారెస్పీ కూడా తోడైంది. దీంతో వరద కాల్వ ద్వారా గోదావరి జలాలను మిడ్​మానేరుకు, అక్కడి నుంచి మల్లన్న సాగర్, లోయల్ మానేరు డ్యామ్​కు తరలిస్తున్నారు. 

కాళేశ్వరం ఉపయోగపడలే 

కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి రైతులకు అక్కరకొచ్చింది లేదు. రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు ఎత్తిపోసి.. అక్కడి నుంచి మిడ్​మానేరు, ఇతర ప్రాజెక్టులను నింపాలన్న గత బీఆర్ఎస్ సర్కార్ ప్లాన్​లన్నీ బెడిసికొట్టాయి. 37 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని చెప్పిన గత సర్కారు.. ఐదేండ్లలో కనీసం లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వలేకపోయింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి, కన్నెపల్లి పంప్​హౌస్​లు మునిగిపోవడానికి ముందు 2022 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 168 టీఎంసీల వరకు ఎత్తిపోసినా.. అందులో 118 టీఎంసీలు సముద్రంపాలే అయ్యాయి

మిగతా నీటినీ సక్రమంగా వాడుకోలేదు. అంటే ప్రాజెక్టును ప్రారంభించినప్పటి నుంచి 2022లో కన్నెపల్లి పంప్​హౌస్​లు మునిగిపోయే వరకు నాలుగేండ్లలో వాడుకున్న నీళ్లు కేవలం 50 టీఎంసీలే కావడం గమనార్హం. అంటే ఏటా 12 టీఎంసీలనూ సరిగ్గా వాడుకోలేదు. రోజూ మూడు టీఎంసీలను ఎత్తిపోస్తామని గొప్పగా చెప్పుకున్న ప్రాజెక్టుతో ఇప్పటివరకు ఒరిగిన ప్రయోజనమేమీ లేదని ఇరిగేషన్​ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు చుట్టూ తిరిగి మళ్లీ ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్​ నీటిపైనే ఆశలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ ప్రాజెక్టుల నుంచే వివిధ మీడియం ప్రాజెక్టులకు నీటిని తరలించాల్సిన పరిస్థితి నెలకొన్నది.

ఎల్లంపల్లి నుంచి నీటిని ఇవ్వాలని

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయినప్పటి నుంచి ఎల్లంపల్లి నుంచే నీటిని ఎత్తిపోయాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. జులైలో ప్రాజెక్టు వరద క్రమంగా పెరిగి నీటిమట్టం 16 టీఎంసీలకు పెరిగాక రోజూ 2 టీఎంసీల చొప్పున నీటిని ఎత్తిపోయాలని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీంతో జులై 28న నందిమేడారం, గాయత్రి పంప్​హౌస్​ల నుంచి అధికారులు నీటిని లిఫ్ట్ చేయడం ప్రారంభించారు. తొలుత తాగునీటి అవసరాల కోసం నీటిని లిఫ్ట్ చేసిన అధికారులు.. క్రమంగా నీటి లిఫ్టింగ్​ను పెంచుతూ వచ్చారు. మిడ్​మానేరుకు ఎల్లంపల్లి నుంచి జలాలను తరలించారు. ఇప్పుడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకూ వరద ఒకేసారి పెరగడంతో ఆ ప్రాజెక్టు నుంచీ 2.45 లక్షలకుపైగా క్యూసెక్కుల వరదను ఎల్లంపల్లికి వదులుతున్నారు.

దీంతో ఇటు శ్రీరాంసాగర్, అటు కడెం తదితర ప్రాజెక్టుల నుంచీ వరద ప్రవాహం పెరుగుతుండడంతో ఎల్లంపల్లికి 4.6 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వస్తున్నది. ఇటు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటితోనే సింగూరు, నిజాంసాగర్ ప్రాజెక్టులను నింపాలనీ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా శ్రీరాంసాగర్ పునరుద్ధరణ ప్రాజెక్టునూ చేపట్టినా దాని వల్ల ప్రస్తుతం ప్రయోజనం లేకుండా పోయింది. గోదావరి నదికి వస్తున్న వరదతోనే శ్రీరాంసాగర్​ ప్రాజెక్ట్​ నిండింది. మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుతో అవసరం లేకుండానే ఇటు ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్​ ప్రాజెక్టుల ద్వారానే మధ్యతరహా ప్రాజెక్టులకు నీటిని తరలిస్తున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లికి భారీగా వరదలు వస్తుండటంతో సోమవారం తాత్కాలికంగా లిఫ్టింగ్​ను ఆపేశారు. మరో వారం రోజుల్లో మళ్లీ లిఫ్టింగ్​ను మొదలుపెట్టే అవకాశాలున్నాయి.

గోదావరికి వరద పోటు

ప్రస్తుతం గోదావరి నదికి వరద భారీగా వస్తున్నది. ఇన్నాళ్లూ స్తబ్దుగా ఉన్న గోదావరి నదికి గత వారం రోజుల నుంచి వరద ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ప్రస్తుతం  2,45,640 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా... 2,40,853 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు కెపాసిటీ 80.500 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 69.89 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 4,72,354 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తాన్ని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టులో నిల్వ సామర్థ్యం 20.175 టీఎంసీలకుగానూ ప్రస్తుతం 14.25 టీఎంసీల నీళ్లున్నాయి.

ఇటు సింగూరు ప్రాజెక్టుకు 33,920 క్యూసెక్కులు, నిజాంసాగర్ ప్రాజెక్టుకు 32,500 క్యూసెక్కుల వరద వస్తున్నది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుంచి 9.02 లక్షల క్యూసెక్కులు వృథాగా దిగువకు వదిలేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సమ్మక్కసాగర్​ బ్యారేజీ నుంచి 7.23 లక్షలు, సీతమ్మసాగర్​ నుంచి 7.55 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. మరోవైపు కొద్దిరోజులుగా ఉధృతంగా ఉన్న కృష్ణా నదిలో ప్రవాహం మంగళవారం కాస్తంత తగ్గుముఖం పట్టింది. జూరాలకు 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. 2.09 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 4.17 లక్షల క్యూసెక్కుల ఫ్లోస్​ ఉండగా.. 3.61 లక్షల క్యూసెక్కులను దిగువకు రిలీజ్ చేస్తున్నారు. నాగార్జునసాగర్​కు 3.04 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు.