నిర్వహణకు నిధులియ్యక లిఫ్టులు మూలకువడ్డయ్​!

  • 54 లిఫ్టుల్లో పూర్తిస్థాయిలో పనిచేస్తున్నవి పదహారే..17 పాక్షికం..21 లిఫ్టులు పడావు
  •  కోదాడ, హుజూర్​నగర్​ సెగ్మెంట్లలో లిఫ్టుల పరిస్థితిపై రిపోర్ట్​ అడిగిన ఇరిగేషన్​ మంత్రి
  • ఫీల్డ్​ ఎంక్వైరీలో నివ్వెరపోయే నిజాలు
  • రిపేర్లకే రూ.100 కోట్లు కావాలని నివేదిక!

సూర్యాపేట, వెలుగు: తెలంగాణ వచ్చాక తాము సాగునీటి రంగానికి పెద్దపీట వేశామని చెప్పుకున్న నాటి బీఆర్ఎస్​ సర్కారు ఒక్క కాళేశ్వరం తప్ప రాష్ట్రంలోని ఏ ప్రాజెక్టునూ పట్టించుకోలేదు. నిర్వహణకు నిధులివ్వకపోవడంతో కడెం, మూసీ లాంటిNalg ప్రాజెక్టుల గేట్లు కొట్టుకపోయిరిజర్వాయర్లు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.  రాష్ట్రంలోని వివిధ లిఫ్టు ప్రాజెక్టులు కూడా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయని తాజాగా తేలుతోంది. ఇరిగేషన్ ​శాఖ బాధ్యతలు చేపట్టిన వెంటనే   కోదాడ, హుజూర్​నగర్​నియోజకవర్గాల్లో కృష్ణానదిపై కాంగ్రెస్​ హయాంలో చేపట్టిన లిప్టుల పరిస్థితిపై మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి ఇరిగేషన్​ డిపార్ట్​మెంట్ నుంచి రిపోర్ట్​ తెప్పించుకున్నారు. అందులో ఈ రెండు  నియోజకవర్గాల్లో కేవలం మెయింటనెన్స్​కు ఫండ్స్​ రాక ఏకంగా17 పాక్షికంగా, 21 లిఫ్టులు పూర్తిగా మూలపడ్డాయని వెల్లడైంది.

లిఫ్టులపై ఇచ్చిన హామీలు గాలికి..

2009లో  కాంగ్రెస్​ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి హోదాలో ఉత్తమ్​కుమార్​రెడ్డి  సూర్యాపేట జిల్లాలోని కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో నాగార్జున సాగర్​ ప్రాజెక్టు బ్యాక్​వాటర్​ ఆధారంగా ఎన్​ఎస్​పీ కింద 17, ఇరిగేషన్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్​(ఐడీసీ) కింద మరో 54 లిఫ్టు స్కీములను నిర్మించారు. 60వేల ఎకరాలకు నీళ్లిచ్చే ఈ లిఫ్టుల నిర్వహణ బాధ్యత అప్పట్లో కాంగ్రెస్​ ప్రభుత్వమే చూసుకునేది. కానీ, 2014లో బీఆర్ఎస్​ అధికారంలోకి వచ్చాక వీటి నిర్వహణకు తొమ్మిదేండ్ల పాటు పైసా కేటాయించలేదు. దీంతో రైతులే తలా కొంత  వేసుకొని వాటిని సొంత ఖర్చులతో నిర్వహిస్తూ వచ్చారు. రిపేర్ల ఖర్చు భరించలేని స్థాయిలో ఉన్నప్పుడు రైతులు చేతులెత్తేయడంతో పలు లిఫ్టులు మూలకుపడ్డాయి. 2019లో హుజూర్​నగర్​కు జరిగిన ఉప ఎన్నికల్లో  బీఆర్ఎస్ గెలిచాక,  హుజూర్ నగర్ లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు అప్పటి సీఎం కేసీఆర్​ హాజరయ్యారు. కొత్తగా శివ గంగ, మహాత్మా గాంధీ ఎల్ 27, గుండ్ల పల్లి, గుర్రంబోడు, శూన్యపహాడ్ మేజర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు నాలుగు మండలాల్లో కాంగ్రెస్​హయాంలో చేపట్టిన లిఫ్టుల నిర్వహణ ఖర్చును ఇకపై ప్రభుత్వమే భరిస్తుందని, రైతులు పైసా చెల్లించాల్సిన పనిలేదని హామీ ఇచ్చారు. కానీ,  కొత్తగా ఒక్క లిఫ్టు ప్రాజెక్టు చేపట్టకపోగా, పాత లిఫ్టుల నిర్వహణకు పైసా ఇవ్వలేదు. దీంతో పలు లిఫ్టులను నిర్వహించలేక రైతులు చేతులెత్తేశారు. ఉదాహరణకు చింతల పాలెం మండలం పాత
వెల్లటూరులోని శివ గంగా లిఫ్టు రిపేర్ల కోసం రైతులు పలుమార్లు ఆందోళన చేసినా నాటి ప్రభుత్వం స్పందించలేదు. చిన్న లిఫ్టులకు రిపేర్లు పెరగడంతో  వాటి స్థానంలో మెగా లిఫ్ట్ ఏర్పాటు చేస్తామని చెప్పిన బీఆర్ఎస్​ సర్కారు,  రూ.1450కోట్లతో  వెల్లటూరు మెగా లిఫ్ట్  పనులను 2022 ఆగస్టులో  ప్రారంభించింది.  కానీ, ఏడాది గడిచినా ఇప్పటికీ10శాతం పనులు కూడా పూర్తి చేయలేదు.

