కాంగ్రెస్​లో ఎవరికి వారే : ఐ.వి. మురళీకృష్ణ శర్మ

తెలుగునాట ఎంతో ఘన చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్‌‌. తెలుగు రాష్ట్రం విభజనకు ముందు ఒక వెలుగు వెలిగిన హస్తం పార్టీ తెలంగాణలో గత రెండు దఫాల్లో ఘోర ఓటమి చవిచూసింది. ఆంధ్రప్రదేశ్‌‌లో అనాథలా తయారయిన కాంగ్రెస్‌‌ అక్కడ ‘నోటా’తో పోటీ పడుతుంటే, బలమున్న తెలంగాణలో స్వయంకృపరాధంతో ఎన్నికలకు ముందే తప్పటడుగులు వేస్తున్నది. 2023లో ఎట్టిపరిస్థితుల్లోనైనా తెలంగాణలో అధికారంలోకి రావాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్‌‌ అనేక ‘డిక్లరేషన్లు’ ప్రకటిస్తుంటే, పీసీసీ చీఫ్‌‌ రేవంత్‌‌ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు(డిక్లరేషన్లు) పార్టీలో, తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. ఆయన గతంలో కూడా అనేక నియోజకవర్గాల్లో అభ్యర్థులను డిక్లేర్‌‌ చేయడంతో పార్టీలో దుమారం రేగింది. టికెట్లను ప్రకటించడానికి ఆయనెవరని పార్టీలోని సీనియర్లు అనేక సార్లు అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు.

సీఎం అభ్యర్థిపైనా వివాదం

ఇటీవల రేవంత్‌‌రెడ్డి చేసిన ‘అమెరికా డిక్లరేషన్ల’తో పార్టీలో గందరగోళం నెలకొంది. ‘సీతక్క సీఎం’, ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌‌’ వంటి అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు పార్టీలోని ప్రత్యర్థులకు, అటు ప్రత్యర్థి పార్టీలకు అస్త్రాలుగా మారాయి. రాజకీయ ఎత్తుగడతోనే రేవంత్‌‌ ఈ వ్యాఖ్యలు చేశారని పార్టీ వర్గాలు సమర్థించుకుంటున్నా రాష్ట్రంలో దుమారం రేపుతున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలో రైతులు అనేక విధాలుగా పడుతున్న ఇబ్బందులను పాదయాత్ర ద్వారా స్వయంగా తెలుసుకున్న రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌‌ను ప్రవేశపెట్టారు. వైఎస్‌‌ఆర్‌‌ తీసుకొచ్చిన ఈ పథకం తెలుగు రాష్ట్రాల్లో ఒక సెంటిమెంట్‌‌గా ఏర్పడిన తరుణంలో అదే పార్టీ చీఫ్‌‌ దీనిపై నీరుగార్చేలా మాట్లాడటం ఆ పార్టీ శ్రేణులనే కలవరపెడుతోంది. కేసీఆర్‌‌ మూడు పంటలంటే.. రేవంత్‌‌ మూడు గంటలే కరెంటు అంటున్నారంటూ బీఆర్‌‌ఎస్‌‌ ఇప్పటికే పెద్దఎత్తున విమర్శలు ప్రారంభించింది. 

ఉచిత విద్యుత్‌‌పై రేవంత్‌‌కు ఒక స్పష్టత ఉంటే వరంగల్‌‌లో కాంగ్రెస్‌‌ తీసుకొచ్చిన రైతుల డిక్లరేషన్‌‌లో ఈ అంశాలను ఎందుకు ప్రస్తావించలేదు? కాంగ్రెస్‌‌ తీసుకొస్తున్న డిక్లరేషన్లపై ఆ పార్టీ నేతలకు అసలు అవగాహన ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సీఎం విషయంలో సీతక్క కంటే.. పోదెం వీరయ్య, భట్టి విక్రమార్క, దామోదర్‌‌ రాజనర్సింహా వంటి సీనియర్‌‌ నేతలు పార్టీలో ఉన్నారంటూ కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డి వ్యాఖ్యలు అగ్నికి మరింత ఆజ్యం పోశాయి. బీఆర్‌‌ఎస్‌‌–బీజేపీ మధ్య అవగాహన ఉందనే వార్తలతో ఉక్కిరిబిక్కిరవుతున్న కేసీఆర్‌‌కు ఉచిత విద్యుత్‌‌పై రేవంత్‌‌ చేసిన వ్యాఖ్యలు వరాలుగా మారాయి. రేవంత్‌‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. మునుగోడు ఎన్నికల సమయంలో ఆయనను ఐపీఎస్‌‌ అధికారితో, ఇతర సీనియర్‌‌ నేతలను హోంగార్డులతో పోల్చడంతో పార్టీలో నిరసనలు వ్యక్తమయ్యాయి.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే..

