
అకాల వర్షాలతో హైదరాబాద్ వాతావరణం వానాకాలాన్ని తలపిస్తోంది. తీవ్రమైన ఈదురు గాలులతో చెట్లు విరిగిపడుతున్నాయి. అక్కడక్కడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. తాజాగా ఒక అపార్ట్ మెంట్ పై పిడుగు పడటంతో ఘోర ప్రమాదం తప్పింది. ఉన్నట్లుండి పెద్ద శబ్దంతో పిడుగు పడి గోడ కూలిపోవడంతో అపార్ట్ మెంట్ వాసులు భయాందోళనలకు గురయ్యారు.
తార్నాకలోని ఎన్వీఆర్ స్నిగ్ధ అపార్ట్మెంట్ పై పిడుగు పడటం కలకలం రేపింది. శుక్రవారం (ఏప్రిల్ 4) మధ్యాహ్నం ప్రవారీ గోడ పై పిడుగు పడటం ఆందోళనకు గురిచేసింది. అపార్ట్ మెంట్ 5వ అంతస్తు పైన పిడుగు పడటంతో గోడ స్వల్పంగా ధ్వంసం అయ్యింది. పిడుగు శబ్బం విని జనం ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు.
ఉన్నట్లుండి ఒక్కసారిగా భారీ శబ్దంతో పిడుగు పడిందని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు. గోడ విరిగిపడి ఇటుక పెల్లలు తమ గార్డెన్ లో పడిపోయాయని చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. పెద్ద పెద్ద బిల్డింగుల వద్ద పిడుగు నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు.
గత కొన్ని రోజులుగా వేసవి ఎండల వేడితో ప్రజలు సతమతమవుతున్న వేళ.. మారిన వాతావరణం (weather) కాస్త ఉపశమనం కలిగించింది. తెలంగాణ, కోస్తా, మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లో భారీ వర్షం కురిసింది.
అలాగే దీని ప్రభావంతో పలు జిల్లాల్లో చల్లని వాతావరణం నెలకొంది. వాతావరణ శాఖ అంచనా మేరకు వచ్చేనాలుగు రోజుల పాటు నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లోను మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.రానున్న నాలుగు రోజులు కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.