21 లిఫ్టులు మూతపడ్డాయి..

నల్గొండ  జిల్లాకు చెందిన ఉత్తమ్కుమార్ రెడ్డి  నీటిపారుదల మంత్రిగా బాధ్యతలు చేపట్టాక హుజూర్​నగర్​లో ఇరిగేషన్​ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్​ పెట్టారు. కాంగ్రెస్​ హయాంలో చేపట్టిన లిఫ్టుల పరిస్థితిపై వారం రోజుల్లో రిపోర్ట్​ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆఫీసర్లు ఫీల్డ్ లెవెల్​లో ఎంక్వైరీ చేసి రిపోర్ట్​ను ఇటీవలే మంత్రికి అందజేశారు. ఐడీసీ కింద ఉన్న 54 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో కేవలం16 లిఫ్టులు మాత్రం పూర్తి స్థాయిలో పనిచేస్తుండగా,  17 పాక్షికంగా పని చేస్తున్నాయని తేల్చారు. నిర్వహణకు పైసల్లేక మరో 21 లిఫ్టులు పూర్తిగా పడావు పడ్డాయని నివేదిక ఇచ్చారు.  వీటి రిపేర్ల కోసం ఏకంగా రూ. 100 కోట్లు ఖర్చవుతుందని చెప్పడంతో..అవసరమైన ఫండ్స్ తెప్పించేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు మంత్రి సూచనల మేరకు ఇరిగేషన్​ ఆఫీసర్లు  మరో నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ప్రపోజల్స్​ రెడీ చేస్తున్నారు. వీటిలో రూ.41 కోట్లతో  నక్కగూడెం లిఫ్టు పునరుద్ధరణతోపాటు కొత్తగా రూ.7.4 కోట్లతో  ఉత్తమ్ పద్మావతి - 2 ఎత్తిపోతల,  రూ.36.4 కోట్లతో బెట్టెతండా (పాలకవీడు), తమ్మవరం, దొండపాడు-2 (చింతలపాలెం), రెడ్లకుంట(కోదాడ) లిఫ్టులను ప్రతిపాదించారు. వీటి ద్వారా మరో 20 వేల ఎకరాలకు నీళ్లివ్వాలనేది మంత్రి ఆలోచనగా తెలుస్తోంది.

మంత్రికి రిపోర్ట్  ఇచ్చాం..

ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాలతో కోదాడ, హుజూర్ నగర్ నియోజక వర్గాల్లోని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఫీల్డ్​ ఎంక్వైరీ చేసి పూర్తి రిపోర్ట్ ఇచ్చాం.  54 లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో 17 లిఫ్టులు పాక్షికంగా, 21 లిఫ్టులు పూర్తిగా పని చేయట్లేదు. మరో నాలుగు కొత్త లిఫ్టుల కోసం కూడా మంత్రికి  ప్రపోజల్స్​ అందజేశాం.

- నరసింహారావు, ఎస్ఈ,  కోదాడ, హుజూర్ నగర్