కమ్ముకుంటున్న కాంతి కాలుష్యం

కమ్ముకుంటున్న కాంతి కాలుష్యం

ఇటీవలే మనం చంద్రుడిపైకి ప్రజ్ఞాన్‌‌ను పంపి విజయం సాధించాం. దాదాపు 50 సంవత్సరాల క్రితమే మానవుడు చంద్రుడిపై అడుగుపెట్టాడు అని చరిత్ర రాసుకున్నాం. మరి భూమి మీద ఉన్న మనం చంద్రుడిని సరిగ్గా చూడగలుగుతున్నామా? ఆకాశంలో చంద్రుడి వెన్నెలను, చుక్కలను ఆస్వాదించగలుగుతున్నామా?

మన మహానగరం హైదరాబాద్‌‌లో ప్రజలు  ఆహ్లాదంగా  వెన్నెల రాత్రులను, ఆకాశంలో కనిపించే చుక్కలను ప్రజలు చూడలేకపోతున్నారు.  అవును. ఇప్పుడు భూమిని కాంతి కాలుష్యం కమ్మేస్తోంది. ఇది నిజం. భూమిపై విపరీతంగా వాడుతున్న ఎల్‌‌ఈడి లైట్ల కాంతుల వలన కాంతి కాలుష్యం వెలువడి ఆకాశంలో వెన్నెల, చుక్కలు కూడా కనిపించకుండా పోతున్నాయి. విపరీతమైన విద్యుత్‌‌ కాంతులు, వీధిదీపాల వెలుగులు, బహుళ అంతస్తుల, వ్యాపార సముదాయ అంతస్తుల నుంచి వెలువడే ఎల్‌‌ఈడి లైట్ల కాంతులు విశ్వనగరంగా మారిన హైదరాబాద్‌‌ నగరంలో ఆకాశానికి, భూమికి మధ్య తెరలా పరుచుకుపోతున్నాయి. ఇలా ఏర్పడుతున్న కాంతి కాలుష్యం వల్ల ఆకాశంలో చందమామ, నక్షత్రాలు, తోకచుక్కలు, ఉల్కలును చూడటం కష్టంగా మారింది.

హైదరాబాద్​దే మొదటి స్థానం

ఒడిశా రాష్ట్రానికి చెందిన సెంచూరియన్‌‌ యూనివర్సిటీ ఆఫ్‌‌ టెక్నాలజీ అండ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌ అనే సంస్థ ఆధ్వర్యంలో మన దేశంలో ఎనిమిది ప్రధాన నగరాల్లో చేపట్టిన అధ్యయనంలో కాంతి కాలుష్యంలో హైదరాబాద్‌‌ మొదటి స్థానంలో ఉందని తేలింది.  మనదేశంలో ఈ పరిస్థితి 2014 నుంచి ప్రారంభమైందని ఈ అధ్యయనం వివరించింది. ఇటీవల ఈ అధ్యయనం ఇంటర్నేషనల్‌‌ జర్నల్‌‌ ఆఫ్‌‌ అడ్వాన్స్‌‌డ్‌‌ రీసెర్చ్‌‌లో ప్రచురితమైంది. విద్యుత్తు వెలుగుల ద్వారా కమ్ముకునే కాంతి కాలుష్యాన్ని ప్రకాశాన్ని యూనిట్‌‌ ఆఫ్‌‌ లూమినస్‌‌ ఇంటెన్సిటీతో కొలుస్తారు. సీయూటీఎం అధ్యయనంలో ఈ తీవ్రత హైదరాబాద్‌‌ నగరంలో ప్రతి చదరపు కిలోమీటర్‌‌కు 7,790 యూనిట్లుగా ఉంది. కోల్‌‌కతా7,480 యూనిట్లు, ఢిల్లీ 7,270 యూనిట్లతో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. శాటిలైట్‌‌ చిత్రాల ద్వారా ఎనిమిది ప్రధాన నగరాల్లో లూమినస్‌‌ ఇంటెన్సిటీని గుర్తించామని సీయూటీఎం అధ్యయనం వెల్లడించింది. హైదరాబాద్‌‌, కోల్‌‌కతా, ఢిల్లీ తర్వాతి స్థానాల్లో చెన్నై,  ముంబై, అహ్మదాబాద్‌‌ ఉండగా.. భువనేశ్వర్‌‌  చివరి స్థానంలో నిలిచింది. 2014-–17 మధ్యకాలంలో ఈ అధ్యయనాన్ని చేపట్టినట్లు ప్రొఫెసర్‌‌ శివప్రసాద్‌‌ మిశ్రా తెలిపారు. హైదరాబాద్‌‌లో ఎల్‌‌ఈడి లైట్ల వినియోగం పెరగడం వల్ల కాంతి కాలుష్యం ఎక్కువైందని విశ్లేషించారు.

