- పని చేయని రెండు లిఫ్టులు
- నాలుగు ఫ్లోర్లు ఎక్కి, దిగలేక స్టూడెంట్స్, డాక్టర్ల నరకయాతన
- పట్టించుకోని టీజీఎమ్‌ఎస్‌ఐడీసీ అధికారులు
పద్మారావునగర్, వెలుగు:సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో కొన్ని నెలలుగా లిఫ్ట్‌లు పని చేయడం లేదు. దీంతో సీనియర్ వైద్యులు, మెడికల్స్టూడెంట్స్, సిబ్బంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు ఫ్లోర్లు కలిగిన గాంధీ మెడికల్ కాలేజీ బిల్డింగ్ లో ఎలక్ర్టానిక్ లైబ్రరీ, మైక్రో బయాలజీ, ఫిజియోలాజీ, ఫాథోలాజీ,బయో కెమిస్ర్టీ, ఫోరెన్సిక్ మెడిసన్ తో పాటు పదుల సంఖ్యలో వైద్య విభాగాలు కొనసాగుతున్నాయి.
కాలేజీలో మొత్తం 1250 మంది మెడికల్ స్టూడెంట్స్ , 450కి పైగా వైద్యులు, జూనియర్ డాక్టర్లు, హౌస్‌సర్జన్లు, మరో 250 మంది సిబ్బంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. సుమారు 20 శాతం మంది సీనియర్ వైద్యుల వయసు 60 ఏళ్లు దాటింది. వీరితోపాటు దివ్వాంగులు, ఇతర జబ్బులతో బాధపడే ఉద్యోగులు నాలుగు అంతస్తులు ఎక్కి, దిగలేక ఇబ్బంది పడుతున్నారు.
నాలుగు అంతస్తుల భవన సముదాయంలో కేవలం రెండు లిఫ్ట్‌లు మాత్రమే ఏర్పాటు చేయగా, ఒక లిఫ్ట్ ఏడాది క్రితం పాడవగా, రెండోది మూడు నెలల నుంచి పనిచేయడం లేదు. అప్పటి నుంచి వైద్యులు, సిబ్బంది ఆయా అంతస్తులకు వెళ్లేందుకు మెట్లు ఎక్కి దిగలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
మెట్లు ఎక్కలేని మరికొంతమంది గ్రౌండ్ ఫ్లోర్‌లోనే కూర్చుని, అక్కడి నుంచే తమ పనులను నిర్వహిస్తున్నారని, మెట్లు ఎక్కే సమయంలో ఆయాసానికి గురై, అస్వస్థతతో ఆస్పత్రి పాలవుతున్నారని ఓ సీనియర్ డాక్టర్ వాపోయారు. రెండు దశాబ్ధాల క్రితం నిర్మించిన కళాశాల భవనంలోని లిఫ్ట్‌ల కాలపరిమితి ముగిసిందని, బకాయిలు చెల్లించకపోవడంతో సదరు నిర్వహణ సంస్థ రిపేర్లు చేయడానికి ముందుకు రావడం లేదని సమాచారం.
వెంటనే కాలేజీ అడ్మినిస్ట్రేషన్ అధికారులు , తెలంగాణ వైద్యవిద్య మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీజీఎంఎస్‌ఐడీసీ) అధికారులు స్పందించి మరమ్మత్తులు చేయించి లిఫ్ట్‌లను అందుబాటులోకి తేవాలని, నూతన లిఫ్ట్‌లు ఏర్పాటు చేయాలని పలువురు వైద్యులు, వైద్య విద్యార్థులు కోరుతున్నారు.