తెలంగాణలో అధికారంలోకి వచ్చేసినట్టు కాంగ్రెస్‌‌ నేతలు పగటి కలలు కంటున్నారు. పార్టీలో చేరికలు చూసి మురిసిపోయి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులను గమనిస్తే పరిస్థితి అంత తేలిగ్గా లేదనేది అర్థమవుతున్నది. 2014లో బీఆర్‌‌ఎస్‌‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్‌‌ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ చతికిలపడింది. కొన్ని ఎన్నికల్లో బీజేపీ కొంత మెరుగైన ఫలితాలు సాధించినా అది వాపు తప్ప బలం కాదని తర్వాతి పరిస్థితులు తెలియజేస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలంగాణలో బీఆర్‌‌ఎస్‌‌కు 70 నుంచి 75, కాంగ్రెస్‌‌కు 25 నుంచి 30, బీజేపీకి 5 నుంచి10, మజ్లీస్‌‌కు 7 నుంచి 9, ఇతరులకు 0 నుంచి1 స్థానాలొచ్చే అవకాశాలున్నట్లు శాస్త్రీయంగా నిర్వహించిన కొన్ని సర్వేల్లో వెల్లడైంది. బీఆర్‌‌ఎస్‌‌ కాంగ్రెస్‌‌పై దాదాపు పది శాతం ఓట్ల ఆధిక్యతతో ఉన్నట్టు ఈ సర్వేలలో కనిపిస్తోంది. ఈ సర్వేలలోని ఏ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్నా కాంగ్రెస్‌‌ అధికార బీఆర్‌‌ఎస్‌‌ పార్టీనీ ఢీకొట్టేందుకు ఇప్పుడున్న బలం సరిపోదని అర్థమవుతున్నది. 

మైనార్టీలపై దృష్టి ఏది?

కర్నాటక ప్రయోగంతో తెలంగాణలో గెలుస్తామని కాంగ్రెస్‌‌ జాతీయ, రాష్ట్ర నేతలు ఊదరగొడుతున్నా అవి ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. గ్రూపులను పక్కనపెట్టి విజయమే లక్ష్యంగా కర్నాటక కాంగ్రెస్‌‌ పనిచేస్తే ఇందుకు భిన్నంగా తెలంగాణ కాంగ్రెస్‌‌లో పార్టీ కంటే సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌‌లో సీఎం పోస్టు కోసం దాదాపు డజన్‌‌ మంది పోటీపడుతున్నారంటే అతిశయోక్తి కాదు. మరోవైపు కర్నాటకలో మైనార్టీ ఓట్లు చీలకుండా కాంగ్రెస్‌‌ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. తెలంగాణ కాంగ్రెస్‌‌ కీలకమైన మైనార్టీ ఓటు బ్యాంకుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు లేదు. కేంద్రం త్వరలో తీసుకురానున్న ‘యూసీసీ’ బిల్లును అస్త్రంగా చేసుకొని బీఆర్‌‌ఎస్‌‌, మజ్లీస్‌‌ ఇప్పటికే ముందుకు సాగుతుంటే, రాష్ట్ర కాంగ్రెస్‌‌ మాత్రం నిద్రావస్థలో ఉంది. క్షేత్రస్థాయిలోని వాస్తవాలను విస్మరిస్తూ కర్నాటక విజయం, వలసలు గెలిపిస్తాయనే భావిస్తే కాంగ్రెస్‌‌కు మరోసారి భంగపాటు తప్పకపోవచ్చు. రాహుల్‌‌ గాంధీపై కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌‌ బుధవారం ‘సత్యాగ్రహ మౌన దీక్ష’ చేపట్టింది. తెలంగాణలో ఎన్నికలు అయ్యే వరకు వివాదాస్పద అంశాల జోలికెళ్లకుండా రాష్ట్ర కాంగ్రెస్‌‌ నేతలు ‘మౌన సత్యాగ్రహం’ చేపడితే పార్టీకి ఎంతో మేలు చేకూరుతుందని గాంధీభవన్‌‌లో ద్వితీయ శ్రేణి నాయకులు, పార్టీ అభిమానులు వ్యాఖ్యానించడం గమనార్హం.

చేరికలతో కొత్త గ్రూపులు?