ప్రపంచ సమస్యగా మారింది

కృత్రిమ కాంతి ఇప్పుడు ప్రపంచ సమస్య. శాటిలైట్‌‌ ఉపగ్రహాల సమాచారం ప్రకారం భూమి రాత్రి సమయాలలో కూడా ఎలా వెలిగిపోతోందో అని 2016లోనే ఒక సర్వే వివరాలు ప్రచురితమయ్యాయి. ఉత్తర అమెరికా, యూరప్‌‌, మిడిల్‌‌ ఈస్ట్‌‌ ఆసియా ఖండాలు కృత్రిమ వెలుగుతో వెలిగిపోతుంటే, రిమోట్‌‌ ప్రాంతాలైన సైబీరియా, సహారా, అమెజాన్‌‌ లాంటి ప్రాంతాలు చీకటిలో ఉంటున్నాయి. అత్యధిక కృత్రిమ వెలుగు కాలుష్యానికి గురవుతున్న దేశాలు సింగపూర్‌‌, ఖతార్‌‌, కువైట్‌‌గా నివేదికలు చెబుతున్నాయి. అమెరికా మెడికల్‌‌ అసోసియేషన్‌‌ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచ జనాభాలో  దాదాపు 80% , అమెరికా, యూరప్‌‌ దేశాలలో నివసించే 99% ప్రజలు ఈ కృత్రిమ వెలుగులో జీవితాలు సాగిస్తున్నారు.  ఈ కాంతి కాలుష్యం మనకు తెలియకుండానే మనుషులలో నిద్రలేమి, తలనొప్పి, మానసిక ఒత్తిడి, గుండె లయతప్పడం, హార్మోన్ల అసమతుల్యత వంటి అనారోగ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలిపింది. సముద్ర తాబేలు, పక్షులు వంటి జీవరాశి వాటి పునరుత్పత్తి ప్రక్రియ సహజకాంతిపైన ఆధారపడి ఉంటుంది. 

జీవరాశి పునరుత్పత్తి ప్రక్రియకు ఆటంకం

కొన్ని ప్రాంతాలలో మన అభివృద్ధి కోసం సముద్రాలలో కూడా ఆయిల్‌‌ రిగ్గింగ్‌‌, ఇతర ఖనిజాల అన్వేషణ కోసం ఏర్పాటు చేసిన కృత్రిమ కాంతి వలన సముద్రజీవుల జీవన విధానం కూడా ప్రమాదంలో పడింది. ఈ కాంతి వలన తిమింగలాలు, డాల్ఫిన్లు, తాబేళ్ల వంటి జీవరాశి పునరుత్పత్తి ప్రక్రియకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ఈ పరిణామం ప్రమాదకరంగా మారుతుండడంతో అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో పక్షుల పునరుత్పత్తి  ప్రక్రియకు అంతరాయం కలుగకుండా పెద్ద అపార్టుమెంట్లలో నివాసం ఉంటున్న ప్రజలు స్వచ్ఛందంగా “లైట్స్‌‌ అవుట్‌‌” అంటూ పక్షులు వలస వచ్చిన సమయాలలో కాంతి కాలుష్యం లేకుండా తమ తమ నివాసాలలోని లైట్లను ఆర్పివేస్తున్నారు. ఇలాంటి అవగాహన మనదేశంలో కూడా రావాలి. ఇప్పుడిప్పుడే పూర్తి నగరీకరణగా మారుతున్న భారతదేశంలో, ఏ చట్టాలనూ గౌరవించని ప్రజలు, ఏ చట్టాలనూ కఠినంగా అమలు చేయలేని ప్రభుత్వాలు ఉన్న మన విశిష్ట దేశంలో పూర్తిస్థాయి పర్యావరణ విఘాతం కలుగక ముందే కళ్లు తెరిస్తే, మరికొన్నాళ్లు మన భావితరాలు, పిల్లలు అందమైన ఆకాశాన్ని అందులోని చంద్రుడిని, నక్షత్రాలను, వింతలను విశేషాలను స్వచ్ఛందంగా చూడగలుగుతారు. 

ఎల్ఈడి లైటింగ్​తో కాంతి అసమతుల్యం

ప్రపంచమంతా పర్యావరణ పరిరక్షణ కోసం, విద్యుత్‌‌ వినియోగం ఆదా చేయడం కోసం ఎల్‌‌ఈడి లైటింగ్‌‌ను వాడడం మొదలుపెట్టారు. అయితే విచ్చలవిడిగా వాడడం వలన పగలు-రాత్రి తేడాగా ఉండాల్సిన సహజమైన కాంతి అసమతుల్యం అవుతోంది. ఎల్‌‌ఈడి లైటింగ్‌‌ వలన కృత్రిమ వెలుగు ఎక్కువగా వెలువడి బెట్‌‌దోర్‌‌ సర్ఫేస్‌‌ 2012 నుంచి 2016 వరకు 2.2 శాతం పెరిగిందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ కృత్రిమమైన వెలుగుల వలన పర్యావరణ అసమతుల్యం పెరిగి రాత్రింబవళ్లు తిరిగే కీటకాలు, జంతువులకు ప్రమాదం వాటిల్లుతోంది.  మొక్కల జీవావరణ వ్యవస్థ కూడా విఘాతం కలుగుతోంది. మానవ జీవన విధానానికి, ఆర్యోగానికి తీవ్రమైన విఘాతం కలుగుతోంది. ఈ కృత్రిమ వెలుగు వలన మనుషుల నిద్రపైనా పెనుప్రభావం చూపుతోంది. దీని వలన మనకు తెలియకుండానే మధుమేహం, రక్తపోటు, డిప్రెషన్‌‌ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలా ఆకాశంలో కృత్రిమ వెలుగు ప్రతి సంవత్సరం 6 శాతం పెరుగుతోందని అధ్యయనం చెబుతోంది.

- మోతె రవికాంత్‌‌ వ్యవస్థాపక అధ్యక్షుడు - సెఫ్‌‌