Ligier Mini EV: అప్పట్లో నానో.. ఇప్పుడు లిజియర్: లక్ష రూపాయల ఎలక్ట్రిక్ కారు రాబోతోంది

టాటా నానో(Tata Nano).. భారత ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కలల కారు నానో అందరికీ సుపరిచతమే. 2008లో కేవలం లక్ష రూపాయల ధరతో సామాన్యులకు సైతం అందుబాటులో ఉండేలా నానో కారు తీసుకురావడం అప్పట్లో సంచలన విషయం. ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు కూడా అదే. అచ్చం అదే తరహాలో ఇప్పుడు ఎలెక్ట్రిక్ కారు భారత మార్కెట్‌లోకి రాబోతోంది. 

ALSO READ | 3నెలల్లో 3.41లక్షల బండ్లు అమ్మినం.. టాటా గ్రూప్

ఫ్రెంచ్ కంపెనీ లిజియర్ భారత మార్కెట్‌లో మినీ ఎలక్ట్రిక్ కారు(Ligier Mini EV)ను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల టెస్టింగ్ సమయంలో ఈ కారు భారత మార్కెట్ లో కనిపించింది. 2 సీటర్ మినీ ఎలక్ట్రిక్ కారు ఇది. చౌక ధరలోనే ఈ కారును తీసుకురానున్నట్లు మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. రూ. లక్ష ప్రారంభ ధరతో అందుబాటులోకి రానుందని నివేదికలు చెప్తున్నాయి. చవకైన ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తున్న వారికి ఇదొక గొప్ప ఎంపిక. బైక్‌కు పెట్టే ధరతో ఎంచక్కా కారు కొనేసి నగర రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్లొచ్చు.

లిజియర్ మినీ ఈవీ ఫీచర్స్

  • 2 సీటర్ మినీ ఎలక్ట్రిక్ కారు ఇది. 
  • ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే.. 63 కి.మీ నుండి 192 కి.మీ వరకు ప్రయాణించవచ్చు.
  • దీని పరిమాణం 2958 mm పొడవు, 1499 mm వెడల్పు, 1541 mm ఎత్తు. 
  • రద్దీ ప్రదేశాల్లో తిరిగే వారికి, తక్కువ పార్కింగ్ ప్లేస్ ఉన్న వారికి ఈ కారు అనుకూలంగా ఉంటుంది. 
  • ఈ ఎలక్ట్రిక్ కారుకు కేవలం రెండు డోర్లు మాత్రమే ఉంటాయి. 
  • 12 నుండి 13-అంగుళాల చక్రాలను కలిగి ఉంటుంది.
  • 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్, పవర్ స్టీరింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ విత్ హీటెడ్ డ్రైవర్ సీట్, కార్నర్ ఏసీ వెంట్ వంటి ఇంటీరియర్ ఫీచర్లు ఇందులో చూడవచ్చు.

Ligier Mini EV నాలుగు వేరియంట్‌లలో అందుబాటులోకి రానుంది. G.OOD, I.DEAL, E.PIC, R.EBEL. తద్వారా డ్రైవింగ్‌లో విభిన్న అభిరుచులు ఉన్న వారు ఏది నచ్చితే అది కొనుగోలు చేయవచ్చు. ఈ వేరియంట్‌లలో ప్రతి ఒక్కటి మూడు బ్యాటరీ ప్యాక్‌లతో అమర్చబడి ఉంటుంది. 4.14 kWh, 8.2 kW, 12.42 kWh. కొనుగోలు చేసే మోడల్ ను బట్టి సింగిల్ ఛార్జీకి 63 కిమీ నుండి 192 కిమీ వరకు రేంజ్ ఉంటుంది.