బల్బు కనిపెట్టింది ఎవరు?.. ఇదేం ప్రశ్న, స్కూల్ పిల్లాడు కూడా టక్కున సమాధానం చెప్తాడు 'థామస్ అల్వా ఎడిసన్' అని, కానీ, ఎంత మందికి తెలుసు.. అప్పటికే 17 రకాల బల్బులు వాడకంలో ఉన్నాయని! బల్పు కనిపెట్టింది ఎవరనే విషయంపై అప్పట్లో పెద్ద వివాదమే నెలకొంది. ఆ కథేంటో, ఆ గొడవేంటో ఓ లుక్కేద్దాం.
ఎడిసన్ కనిపెట్టిన ప్రాక్టికల్ బల్బు 1879లో తొలిసారి ప్రపంచానికి పరిచయం అయ్యింది. అయితే అంతకంటే ముందే యూకేకి చెందిన హంప్రీ డేవీ అనే శాస్త్రవేత్త బ్యాటరీ, చార్కల్ స్టిక్స్ ద్వారా ఎలక్ట్రిక్ ల్యాంప్ ను కనిపెట్టాడు. ఈ డిజైన్ రిఫరెన్స్ గా తర్వాతి కాలంలో ఎంతో మంది మేధావులు బల్బుపై ప్రయోగాలు చేశారు. అయితే 19వ శతాబ్దానికి వచ్చేసరికి ఆయిల్, గ్యాస్ ల్యాంప్ తో పాటు ఎలక్ట్రిక్ ల్యాంప్ల వాడకం కూడా మొదలైంది. కానీ,వాటిల్లో ఇంధనం, కార్బన్ కడ్డీలు మార్చడం ఇబ్బందిగా మారింది. అంతేకాదు, అవి విడుదల చేసే యూవీ కిరణాలు మానవాళికి హానికరం కూడా.
వివిధ రకాల పదార్ధాలతో
దీంతో తర్వాతి కాలంలో కొందరు శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేశారు. 1840లో బ్రిటీష్ శాస్త్రవేత్త వారెన్ డె లా రూ. ప్లాటినం కాయిల్ తో నడిచే బల్బును కనిపెట్టాడు. కానీ, ప్లాటినం ఖరీదు ఎక్కువ కావడంతో కమర్షియల్ గా ఆ బల్బు విఫలమైంది. పీడనంతో పని చేసే బల్బును ఫ్రెడ్రిక్ డెమోలెయెన్స్ అనే సైంటిస్ట్ కనిపెట్టినా.. అది ప్రాక్టికల్గా వర్కవుట్ కాలేదు. తర్వాత మరికొందరు పరిశోధకులు రకరకాల బల్బులను కనిపెట్టారు. అయితే, 1850లో సదర్ ల్యాండ్కు చెందిన సర్ జోసెఫ్ విల్సన్ స్వాన్, కార్బోనైజ్డ్ పేపర్ ఫిలమెంట్లను ఉపయోగించి కనిపెట్టిన గాజు బల్బు చర్చకు దారితీసింది. తర్వాతి కాలంలో అతడే కొన్ని మార్పులు చేసి మరొక బల్బును రూపొందించాడు.
13 గంటలు వెలిగిన వరల్డ్ ఫస్ట్ బల్బు
1878లో స్వాన్ కనిపెట్టిన బల్బు ప్రయోగం సక్సెస్ అయ్యింది. పదమూడు గంటలకు పైగా ఆ బల్బు వెలిగి ప్రపంచంలోనే మొదటి విద్యుత్ బల్బుగా పేరు సాధించింది. దీంతో బల్బు విషయంలో పేటెంట్ హక్కులు పొందాడు కూడా. అయితే అమెరికన్ సైంటిస్ట్ థామస్ అల్వా ఎడిసన్ పరిశోధనలు కూడా దాదాపు స్వాన్ పరిశోధనలతో పాటే సమానంగా సాగాయి. స్వాన్ మందంగా ఉండే కార్బన్ ఫిలమెంట్ను వాడిన విషయాన్ని ఎడిసన్ గ్రహించాడు. హెన్నీపుడ్వర్డ్, మాథ్యూ ఎవెన్స్ అనే సైంటిస్టుల నుంచి పేటెంట్ ను కొనుగోలు చేసి బల్బును తయారు చేశాడు. డిసెంబర్ 1879లో ఎడిసన్ చేసిన బల్బు ప్రయోగం సక్సెస్ అయ్యింది. ఆ బల్బు 40 గంటలపాటు వెలిగి రికార్డు సృష్టించింది. అయితే, అప్పటికే బల్బు కనిపెట్టింది తానేనని స్వాన్ ఒక ప్రకటన చేసేశాడు.
స్వాన్ పై కేసు
దీంతో ఎడిసన్ 'పేటెంట్ హక్కుల ఉల్లంఘన' కింద స్వాన్ పై కేసు వేశాడు. చివరకు స్వాన్తో సంధి చేసుకునేందుకు ఎడిసన్ మొగ్గు చూపాడు. 1883లో వీరిద్దరూ కలిసి 'ఎడిసన్ అండ్ స్వాన్ యునైటెడ్ ఎలక్ట్రిక్ లైట్' కంపెనీని స్థాపించారు. ఈ కంపెనీని 'ఎడిస్వాన్' అని పిలిచేవారు. 1881లో స్వాన్ సెల్యూలోజ్తో చేసిన ఫిలమెంట్ బల్బును కనిపెట్టాడు. ఎడిస్వాన్ కంపెనీ తర్వాతి కాలంలో స్వాన్ కనిపెట్టిన ఫిలమెంట్ బల్బులనే విక్రయించేది. నిజానికి ఎడిసన్ పరిశోధనలు తొలిదశలో ఉన్న సమయంలో ఇరవై మంది ఆవిష్కర్తలు బల్బు పేటెంట్ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నారంట. అయితే ప్రాక్టికల్ ఎడిసన్ కనిపెట్టిన బల్బుకు గుర్తింపు దక్కడంతో బల్బు కనిపెట్టిన ఘనత ఎడిసన్ ఖాతాలో చేరింది.