- బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావంతో కురిసే చాన్స్
హైదరాబాద్, వెలుగు: బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలో గురువారం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, వరంగల్, హనుమకొండ, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు పడ్డాయి.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో 7.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఖమ్మం జిల్లా పెద్దగోపటిలో 6.9 సెంటీ మీటర్లు, నిర్మల్ జిల్లా బుట్టాపూర్‌లో 5.7, రంగారెడ్డి జిల్లా రెడ్డిపల్లిలో 5.7, మహబూబాబాద్ జిల్లా పెరుమాండ్ల సంకీశలో 5.6, మెదక్ జిల్లా అల్లాదుర్గ్‌లో 4.5 సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది. హైదరాబాద్‌లోను సాయంత్రం 4 గంటలకు పలు చోట్ల వర్షం పడింది.
సైదాబాద్‌లో అత్యధికంగా 4.1 సెంటీ మీటర్ల వర్షపాతం..చార్మినార్‌లో 4, బండ్లగూడలో 3 సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది. ఒక్క జనగామ జిల్లాలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలలోపే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనగామ జిల్లా జాఫర్ గఢ్‌లో 40.6 డిగ్రీల టెంపరేచర్ రికార్డయింది. అత్యల్పంగా నారాయణపేట జిల్లా కొత్తపల్లిలో 30.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. జోగులాంబ గద్వాల జిల్లాలో 31.1, వనపర్తి జిల్లాలో 31.6, మహబూబ్‌నగర్‌లో 33.8 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.