
- ఇద్దరి పరిస్థితి విషమం
బచ్చన్నపేట, వెలుగు : పిడుగుపాటుతో ఎనిమిది మంది రైతులు స్పృహ తప్పి పడిపోయారు. ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన జనగామ జిల్లా బచ్చన్నపేట మండంలోని ఆలింపూర్ గ్రామ సమీపంలో శుక్రవారం సాయంత్రం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... గ్రామానికి చెందిన కొందరు రైతులు తమ వడ్లను కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చారు. శుక్రవారం సాయంత్రం వడ్లను కుప్ప చేస్తుండగా ఒక్కసారిగా వర్షం పడడంతో వారంతా పక్కనే ఉన్న చెట్టు కిందికి వెళ్లారు. ఇదే టైంలో పిడుగు పడడంతో వంగపల్లి సుశాంత్‌రెడ్డి, పారిపెల్లి నందిని, వంగపల్లి రంగారెడ్డి, బీంరెడ్డి జనార్దన్‌రెడ్డి, బీంరెడ్డి భారతమ్మ, దండ్యాల మల్లారెడ్డి, ఊడెం మంగమ్మ, పాకాల మల్లయ్యలు స్పృ-హ తప్పి పడిపోయారు. గమనించిన స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా జనగామ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. ఇందులో సుశాంత్‌రెడ్డి, నందిని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
పిడుగుపాటుతో 50 జీవాలు మృతి
రాజాపేట/యాదగిరిగుట్ట, వెలుగు : పిడుగుపాటుతో 50 జీవాలు చనిపోయాయి. వివరాల్లోకి వెళ్తే... యాదాద్రి జిల్లా రాజాపేట మండలం రేణికుంటకు చెందిన బండి మల్లయ్య తన గొర్రెలు, మేకలను చెట్టు కింద నిలిపాడు. ఇదే టైంలో ఈదురుగాలులు, వర్షానికి తోడు చెట్టు పక్కనే పిడుగు పడడంతో 50 జీవాలు చనిపోయాయి. దీంతో రూ. 5 లక్షల వరకు నష్టం జరిగినట్లు మల్లయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.