నిజామాబాద్ జిల్లాలో పేపర్లకే పరితమైన లిఫ్ట్‌‌ స్కీమ్‌‌లు

నిజామాబాద్, వెలుగు: జిల్లాలో సిద్దాపూర్ రిజర్వాయర్, జకోర చందూరు లిఫ్ట్ స్కీమ్‌‌లకు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. పర్యావరణ అనుమతులు రాకున్నా రాష్ట్ర ప్రభుత్వం శంకుస్థాపన చేయడం కేంద్ర చట్టాల ఉల్లంఘన జరిగినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌కు అనుసంధానంగా నిర్మిస్తున్న జిల్లా నీటి స్కీమ్‌‌లకు ప్రత్యేక పర్మిషన్లు అవసరంలేదని ఇరిగేషన్ శాఖ ఆఫీసర్లు చెబుతున్నారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలంలో 25 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు ప్రభుత్వం రూ.120 కోట్లతో జకోర‌‌‌‌‌‌‌‌ చందూరు లిఫ్ట్ స్కీమ్ రూపకల్పన చేసింది. 2022 ఏప్రిల్ 24న మంత్రి హారీశ్‌‌రావు ఈ పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని మరో లిఫ్ట్‌‌ ప్రాజెక్ట్‌‌ అయిన సిద్దాపూర్ రిజర్వాయర్​రూ.160 కోట్లతో రూపకల్పన చేశారు. ఈ స్కీమ్‌‌ను కూడా 2022 ఫిబ్రవరి 16న ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, స్పీకర్​ పోచారం శ్రీనివాస్‌‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ రెండు పథకాలకు ఫారెస్ట్, పర్యావరణ పర్మిషన్లు లేకుండానే ఆఫీసర్లు నిర్మాణ పనుల అగ్రిమెంట్‌‌ను పూర్తి చేశారు. సంవత్సర కాల పరిమితితో వీటిని పూర్తి చేయాలని నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు పనులు మొదలు కాలేదు.  

కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకేనా?

పర్యావరణ అనుమతులు లేకుండా సిద్దాపూర్​రిజర్వాయర్, జకోర లిఫ్ట్ స్కీమ్‌‌లు ఏలా పూర్తి చేస్తారనేది అంతటా చర్చ జరుగుతోంది. కాంట్రాక్ట్​అగ్రిమెంట్ పూర్తయినా అనుమతులు లేవు. 25 వేల ఎకరాలకు సాగునీరందించేందుకు రూపకల్పన చేసిన ఈ స్కీమ్‌‌లు నీటిమూటలుగా మిగిలిపోనున్నాయి. రూ.280 కోట్లు ఖర్చు చేసి నిర్మిస్తున్న పథకాలు నిలిచిపోతే వచ్చే ఏడాది కల్లా పది శాతం ఖర్చు పెరగునుంది. అదనంగా రూ.28 కోట్లు ప్రభుత్వ ఖజనాపై భారం పడనుంది. వ్యవసాయాధారిత నియోజకవర్గంలో సుమారు 30 ఏళ్లుగా సాగునీరందించాలని ఈ ప్రాంత రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ స్కీమ్‌‌లకు  ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా ఆఫీసర్ల నిర్లక్ష్యం వల్ల పనులు నిలిచిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. కేవలం శంకుస్థాపనలు చేసి పర్యావరణ అనుమతులు లేని కారణంగా నిలిపివేసేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు కుట్ర చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకు ఈ స్కీమ్స్​రూపకల్పన చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చర్యలు తప్పవు

సిద్దాపూర్ రిజర్వాయర్​పనులు చేపడితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. ఫారెస్ట్‌‌ పరిధిలో రెండు ట్యాంకులు వస్తాయి. వీటికి పర్యావరణ పర్మిషన్ లేదు. ఇరిగేషన్ శాఖ ఇప్పటికీ ఎలాంటి దరఖాస్తు చేయలేదు. పనులు ప్రారంభిస్తే సీజ్​ చేస్తాం.  
-  వికాస్, డీఎఫ్‌‌వో