రేవంత్‌‌ రెడ్డికి వ్యతిరేకంగా ఏకమవుతున్న పార్టీ సీనియర్‌‌ నేతలు కూడా పార్టీ బాగు కంటే సొంత ప్రయోజనాలకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. రేవంత్‌‌ను వ్యతిరేకిస్తున్న కొందరు సీనియర్‌‌ నేతలు భట్టివిక్రమార్క పాదయాత్రకు ప్రాధాన్యం ఇచ్చినట్లు బయటికి కనిపించినా, వారి సొంత జిల్లాలకు వచ్చేసరికి మాత్రం ఆయన పాదయాత్రను నీరుగార్చేందుకు ప్రయత్నించినట్టు పార్టీలో ప్రచారముంది. పొంగులేటి సుధాకర్‌‌ చేరికతో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌‌ బలపడుతుందనడంలో సందేహం లేకపోయినా, కాంగ్రెస్‌‌ మొదటి నుంచి ఖమ్మంలో బలమైన పార్టీయే అన్నది వాస్తవం. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌‌ – టీడీపీ కూటమి ఖమ్మంలో తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది. 

పొంగులేటి చేరిక ముందు రెండు గ్రూపులున్న ఖమ్మం కాంగ్రెస్‌‌లో ఇప్పుడు ముచ్చటగా మూడో గ్రూపు ఏర్పడింది. మరోవైపు జూపల్లి మొదలుకొని పలువురు నేతలు కాంగ్రెస్‌‌లోకి క్యూ కడుతున్నారంటే అక్కడ వారికి మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో ఇక్కడికొస్తున్నారనేది సత్యం. వలస వస్తున్న సెగ్మంట్లలో ఇంతకాలం కాంగ్రెస్‌‌ బలోపేతానికి కృషి చేసి, టికెట్‌‌ ఆశించిన పార్టీ నేతలకు ఇప్పుడు వీరి రాక కాకపుట్టిస్తోంది. మొదటి నుంచి కాంగ్రెస్‌‌ బలంగా ఉన్న ఉమ్మడి ఖమ్మం, మహబూబ్‌‌నగర్, నల్గొండ, వరంగల్‌‌, రంగారెడ్డి జిల్లాల్లో ఈ వలసలతో అసమ్మతి తీవ్ర స్థాయిలో ఏర్పడి, ఎన్నికల నాటికి టికెట్ల కోసం కాంగ్రెస్‌‌ నుంచి ఇతర పార్టీలలోకి వలసలుండే అవకాశాలున్నాయి. వలసలతో ఇక విజయమే తరువాయి అన్నట్టు భావిస్తున్న కాంగ్రెస్‌‌ ‘కోవర్ట్‌‌’ అంశాన్ని విస్మరిస్తోంది.

సొంత గ్రూపులు..

మొదటి నుంచి పార్టీలో రేవంత్‌‌ వ్యవహార శైలి భిన్నంగానే ఉంటోంది. రాష్ట్రంలోని119 నియోజకవర్గాలలో తెలుగుదేశం నుంచి వచ్చిన వారు రేవంత్‌‌ వర్గంగా, మొదటి నుంచి పార్టీలో ఉన్న సీనియర్‌‌ నేతల అనుచరులు మరో వర్గంగా ఏర్పడ్డారు. ఐక్యంగా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన పీసీసీ అధ్యక్షుడు పలు సెగ్మంట్లలో గ్రూపులను ప్రోత్సహిస్తూ, పార్టీ కంటే తన మనుషులను గెలిపించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారని పార్టీలో ప్రచారం ఉంది. ఇటీవల ప్రకటించిన పలు మండలాల పార్టీ కమిటీలపై నిరసనలు చెలరేగడంతో గాంధీభవన్‌‌కు తాళాలు వేయాల్సి వచ్చింది. 

గత ఉప ఎన్నికల్లో మునుగోడులో పాల్వాయి స్రవంతిని గెలిపిస్తే భవిష్యత్తులో మంత్రిని చేస్తామని ప్రగల్భాలు పలికిన రేవంత్‌‌ ఇప్పుడు అక్కడ ఆమె వ్యతిరేకులతో మండల కమిటీని ఏర్పాటు చేయడంతో గాంధీభవన్‌‌ సాక్షిగా ఆమె నిరసన చేపట్టారు. కాంగ్రెస్‌‌లోకి షర్మిల రాకను రేవంత్‌‌ అడ్డుకుంటున్నారనే వార్తలున్నాయి. ఆమె రాకతో ప్రత్యర్థులకు ‘ఆంధ్ర – తెలంగాణ’ సెంటిమెంట్‌‌ అందించినట్టవుతుందని ఆయన భావిస్తున్నారు. 2018లో ఎన్నికల్లో కాంగ్రెస్‌‌తో టీడీపీ జత కట్టడంలో కీలక పాత్ర పోషించిన రేవంత్‌‌ ఆ ఎన్నికల్లో అదే సెంటిమెంట్‌‌తో మహా కూటమి మట్టికరవడం ఇంకా మర్చిపోనట్టున్నారు.

- ఐ.వి. మురళీకృష్ణ శర్మ, పీపుల్స్‌‌పల్స్‌‌ రీసెర్చ్‌‌ సంస్థ